సాధన చేస్తే : -సరికొండ శ్రీనివాసరాజు
 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో వివిధ ఆటలపోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా క్యారమ్స్ పోటీలు జరుగుతున్నాయి. హరి ఆ ఆటలో అద్వితీయమైన ప్రతిభను చాటుతూ ఆ ఆటలో ఛాంపియన్ అయ్యాడు. అందరూ హరిని తెగ మెచ్చుకుంటున్నారు. రంగకు హరిలా పేరు తెచ్చుకోవాలని, అప్పుడు తనను కూడా అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. రంగ హరి వద్దకు వచ్చి, "హరీ! నువ్వు క్యారమ్స్ ఆడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. గురి చూసి కాయిన్స్ ను చాలా అలవోకగా పడేస్తుంటావు. నీలా చక్కగా ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కానీ నాకు ఎంత ఆడినా ఆట సరిగా రాదు." అన్నాడు.  "నేను ఉండగా నీకు ఆట రాదనే దిగులు దండగ." అన్నాడు హరి. 
     రంగ హరి వద్ద క్యారమ్స్ నేర్చుకోవవడం మొదలు పెట్టాడు. తానూ ఛాంపియన్ అయ్యి అందరి మెప్పునూ పొందాలనే కోరిక రంగ మనసులో బలంగా ఉంది. ఆట పైనే పూర్తి ఏకాగ్రత చూపించాడు. హరి వద్ద మెలకువలు పూర్తిగా నేర్చుకున్నాడు. ఆట మీద పూర్తి ఏకాగ్రత మూలంగా రంగకు తొందరలోనే క్యారమ్స్ పర్ఫెక్టుగా వచ్చింది. ఇప్పుడు రంగ కూడా ఛాంపియన్. 
     అందరి వద్దా గొప్పలు చెప్పుకుంటున్నాడు రంగ. అప్పుడు మహేంద్ర రంగ వద్దకు వచ్చి, "ఇంత ప్రతిభావంతుడివి మరి ఇదే శ్రద్ధ చదువు మీద ఎందుకు చూపిండం లేదు?" అని అడిగాడు. "నాకు అస్సలు అర్థం కావు పాఠాలు. బాబోయ్ చాలా కఠినం. చదువులో మీ అంత తెలివితేటలు నాకు దేవుడు ఇవ్వలేదు." అన్నాడు రంగ. "మరి నీకు అసలే ఆడరాని క్యారమ్స్ లో ఎలా ఛాంపియన్ అయ్యావు. నాకు రాదు అనే న్యూనతా భావంతో ఉంటే ఏదీ రాదు. ఏకాగ్రతతో వింటూ సాధన చేస్తే ఏదైనా అవలీలగా వస్తుంది. నువ్వు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినవు. అందుకే నీకు ఏదీ అర్థం కాదు, రాదు. నువ్వు క్యారమ్స్ లో ఛాంపియన్ కావాలనే పట్టుదలతో ఏకాగ్రతతో సాధన చేసి గెలిచావు. ఇదే  ఏకాగ్రత, పట్టుదల పాఠాలను వినడంలో, కష్టపడి చదవడంలో చూపించు. అలాగే ఉపాధ్యాయుల, తెలివైన విద్యార్థుల సహాయం తీసుకో. చదువులోనూ ఛాంపియన్ అవుతావు." అన్నాడు మహేంద్ర. రంగ మహేంద్ర చెప్పినది అనుసరించి, తెలివైన విద్యార్థి అయినాడు.

కామెంట్‌లు