గీతా జయంతి -మన జీవితం కోసం చూపిన దారి
ఈరోజు గీతా జయంతి. అర్జునుడి సందేహాలను తీర్చడానికి శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నేడు మనందరి జీవితానికి కూడా మార్గదర్శకమే. అది పెద్ద గ్రంథం కాదు… మనసు గందరగోళంలో పడినప్పుడు పట్టుకునే ఒక దిక్సూచి.
గీత చెప్పే సరళమైన మాట ఏమిటంటే..నీ పని నీవు నిజాయితీగా చేయి. ఫలితాన్ని గురించి ఆందోళన పడకు.
‘కర్మణ్యేవాధికారస్తే’ అన్న ఈ ఒక్క మాటే నేటి మనోభారం, ఒత్తిడికి పెద్ద మందు.
మనలోని యుద్ధం
బయట కురుక్షేత్రం ఉండకపోయినా… ప్రతిరోజూ మనలో మంచి–చెడుల మధ్య చిన్న యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఏది చేయాలి? ఏది వదలాలి? ఎవరిని నమ్మాలి? గీత ఇలాంటి సందిగ్ధాల్లో మనసుకు ధైర్యం ఇస్తుంది.
“శాంతి మనలోనే మొదలవుతుంది” అని గుర్తుచేస్తుంది.
మతపుస్తకమే కాదు
గీత ఏ ఒక్క మతానికీ చెందినది కాదు. ఇది జీవన విధానానికి సంబంధించిన పుస్తకం.
కోపం తగ్గించడం ఎలా, బాధను తట్టుకోవడం ఎలా, నిజాయితీగా జీవించడం ఎలా—ఇలాంటి సాధారణ విషయాలను చాలా సులభంగా చెప్పిన శాస్త్రం.
నేటి కాలానికి ఎందుకు అవసరం?
ఇప్పటి ప్రపంచం వేగంగా మారుతోంది. పని ఒత్తిడి, సోషల్‌మీడియా ప్రభావం, డబ్బునే ప్రధానంగా చూసే జీవనం—ఇవి మనలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ సందర్భంలో గీత చెప్పే సమత భావం, ధైర్యం, నిస్వార్థం ఎంతో ముఖ్యం.
గీతా జయంతి సందేశం
గీతను చదవడం మాత్రమే కాదు…రోజూ చిన్న విషయాల్లో అమలు చేయడమే నిజమైన గౌరవం. స్వార్థం తగ్గించి ధర్మంగా, నిబద్ధతతో పనిచేయడం—అదే గీత ఆత్మ.
ఈ గీతా జయంతి రోజున,
మన పనులను ధైర్యంగా,
మనసును ప్రశాంతంగా,
జీవితాన్ని సులభంగా చూసే గుణాన్ని సంపాదిద్దాం…
జయహో భారత్..
మీ
శ్రేయోభిలాషి
-ఎస్.వి.రమణా చార్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి