కాలచక్రం తన నీలి రెక్కలను విప్పి
మరో వసంతపు తలుపులు తట్టే సమయం..
మట్టిమనసు మీద
మామిడి చిగుర్లు పచ్చని అక్షరాలతో
కొత్తను కొత్తగా రాసే వేళలు..
కాలం అనే మహా యాత్రికుడు
తన అలసిన అడుగులను కాసేపు ఆపి
మరో కొత్త పుటను తెరిచే ఉదయం..
వసంతం తన పచ్చని ముద్రతో
భూమి నుదుటిపై తిలకం పెట్టే క్షణాలు …
వసంతం గాలి తెచ్చిన కొత్త పరిమళంతో
గత నిశ్శబ్దపు రాత్రులలో
పడిపోయిన పరాజయాల నీడలన్నీ
ఈ ఉదయం తడితేమలో కరిగిపోతూ..
వెలుగు వ్రేళ్ళతో
ఆశల పూలదండలు కట్టిన వసంతమే
ఈ పరాభవ నామ సంవత్సరం..
పేరులో పరాభవం ఉన్నాగానీ
ప్రకృతి చెప్పే మర్మం వేరే…
పడిపోవడం నేర్చినవారికే
విహరించడానికి సరిపడే ఆకాశం దక్కుతుందని..
ఎండిన కొమ్మలపై
పచ్చని చిగుర్లు రాసే వసంతంలా
వేదనల వేర్లతో
విజయాల పువ్వులు పూస్తాయని
కాలం గుసగుసలాడుతోంది.
పాత ఆకులు రాలకపోతే
కొత్త చిగురులు పుట్టవని...
ఎండిన కొమ్మలపై
పచ్చని స్వప్నాలు పూయించిన
వసంత స్రవంతిలా...
మన గాయాల గర్భంలోనూ
విజయపు విత్తనాలు మొలుస్తాయని తెలుపుతుంది..
కాలం మృదువుగా ఇలా పలుకుతోంది..
ఉగాది పచ్చడి ఒక కావ్యం
వేపపూల చేదు
జీవితపు కఠిన సత్యాలైతే
బెల్లపు తీపి
మనసును ముద్దాడే ఆనంద క్షణాలు..
చింతపండు పులుపు
అనుభవాల గాఢత..
మిరపకారం
పోరాటాల జ్వాల..
ఉప్పు మనుషుల మధ్య బంధాల రుచి..
అన్నీ మామిడి వగరుతో కలిసినప్పుడే
అదే కావ్యంగా జీవితం..
ఇదే ప్రకృతి సందేశం..
ఈ నూతన సంవత్సరం
మన దారుల్లో విజయాల వసంతాన్ని చల్లాలి..
మన హృదయాల్లో
ఆశల పూలవానను కురిపించాలి..
పొద్దుపొడిచిన ఆకాశం
కొత్త కాంతితో..
మనసు గడపపై దీపమై వెలిగాలి..
జీవితం అనే వృక్షానికి ఎప్పటికప్పుడు
మరొక పచ్చని వసంతం కావాలి..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి