సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -78అయ్యోరి గుర్రాన్కి అన్నీ అపశకునాలే
"***
"ఏందోనే అవ్వా! ఏ పని  చేద్దామన్నా ముందట పడటం లేదు.గాచారం అస్సల్కి బాగుంటలేదు. మొన్నట్కి మొన్న కుటు కుటు మోటార్కి పూజ్జేయిద్దామని బయటికి దీసిన. గా తీసెటప్పడే ఎడ్మకన్ను అద్రింది. వామ్మో! ఇంగ ఏమైతదో వొద్దులే,మల్లెప్పుడన్న పూజ్జేయిద్దాం తియ్యి! అన్కొని  తీసిన బండిని లోపల బెట్టిన. ఇంగ ఇంటామె పోరు తట్కోలేక అంగడికి సర్కులు దేవడాన్కి బయటికొచ్చిన.గంతే నల్లపిల్లి ఎదురొచ్చింది. "నీయవ్వ గిదెక్కడి పాపం! గా నల్లపిల్లి మియ్యావ్  మియ్యావ్ అన్కుంట నా కాళ్ల సుట్టే తిర్గబట్టింది.ఎంత అద్లిచ్చినా   పోదే.గిదెక్కడి సిత్రమో? అన్కున్న.
ఇంగ మా ఇంటామె గదే నీ మర్దలు. ఇంట్లె గూకోని ఏం రంధి పడ్తవ్ తీ!అంగడ్కి పొయ్యి  ఓ నాల్గు సౌదలు పట్కరమ్మంది. సర్నేలేవే! తెత్త తీ అనీ సంచేస్కొని ఎల్లిన.గక్కడ్కి శెంద్రయ్య మావ మన్వడు గింత లేడు పోరడు,గాడు  పేద్ద సల్ఫర్ బండేస్కొచ్చిండు. గా సీనే కళ్లల్ల మెద్లబట్టింది. కొన్న సౌదలు కూరగాయలు తీస్కొని ఇంటికెళ్ళిన. గవి జూసి తెచ్చినవన్నీ సచ్చులు పుచ్చులే .నీ కల్లేడ దొబ్బినయ్ అన్కుంట మీ మర్దలు తిట్టిన తిట్టు తిర్గి రాకుండ తిట్టిందిపో..!
 "గట్లెట్ల జేసినవ్ తమ్మీ! ఎవ్వలైన తిడ్తరు గస్మంటివి తెత్తె "అంది.
 "అక్కోవ్! ఇంగ అస్సలు ముచ్చటింటే ఇంకేమంటవో అన్కుంట.... నిన్న పొద్దుగాల పన్లన్ని దీర్సుకుని,పోరగాండ్లిద్దర్ని,మీ మర్దల్ని  బండి మీద ఎక్కించుకొని గుల్లెకి బయల్దేరిన.గంత దూరం ఎల్లంగనే ఏన్నుండో కుక్కోటి వొచ్చి బండి కింద దూరింది.బండి అటిటై దాన్మీదున్న ముగ్గురు,నేను డమేల్మని కింద పడ్ఢం. నాకేమో మోశేతులకు దెబ్బలు తగిలి విలవిల్లాడిన.
 ఇంగ ఆమెకి,పోరగాండ్లకి మామూలు దెబ్బలు తాకలే.మోశేతులు,మోకాళ్ళు గీర్క పోయ్యి రకతాలు ఎల్లినయ్.ఇంగ ఆమె శేతి గాజులు మొత్తం పప్పు పప్పై ముక్కలైనయి.గవన్నీ తల్సుకుంట బండికేలి సూద్దునూ గద! బండి నిండా సొట్లే.కొత్త బండి లెక్క జేయించటాన్కి మల్లో పదేల దన్క వదుల్తయి. గియ్యన్నీ తల్సుకుంటే గీ బండి కొన్కోవడం బగవంతునికి సుత ఇట్టం లేనట్టుందని పిచ్చిందవ్వా!"
 ఒక్కో పాలి "అయ్యోరి గుర్రాన్కి అన్నీ అపశకునాలే" అన్నట్లు గట్లనే జరుగుద్ది తమ్మీ! నువ్వేం ఫికరు బడకు అన్ని అవ్వే సర్థుకుంటయి. ఏదన్న కొత్తది అనే తల్కి దాన్ని కాత్త  మంచిగ జూస్కోవాలనీ,జాగర్త పడాలనీ అతి చేస్తుంటం.గా అతి వల్లనే గిట్ల జర్గుతుంటయి. ఏం గాదు.ఇంట్లె, నీకు అందర్కి గా దెబ్బల నొప్పులు తగ్గే దన్క  గా బండిని తియ్యమాకు" అంది అవ్వ.
 
"అయ్యోరి గుర్రాన్కి అన్నీ అపశకునాలే " మాట శెవున బడ్డ బుడ్డోడు, భూలచ్మి రయ్యిన ఉరికొచ్చి అవ్వా! అయ్యోరి గుర్రాన్కి ఏమైంది శెప్పవా? అని ఎంట బడ్డరు.
జెనిగల్లెక్క శెప్పేదన్క వొదలరని కత మొదల్బెట్టింది. అన్గనగా ఓ ఊళ్ళో ఓ పెద్ద మణిషి ఉండేటోడు. గాయన్ని అందరూ 'అయ్యోరు'అని గవురంగా పిల్చేటోళ్ళు.  ఓ పాలి గాయ్న పక్కూరి సంతకెళ్ళి ఓ పెద్ద గుర్రాన్ని కొన్నడు. దాన్మీద కూసోన బోయేతల్కి ఎవలో తుసుక్కున తుమ్మిండ్రంట.గిదేదో అపశకునమొతికె ఉందని జర్ర సేపు ఆగిండంట.
మల్ల జరసేపాగి బయల్దేరిండట. ఇంగ గట్ల పోదామనుకుండె తల్కి ఓ నల్లపిల్లి,గీమద్దెనే మొగుడు పోయిన అచ్చమ్మ ఎదురొచ్చిందంట.
ఇంగేముంది అన్నీ అపశకునాలే అన్కుంట జర ఆగి ఇంగ ఎవ్వలు ఎదురు వడకుండ దౌడు తీద్దామని గుర్రం కళ్ళాలు బట్కుని అదిలిత్తే గదికాత్త అడ్డదిడ్డంగా ఉరికింది. అయ్యోరు కాత్త దబేల్మని కింద పడి పోయిండంట.గట్ల గప్పటి నుంచి ఎవలికేమన్న గిట్లయితే గీ సామెతను వాడుతుంటరు.
ఓ అవ్వా! అర్థమైంది!  ఒకోపాలి బల్లె మమ్మల్ని వొయ్యిలు తీసి సద్వమని చెప్పుడు.గంతట్లనే  బల్లెకి ఎవలో వొచ్చిండ్రని అందర్ని రమ్మని పెద్దసారు పిల్సుడు " గప్పుడు మా సార్లు ఇంగేం సద్వుతరు అని గీ మాటే అంటుంటరు" భూలచ్మి బుడ్డోడు అంటుంటే "మీరు పిల్లలు గాదురా పిడుగులు" అన్కుంట నవ్వారు అవ్వా, తమ్ముడు.
గదండీ సంగతి"అయ్యోరి గుర్రాన్కి అన్నీ అపశకునాలే" అంటే గిదే మరి.

కామెంట్‌లు