కొడంగల్ నియోజకవర్గంలో హరేరామ హరే కృష్ణ ఆధ్వర్యంలో పాఠశాలలకు అల్పాహార నిమిత్తం
అక్షయపాత్ర కు భూమి పూజ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
===================================================================
ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్‌లో హరేకృష్ణ సంస్థ (HKM) వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) ను పరిశీలించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ (Akshaya Patra Foundation) ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు.
ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కొండగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ప్రణాళికలను ఆవిష్కరించారు.
ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నాం.
ఇంట్లో అమ్మ ఏ విధంగా ఆలోచన చేస్తుందో, అదే విధంగా అక్షయపాత్ర సహకారంతో నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం పెడుతున్నాం. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బాధ పడకూడదు. ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోవద్దని విద్యార్థులకు ఆల్పాహారం పెట్టాలని నిర్ణయించాం. మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నాం.
కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతున్నాం. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియో థెరఫీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్‌ను కొడంగల్‌లో ప్రారంభించుకోబోతున్నాం.
రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కొడంగల్ పిల్లలను భాగస్వామ్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 వేల కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను నిర్మించుకుంటున్నాం. గొప్ప చదువు చదవాలంటే కొడంగల్ వెళ్లే విధంగా తీర్చిదిద్దాలని క్యాంపస్‌ను నిర్మిస్తున్నాం. 16 నెలలు తిరిగే లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం.
కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాలను కృష్ణా నదీ జలాలతో తడపాలని, ప్రతి ఎకరాకు నీరివ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడమే కాకుండా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించాం.
భూ సేకరణ విషయంలో 95 శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని భూములిచ్చారు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయి. రైతులు అడిగిన ఇండ్లు, నష్టపరిహారం ఇచ్చాం. లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాం. కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. ఇక్కడి పిల్లలకు విద్యతో పాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తున్నాం.ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ , వాకిటి శ్రీహరి , జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి