సుప్రభాత కవిత : -బృంద
విచ్చుకున్న పువ్వుల
పచ్చని పసి నవ్వులో
పుడమి తల్లి మెత్తని
అంతరంగం పరచినట్టు...

పంచుతున్న పరిమళంలో 
మమతలన్నీ  రంగరించి 
మలయానిలపు రాయబారం 
మనసుతీరా పంపుతున్నట్టు...

సరసనే నిలబడి ఆసరాగా
గిరులు తరులు ఝరులు
సుమబాలల సుందరముగా
ముస్తాబు చేసినట్టు....

వెచ్చగా నేరుగా తాకే 
స్వచ్ఛమైన కాంతులన్నీ 
అచ్చంగా తనకోసమే అని 
ముచ్చటపడి మురిసినట్టూ..

భువిని విరిసిన హరితవనాన్ని 
దివిని తలపించు సోయగాన్ని
రవికి చేరవేయాలని తిరుగుతూ
మురిపంగా చూస్తున్నట్టూ..

మధువనం లొ మధుపాలు
మధురంగా పాడుతూ
మకరందం కోసం అల్లరిగా
తోటంతా తిరుగుతున్నట్టు....

భువనానికి ఆమని వచ్చినట్టు 
కువలయం కులుకుతున్నట్టు 
పుడమికి పుత్తడి తొడిగినట్టు 
ఎడదకు  పండుగ తెచ్చినట్టు

వచ్చే సరికొత్త వేకువకు వందనమిడుతూ...

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు