ఇప్పటి నామం చెన్నై అయినప్పటికీ నాకు మద్రాస్ అంటే అదొక ఆనందం. ఈ నగరంతో ఉన్న అనుబంధం ఎనలేనిది. మొత్తం మీద నలభై రెండేళ్ళ జీవితం మద్రాసుతో ముడిపడిందే. పుట్టి పెరిగిన టీ. నగర్లో 29 ఏళ్ళు ఉంటే పదమూడేళ్ళు మాంబళంలో ఉన్నాను. మదరాసు నగరం నడిబొడ్డున ఉన్న ఒక శివారు ప్రాంతమే మాంబళం. ఒకానొకప్పుడు బ్రాహ్మణ నివాస ప్రాంతాలే అధికం. మాంబళం చుట్టూ టీ.నగర్, నందనం, సైదాపేట , కోడంబాక్కం తదితర ప్రాంతాలున్నాయి. చెన్నైలో కర్ణాటక శాస్త్రీయ సంగీతం, ఆధ్యాత్మికత, నాటకం, సాహిత్యం అభివృద్ధి చెందడంలో మాంబళం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇంతకూ మాంబళం అనే పేరు ఎలా వచ్చిందంటే....ఈ ప్రాంతంలో ఒకానొకప్పుడు మారేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. తమిళంలో విల్వం అంటారు. మొదట్లో మావిల్వం అని, తర్వాత మావిలం అని అంటుండే వారు. క్రమేపీ అది "మాంబళం" అని మారింది. నగరంలోని ప్రధాన ప్రాంతమైన మైలాపూర్ కి పశ్చిమాన ఉండటంతో మేరకు మాంబళం అయింది. పూర్వం టీ. నగర్ ని న్యూమాంబళం అనే వారు.
చెన్నైలో విలీనం కావడానికి ముందు, మాంబళం చెంగల్పట్టు జిల్లాలోని సైదాపేట తాలూకాలోని ఒక గ్రామం. మాంబలం ప్రాంతం పట్టణీకరణ ద్వారా అభివృద్ధి చెందింది. ఇక్కడి రైల్వే స్టేషన్ 1911లో నిర్మితమైంది. దీనిని మాంబలం రైల్వే స్టేషన్ అంటారు. ఇది చెన్నై బీచ్ - చెంగల్పట్టు ఎలక్ట్రిక్ రైల్వే మధ్య ప్రధాన మార్గం.
ఇన్ని రకాల ప్రాధాన్యతలు ఉన్న మాంబళంలో ఆలయాలకు కొదవలేదు. కాశీ విశ్వనాథ స్వామి, కోదండరామ స్వామి ఆలయాలు ముఖ్యమైన శైవ వైష్ణవ ఆలయాలు.
అలాగే అయోధ్య మండపం అనేది
1954లో ఏర్పాటైంది. దీనిని శ్రీరామ సమాజం ఏర్పాటు చేసింది. ఇది శైవులకు, వైష్ణవులకు ఆధ్యాత్మిక ప్రార్థనా స్థలంగా ఉండటం విశేషం. ఇక్కడ శ్రీరామ నవమిని వైభవంగా జరుపుతుంటారు. ఇక చిన్న చిన్న దేవాలయాలనేకం. వాటిలో ఒకటైన నూతన వినాయకుడి (తమిళంలో నూతన వినాయకర్ ఆలయం) ఆలయం కుంభాభిషేకంకోసమే నేను మా కుటుంబంతో పదమూడేళ్ళ తర్వాత ఈ మాంబళాన్ని సందర్శించారు. నిజానికి ఈ ఆలయం ముప్పై నలభై ఏళ్ళ క్రితం నాటింది.
బరోడా స్ట్రీట్ నాలుగో వీధి, పంజాబ్ గార్డెన్ స్ట్రీట్ మధ్యన ఉన్న ఆలయాన్ని ఇప్పుడు ఎత్తు పెంచారు. పునరావర్తన, జీర్ణోద్ధారణ అష్టబంధన మహా కుంభాభిషేకం నవంబర్ 30, డిసెంబర్ 1 తారీఖు లలో ఘనంగా నిర్వహించారు. ఓ వైపు వర్షం ముంచెత్తుతున్నా ఆలయం ఉత్సవం నిరాటంకంగా జరగటం విశేషం. ఈ రెండు వీధుల యువకులందరూ (సారథి, జానకిరాం, పచ్చయప్పన్, కన్నన్, బాబు, శివా, దొరై, సాత్యకి, తదితరులు) కలిసి ఒక్కటిగా నిలబడి విరాళాలు సేకరించి ఆలయం ఉత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం ముదావహం. తొలి రోజున కార్యక్రమం మంగళవాయిద్యంతో మొదలైంది. గణపతి పూజ, యజమాని సంకల్పం, గోపూజ, ధనపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి అనంతరం ప్రసాద పంపిణీతో ఉదయం కార్యక్రమం ముగిశాయి. ఇక సాయంత్రం అన్నమాచార్య టెంపుల్ ఆఫ్ ఫైనార్ట్స్ ఆధ్వర్యంలో శ్రీమతి కె. అభిరామి బృందం భక్తి పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. అనంతరం వాస్తు శాంతి, కుంభాలంకారం, కళాకర్షణం తొలి కాల యాగపూజ, విశేష ద్రవ్యాహుతి, పూర్ణాహుతి విజయవంతంగా సాగాయి. రాత్రి ప్రసాద పంపిణీతో తొలి రోజు కార్యక్రమాలు ముగిశాయి.
రెండవ రోజు కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు మంగళవాయిద్యంతో ప్రారంభమైంది. ద్వితీయ కాల యాగపూజ, పూర్ణాహుతి యాత్రా దానం, గోపుర కలశ కుంభాభిషేకం, మూలవిరాట్టు కుంభాభిషేకం, మహా అభిషేకం, దీపారాధన, ప్రసాదం పంపిణీ జరిగాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం చేశారు. ఇక సాయంత్రం ఏడు గంటలకు మొదలు కావాల్సిన శ్రీ నూతన వినాయక స్వామి విశేష అలంకరణ, మంగళవాయిద్యంతో ఊరేగింపు హోరువానతో ఓ గంట ఆలస్యంగా సాగినప్పటికీ అనుకున్న ప్రకారం ఇరుగుపొరుగు వీదుల్లో విజయవంతంగా కొనసాగి ఆలయం వాకిట ముగియటం విశేషం. అనంతరం ప్రసాదం పంపిణీ చిరుజల్లుల సాక్షిగా సాగింది. వర్షాన్ని లెక్కచేయక వందలాదిమంది స్థానికులు ప్రతి కార్యక్రమంలోనూ క్రమశిక్షణతో పాలుపంచుకోవటం గమనార్హం.
ఆలయ స్థపతి కె. నాగరాజు స్థపతి సహకారం, కె. గణపతి సుబ్రమణ్యన్ ప్రవచనం, శివశ్రీ ఎ. మహేశ్వర అర్చకుల వేదపఠనం ఈ ఉత్సవాలకు వన్నె తెచ్చాయి. ఏదేమైనా రెండు రోజుల సంబరాలు ఆద్యంతమూ సుఖసంతోషాలతో సాగి తీపి జ్ఞాపకాలు మిగిల్చాయనడం చాలా చిన్నమాట. ఆలయ కమిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు.




addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి