శివతత్వం - కవి కృత్యం: -కోలా సత్యనారాయణ - విశాఖపట్నం, -ఫోన్: 9676623939

 శివయ్యా, నీ తత్వం వర్ణింప నేనెంతటి వాడిని! 
అండ, పిండ, బ్రహ్మాండాలలో వ్యాపించావు! 
బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులకే ద్యోతకం కావు! 
నిరాడంబరుడివి, నిర్వికారుడువి, నిర్గుణుడివి!
నగజ వరింప రాగా, నీలో తాపం కలిగించిన,
మన్మథుని అమాంతం భస్మం చేశావు!
రాక్షసులకు వరమిచ్చి, ఇబ్బందులు పడ్డావు! 
మోహినిగా భ్రమించిన, హరితో సంగమించావు! 
క్షీరోదధి మథనంలో కాలకూట విషం పుడితే,
కంఠంలో నిలిపి, నీలకంఠుడి వయ్యావు! 
భగీరథుని కోరికపై,గంగను భూమికి తెచ్చి,
నీ జటాజూటంలో చక్కగ బంధించావు!
పక్కనేమో గౌరమ్మ, నెత్తి మీద గంగమ్మ!
మెడలో రుద్రాక్షలు, మెడ చుట్టూ నాగన్న! 
ఒంటికి విభూది పూసి, కపాలం చేతబట్టి, 
భిక్షాటన చేసే, నిర్వికారుడువి!
ఆది బిక్షువు నీవే,విరూపాక్షుడివి నీవే!
పులి చర్మం ధరించి, సరళంగా ఉంటావు!
స్వయంభువు,సర్వ వ్యాపి, లయకారుడివి నీవు! 
పంచభూతాలను నీ అధీనంలో ఉంచావు! 
దోసిలిలు నీళ్లకే ఉప్పొంగే, అభిషేక ప్రియుడివి! 
మారేడు దళాలు, మందారాలు, నీకు ఇష్టం! 
నీ ఆజ్ఞ లేనిదే,చీమైనా కుట్టదు! 
పంచాక్షరి పఠిస్తే వెతలను తీరుస్తావు! 
త్రిశూలం, డమరుకం నీ భూషణాలు!
దుష్ట సంహారానికి తెరుస్తావు నీ మూడోనేత్రం!
దక్షయజ్ఞాన్ని ఎంతో దర్పంతో ఆపేశావు! 
శివతాండవం చేసి దివిజుల మెప్పించావు! 
వందనం శివయ్యా! నీకు.. పాహిమాం! పాహిమాం!!
కామెంట్‌లు