శ్రీమద్భగవద్గీత-వ్యాసములు 24:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797

 అంశము--:- సామాజిక వర్గీకరణ
భాగము2 
సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండి యే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. అని భగవానుడు పలుకుతూ ఇంకా ఇలా అంటున్నాడు.
"ఓ అర్జునా! కౌంతేయా!దోషయుక్తమైనను సహజమైన కర్మను  త్యజింపరాదు.ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నియును ఏదేని ఒక దోషముతో కూడియే ఉండును. అగ్నిని రాజేసి నప్పుడు దానిని బాగా ప్రజ్వలింపచేసినచో పొగ తొలగిపోవును. కర్మను సక్రమంగా ఆచరించుకుంటూ పోతే దానిలోని దోషం దూరమైపోవును. కర్మలను చేస్తున్నప్పుడు కొంత కష్టం వచ్చును. దాన్ని సహిస్తూ చేసుకుంటూ పోతే చక్కని ఫలితమువచ్చును.
తల్లి బిడ్డను ప్రసవించడానికి కనీసం 9 నెలలు గర్భస్థ శిశువుని రక్షిస్తూమోయాలి. ఆ కాలమంతా ఆమె అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆపైన ప్రసవవేదన సహించాలి. అయితే పండంటి శిశువు పుట్టినప్పుడు తాను అంతకుపూర్వం పడ్డ కష్టము లన్నింటిని మరిచిపోయి శిశువును చూసికొని మురిసిపోవును.
 సాగర మధనం లో ముందు విషయం, ఆ తర్వాత అమృతం ఆవిర్భవించాయి. 
శిల్పి రాయి నుండి శిల్పం చెక్కడంలో ఎంతో శ్రమ పడతాడు. అక్కర్లేని భాగాలు తొలగించుకుంటూ సుందరమైన శిల్పం అందిస్తాడు. 
నీరు ఆవిరి అవడానికి ఎంతో వేడిని సహిస్తుంది. తరువాత మబ్బుగా మారి వర్షమందిస్తుంది.
క్రీడాకారుల అభ్యాస దశలో (practice) అనేక తప్పులు చేస్తారు. అయితే వానిని సవరించుకుంటూ ఏకాగ్రతతో నేర్చుకుంటే ఎంపిక చేయబడే క్రీడాకారుడై తీరుతాడు. చిత్రకారుడు తొలి దశలో  చిత్రంగీయడంలో అనేక పొరపాట్లు చేస్తాడు. విసిగిపోకుండా సాధన కొనసాగిస్తే మేటి చిత్రకారుడు అవుతాడు.
వాహనాల డ్రైవర్లు తొలి రోజుల్లో భయం భయంగా నడుపుతారు. అలవాటు పడితే మంచి డ్రైవర్లుగా నిలుస్తారు. ఈ విధంగా మనకు అనేక విషయాలు కనిపిస్తూ ఉంటాయి. 
ఓ కథ వినండి:-
ఓ గ్రామంలో ఓ రైతు ఉన్నాడు. అతడికి నలుగురు కుమారులు.
"పెద్దవాడు జ్ఞాని". చక్కగా చదువుకున్నాడు. వేదం కూడా చదువుకున్నాడు. వేదం చెబుతాడు. ఋజుమార్గంలో జీవనం సాగిస్తాడు. భాహ్యాభ్యంతరములలో శుచిత్వం కలిగి ఉంటాడు. ధర్మాన్ని పాటించడంలో ఎదురయ్యే కష్టాలను సహిస్తాడు. భక్తి మార్గంలో నడుస్తూ భగవంతునిపై విశ్వాసం పెంచుకున్నాడు. భగవంతుని గుణగానం చేస్తూ చక్కటి కవిత్వం వ్రాస్తాడు.శ్రీ వేంకటరమణుని కరుణే అనే శతకం వ్రాసి స్వామికి అంకితం చేశాడు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ విద్యార్థులను ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దడమే జీవిత లక్ష్యంగా వృత్తికి అంకితమైనాడు. పొరుగూరు లో ఉంటున్నా కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉంటాడు."ఉత్తమ ఉపాధ్యాయుడిగా" గుర్తింపు పొందాడు. 
రెండవవాడు*చక్కటి దేహ సౌష్టవం కలవాడు. చదువు పూర్తి చేసుకుని సైన్యంలో చేరాడు. ధైర్యంతో, దక్షతతో ,దేశ రక్షణకై పాటుపడేవాడు. ఓసారి పొరుగు దేశంలో జరిగిన పోరులో చక్కని పరాక్రమము చూపి వీరమరణం పొందాడు. అతని మరణానంతరం *పరమవీరచక్ర"*అని ప్రభుత్వం అతని భార్యకిచ్చి గౌరవించింది.
"మూడవవాడు." "గ్రామంలోని ఉన్నత పాఠశాల లో విద్యాభ్యాసం పూర్తి గావించి తండ్రితో కలిసి వ్యవసాయంలో చేరాడు తండ్రి దగ్గర నుంచి వ్యవసాయం, పశువుల పోషణ నేర్చుకున్నాడు. క్రయ విక్రయాలు, పంటలు పాలు,, పెరుగు, కూరగాయలు మొదలగు వానిలో సత్యవ్యవహారం చేస్తాడు. చక్కటి అభివృద్ధి సాధించాడు. భూమిని పెంచాడు. అన్నదాతగా నిలిచాడు. పశువులను వృద్ధి చేసుకున్నాడు.
కర్షకరత్న
 అవార్డు సాధించాడు.
"నాల్గవవాడు" డిగ్రీ వరకు చదువుకుని నగరంలో సానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఎంపిక అయ్యాడు. తన ఏరియా పరిశుభ్రతకు ప్రాణం పెడతాడు. కష్టపడి చేస్తాడు. తన పని వాళ్ళతో చేయిస్తాడు. ఆయన పర్యవేక్షణలో వీధులన్నీ ఆరోగ్యానికి మారుపేరుగా ఉంటాయి. ఇంటింటికి వెళ్లి "చెత్త" ఎలా తొలగించుకోవాలో వివరిస్తాడు. పౌరులు సహకారం అందిస్తారు. స్వచ్ఛతా ఉద్యమంలో చురుకుగా పాల్గొని చక్కని గుర్తింపు సాధించాడు.
తండ్రికి ఎంతో సంతోషం! నలుగురు కుమారులు వారి వారి రంగాలలో రాణించారు. అలాగే పరమాత్ముని పిల్లలమైన మనం మన స్వాభావిక కర్మలు చక్కగా నిర్వహిస్తే అది తన పూజగా భావించి మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు.
దీనిని బట్టి మనం తెలుసుకోవలసింది అందరూ స్వలాభాన్ని, వర్ణ కీచులాటలను, అసూయను విడిచిపెట్టి, ఆర్థిక లావాదేవీలలో పరిపూర్ణమైన పాదదర్శకతను కలిగి, విశ్వాసం, నిజాయితీ, శ్రద్ధ భక్తులు, కలిగి భూమాత వలె ఓర్మి కలిగి, సంఘటితంగా పనిచేసి సాధించగలిగితే లోకమే పాదాక్రాంతమవుతుంది.
---------------------------------
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము 18
44నుండి48వ శ్లోకముల భావము తో, సందేశ పూర్వక ఉదాహరణలతో వ్రాయబడినది
---------------------------------

కామెంట్‌లు