బహుమతి : సరికొండ శ్రీనివాసరాజు
     "తీయతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ" అని పాట పాడుకుంటూ ఇంట్లో పని చేస్తుంది శ్రుతి. "అస్తమానం ఎప్పుడూ ఏవో పాటలు పాడుకుంటూ మా చెవులు చిల్లులు పడేస్తున్నావు. ఆ పాటలు ఆపు. వినలేకపోతున్నా." అన్నది శ్రుతి వాళ్ల అమ్మ శర్వాణి. "అమ్మా! నా పాటలు అంత కర్ణ కఠోరంగా ఉంటున్నాయా? ఎప్పుడూ తిడుతుంటావు?" అన్నది శ్రుతి. "ఎవరు చేయాల్సిన పని వారే చేస్తే బాగుంటుంది. నువ్వు చేయాల్సిన పని చదువుకోవడమే." అన్నది శర్వాణి. శ్రుతి ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మరునాడు పాఠశాల విరామ సమయంలో కలసి తింటున్నారు విద్యార్థులు. "నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు." అంటూ పాడుకుంటూ అన్నం తింటుంది లయ. "చాలా బాగా పాడుతున్నావు." అంటూ ప్రశంసించింది శివాని. "నాకు అలా పాడుకునే అదృష్టం లేదు. ఇంట్లో ఎప్పుడూ తిట్లే." అన్నది శ్రుతి. "ఇంట్లో ప్రోత్సాహం లేనంత మాత్రాన మన అభిరుచి మానుకుంటామా? బయట పాడుకో. మాతో ఆడుతూ పాడుతూ గడుపు." అన్నది సుశీల. సంతోషించింది శ్రుతి. 
      స్నేహితులు తీరిక సమయంలో పాటలు పాడుతూ ఆడుకుంటున్నారు. పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం జరుగుతుంది. సమావేశ అనంతరం పిల్లల మధ్య వివిధ పోటీలు నిర్వహించినారు. పాటల పోటీ కూడా జరుగుతుంది. శ్రుతి "పిల్లలూ దేవుడూ చల్లని వారే", "మాటలకందని భావాలు" అనే రెండు పాటలు పాడింది. పాటల పోటీ పూర్తి అయింది. ఫలితాలు వారం తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. ఇంటికి వచ్చాక శ్రుతిని దగ్గరకు తీసుకుని చాలాసేపు పొగిడింది తల్లి శర్వాణి. "ఎంత బాగా పాడినావు తల్లీ. అందరి ముందూ నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేశావు. నిన్ను ఎంత పొగిడినా తక్కువే. ఖచ్చితంగా మొదటి బహుమతి నీదే." అన్నది శర్వాణి. ఆనందం తట్టుకోలేక బోరున ఏడ్చింది శ్రుతి. "అమ్మా! నాకు బహుమతి రాకున్నా బాధ లేదు. దాని గురించి ఎదురు చూడను. నువ్వు బాగా మెచ్చుకున్నావు కదా! అదే నాకు పెద్ద బహుమతి." అన్నది శ్రుతి. చదువుతో పాటు ఇతర కళలపై అభిరుచి పెంచుకుంటే మంచిదని గ్రహించింది శర్వాణి.

కామెంట్‌లు