సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
సామెత -82:- అయినోన్ని ఆశ్రయించే కంటే కానోని కాళ్ళు పట్టుకోడం నయం
*****
"అవ్వా!లోకమేంది గిట్ల మారిపొయ్యింది.గింతన్న మడుసుల్లో కనికరం లేకుండవొయ్యింది.అయినోళ్ళన్న ఇశారం ఆవగింజంతన్న లేకుండ వోయింది. ఎవ్వలికీ కట్టాలు రావా ఏంది? మన్సు జంప్కొని ఆకిట్లకొచ్చి కట్టమేందో జెప్పుకున్నప్పుడు శెవి బెట్టి కట్టం సుకం ఇనాల్నా? వొద్దా? పరాయిది కాదు అటు అవ్వోళ్లకి,ఇటు అయ్యోళ్లకి దెగ్గరి సుట్టమేనాయె. నోరు దెర్సి గింత సాయం జెయ్యమంటె ఒక్కలంటే ఒక్కలికి పెయ్యి మీద పేనుబారినంత శెలనం లేదంట.గౌరమ్మొచ్చి కంటికి పుట్టెడు ఏడత్తుంటె మన్సంత కలికలి అయ్యిందవ్వా!ఏందంటే సెప్పదు. ఏవన్న గావాల్నా అంటే నోరిప్పకుండ గుడ్లనీరు గుక్కుకుంటుంటె సూల్లేక పోయిన.
గంతట్లనే  గౌరక్కని ఎతుక్కుంట యాద్గిరి బావొచ్చిండు." ఎందుకు రంది జేత్తవు.ఎవ్వలు ఇవ్వకుంటె  నాశెప్పుబాయె. గాల్లే  అయినోళ్ళైన మనల్ని గింత దూరం బెట్టినప్పుడు,ఇంగ గాళ్ళొంక  మనం కన్నెత్తి సూశినా పాపమే. లోకం గొడ్డువోలేదు పా! నా గోడు యిన్న చెంచయ్యన్న నేనిత్త రా తమ్మీ! అన్నడు. 
 "కులమోడు కాకుంటేంది  గాయన్న కున్న కనికరం అయినోళ్ళకి లేదాయె.మిత్తి ఎంతన్నా ఇత్తన్నా ! అంటె..." ఏమ్రా తమ్మీ! ముందు ఆపతి నుంచి గట్టెక్కని" పదేలు ఇచ్చిండు. గవి దవాఖాన్ల గట్టొత్తున్న. "మిలిగినయి సుత ఏడో ఓ కాడ సూత్త రంధి జెయ్యకని ఈపు తట్టి దైర్నం జెప్పిండు"ఇంగ దా పోదాం " అంటుంటే దెల్సిందవ్వా!గౌరక్క ఆపతి.
 ఇంగ బావ మల్ల మొదలువెట్టి"ఉత్తగ ఉల్లరూటిగ అడ్గినమా! పొల్లగాడికి కడ్పునొప్పి.యెంటనే ఆప్రీషన్ జెయ్యకపోతె పానం మీద్కి వొత్తది . పోరగాడు దక్కడనేతల్కి గుండె డక్కుమని గట్ల అడ్గడానికి బొయ్యనం గని" అన్నడు.
 "గౌరక్క ఆపతి, ఆళ్ళ అయినోళ్ళు గట్ల మొండిశెయ్యి జూపుడు ఇన్నంక మన్సాగలేదవ్వా! నాకు సర్కారిచ్చిన 'ఒంటి ఆడది పించనింక' బొడ్లె కీసల్నే ఉంది.గద్దీసి గౌరక్క శేతిల బెట్టిన.  
"శెల్లే! రంజాన్ బీ! నువ్వెవలు నేనెవలు? ఇంగ గియ్యి నాకిత్తె నెలెట్ల గడ్వాలి" అన్కుంట మల్లియ్య బోయింది.బలంతాన  శేతిల బెట్టి పంపి, గీ ముచ్చటి నీ శెవులేద్దామని వొచ్చిన" అంటున్న రంజాన్ బీ తో..
 "గిదే శెల్లె మంచితనం మానత్తమంటే.. గందుకే మన పెద్దోళ్ళు ఊకెనే అన్లె. "అయినోని ముందు శెయ్యి జాపేకంటె కానోని కాళ్ళు పట్ట్కోడం నయం" అని. గా చెంచయ్యకు నీకు గా గౌరమ్మోళ్ళతో ఏ బంధముందని, ఒక్క సాటి మడుసుల బందం దప్ప. మీకున్న ఇంగితం,కనికరం పైసొంతన్న ఆళ్ళోల్లకి లేదాయె. అయ్యో! లేనోళ్ళమ్మ గాల్లేం జేత్తరు? అన్నట్లు గాదాయె. అందరు మట్టసంగ ఉన్నోళ్ళే. గిట్లనే ఉంటరు కొందరైనోళ్ళు "అన్కుంట...
 "ఇగ్గో శెల్లె! కాల్తలకాయె కడుక్కో! ఇద్దరం బువ్వ దిందాం!"అంటున్న అవ్వొంక జూస్కుంట "అవ్వా! మరి మనిద్దరి బందమేందో జెప్పు.ఒంటరి పచ్చినైన నాకు నా బిడ్డకి అండగా నిల్సినవ్!" అంటుంటే... నవ్ కుంట "మనమా! ఎన్కటి జెల్మల ఒక్కవ్వ బిడ్డలం" అంది.
గదండీ సంగతి! "అయినోన్ని ఆశ్రయించే కానోని కాళ్ళు పట్ట్కోడం నయం" అంటే గిదే మరి. సైమానికి ఆదుకున్న చెంచయ్య , రంజాన్ బీల కాళ్ళు పట్కున్నా,దండం బెట్టినా తప్పు లేదు.

కామెంట్‌లు