కోరలులేని మనిషికి
అవి తాత్కాలిక కోరల నెలవంకలు
నోటిలో కత్తులు కత్తెరలు నూరే మరలు బాల వదనాలయంలో
చెట్టుకొమ్మల గట్టిగా హత్తుకున్నా
గాలికో గాయానికో
అనారోగ్యానికి నింగినుండి ఠప్పున జారిపడు కింద
పరిష్కారం శాశ్వతంగా మొలకెత్తు
మెరిసే పదును దంతవరుసల పళ్ళు
బతుకులో
ఏదైనా పుట్టింది రాలిపోవడం సత్యం
మాటతో గెలిచాననే భ్రమలోనే
మాయమైన మాట మార్మికం
కాలరెగిరేసే చోట
నిలిచే రోల్ మూతవేసి
భ్రమలతేలే మాయ తెర ముందరకు
ఏదీ సొంతం కాదు,సాంతం కూడా కాదు
మేఘాలు పుట్టించే ధూమపాన ఆట కొద్దిసేపు అది
వాన కురువని మబ్బు పొగ
నీలోని అలజడి ప్రపంచానికి రుద్దకు శూన్యం
చపలత నీడలో పెరిగిన మానసిక బాధ
ఏ మందుకూ లొంగక ఎగిసిపడే రాకాసి అల
పాల దంతాలలా జారిపోయే యొఫోరియా
సహజ శాశ్వతం దౌడు
రౌతు మాటల నడిచే అశ్వ రహదారి
జీవితం నీ మాట వినని తుంటరి
నిన్ను గాడిలో తోలేది
ఒంటరికాని ఏకాకికాని తేట పాల శక్తి అది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి