సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము సప్తమాశ్వాసము:-42 వ రోజు
ద్రౌపదిని భీమార్జునులు కుంతీవద్దకు తీసుకు వెళ్ళుట
కుంతీదేవి విడిదిలో ఆందోళన పడసాగింది. స్వయంవరానికి వెళ్ళిన పాండవులు ఎంతకీ రాక పోయేసరికి దుర్యోధనాదులు గుర్తించి చంపివేసేరేమోనని కలత పడింది. ముందుగా ధర్మరాజు నకుల సహదేవులు వచ్చారు. తరువాత అర్జునుడు భీముడు ద్రౌపదితో వచ్చారు. రాగానే అర్జునుడు కుంతీ దేవితో " అమ్మా ! మేము ఒక బిక్ష తీసుకు వచ్చాము " అన్నాడు. వారిని చూడకుండానే కుంతీ " మీరు ఐదుగురు ఉపయోగించండి " అని చెప్పింది. ఆ తరువాత కొడుకు తీసుకు వచ్చింది ఒక కన్యనని తెలుసుకుని అధర్మం పలికినందుకు భయపడింది. ఆమె " ధర్మరాజా ! ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను. ఇది అధర్మం, లోక విరుద్ధం. ఇప్పుడు ఏమి చేయాలి?" అని అడిగింది. అప్పుడు ధర్మరాజు అర్జునిని చూసి " అర్జునా ! ఈమెను నీవు గెలుచు కున్నావు కనుక నీవు వివాహం చేసుకో " అన్నాడు. అందుకు అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! పెద్ద వారు మీరుండగా నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు. ఈమెను మీరు వివాహం చేసుకొండి " అన్నాడు. ధర్మరాజు " మనలో మనకు తగువెందుకు మనం అయిదుగురం వివాహం చేసుకుంటాము " అన్నాడు. శ్రీ కృష్ణుడు బలరామ సహితంగా అక్కడకు వచ్చి తనని తాను పరిచయం చేసుకుని ధర్మరాజుకు కుంతీ దేవికి నమస్కరించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో బ్రాహ్మణ వేషాలలో ఉన్న మమ్మలిని ఎలా గుర్తు పట్టారు. అన్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా ! సూర్యని మేఘములు కమ్మినంత మాత్రాన తేజస్సు దాగుతుందా ! మీరు ఏ వేషంలో ఉన్నా మీ తేజస్సు మిమ్మలిని గుర్తించేలా చేసింది. మత్స్యయంత్రాన్ని అర్జునుడు కాక మరెవ్వరు ఛేదించగలరు. ఎలాగో లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు. మీకు శుభం కలుగుతుంది " అని చెప్పి బలరామునితో వెళ్ళి పోయాడు.
దృపదుడు పాండవుల పుట్టుపూర్వోత్తరాలు కనుగొన ప్రయత్నించుట
దృపదుడు కుమారుని పిలిచి " దృష్టద్యుమ్నా ! ఎవరో బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకు వెళ్ళారు. నీవు పోయి వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని రా " అని చెప్పాడు. దృష్టద్యుమ్నుడు భీమార్జునుల వెంట వెళ్ళి జరిగినది చూసివచ్చాడు. దృపదునితో " తండ్రీ ఆ ఇరువురూ ద్రౌపదిని తీసుకుని ఒక వయసు పైబడిన స్త్రీకి చూపించారు. అందరూ ఆమెకు నమస్కరించారు. అందులో పెద్దవాడు చెప్పినది విని మిగిలిన నలుగురు వెళ్ళి బిక్ష తీసుకుని వచ్చారు. అందులో కొంత భాగం బలి దానాలకు, అతిథులకు పెట్టారు. మిగిలిన దానిలో సగభాగం బలిష్టుడైన రెండవ వానికి పెట్టారు. మిగిలినది మిలినవారు తిన్నారు. చెల్లి ద్రౌపది వారికి విసుక్కోకుండా సేవలు చేసింది. వారందరికి దర్భలతో పడకలు తయారు చేసింది. వారంతా ఏనుగులు, గుర్రాలు, యుద్ధాలు గురించి మాట్లాడు కుంటున్నారు. వారి నడవడి బ్రాహ్మణుల వలె లేదు శ్రేష్టమైన రాజకుమారుల వలె ఉన్నారు " దృష్టద్యుమ్నుడు చెప్పాడు. అయినా దృపదునికి నమ్మకం కురదక తన పురోహితుని పిలిచి " విప్రోత్తమా ! నీవు వెళ్ళి వారి వద్దకు పుట్టు పూర్వోత్తరాలు కనుక్కుని రా " అని పంపాడు. పురోహితుని చూసి ధర్మరాజు తగిన విధంగా సత్కరించాడు. ఆ పురోహితుడు ధర్మరాజుతో " బ్రాహ్మణోత్తమా ! దృపదుడు ఆడపిల్ల తండ్రి కదా. మీ కులగోత్రాలు అడిగి రమ్మన్నాడు " అన్నాడు. ధర్మరాజు " విప్రోత్తమా ! మీ రాజు మత్స్యయంత్రం కొట్టిన వాడికి పిల్లనిస్తానని చెప్పాడు. మా సోరదరుడు సాధించాడు. మా కులగోత్రాలు తెలుసుకుని ఏమి చేస్తాడు? వీరుడు కాని వారు మత్స్యయంత్రం కొట్టగలరా ? మీ మహారాజు కోరిక తీరింది కదా విచారమేల? " అని మర్మంగా మాట్లాడాడు. చేసేది లేక ఆ విప్రుడు ఆ విషయాన్ని దృపదునికి చెప్పాడు.
 
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు