ఓ మాతృమూర్తి ఆవేదన:- కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం

 నాకు జ్ఞాపకమేర చిన్నా
స్నానం చేయడానికి నీవప్పుడు మారాం చేశావు
ఓపిక లేక నేనిప్పుడు స్నానం చెయ్యలేనంటున్నా
పాలు బువ్వ తినేటప్పుడు చిన్ని చేతులతో తీసుకు
కంచం చుట్టు  మెతుకులు పోసినా ప్రేమతో ఎత్తుకు ముద్దాడాను
వార్ధక్యంలో చేతులు స్వాధీనం లేక వణుకుతు ఒళ్ళో పోసుకున్నా
నన్నిప్పుడు తిట్టకురా కన్నా
వంటచేసుకుంటున్నప్పుడు
ఏడుస్తుంటే బయటకొచ్చి చూస్తే  మలమూత్రాదులతో
మలినమైన నిను శుభ్రపరచి పసిడిబొమ్మలా తయారుచేసి 
చనుబాలిచ్చి  నీ ఆకలితీర్చి నిద్రపుచ్చా
శరీరపటుత్వం కోల్పోయి నరాలపటుత్వం తగ్గి 
నాకు తెలియకుండా బట్టతడిస్తే "ముసలి "అని చీదరించుకోకురా
మాతృదేవోభవ,పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పినవి మాటలకే పరిమితం చేసావా బుజ్జి.
పళ్ళురాని నిన్ను పండులా ఉన్నావని ఎత్తుకున్నానే
పళ్ళు ఊడి బోసినవ్వుతో పలకరిస్తే ముఖం చిట్లించకు నాన్న
నా చిటికెన వేలు నీకందించి నడక సహాయం చేశానే
వయస్సు ముదిరి నడవలేని నాకు నీ చేతిని సహాయం కొరకివ్వక పోయినా
ఊతగా ఉన్నానమ్మా అని భరోసా ఇవ్వరా  బంగారు.
పురాణాలలో శ్రావణ కుమారునిలా చూడకపోయినా
పట్టడన్నం వేళకు పెట్టి ఆకలి తీర్చరా 
బ్రతికినన్నాళ్ళు నే బ్రతకనురా
నిన్నే నమ్ముకున్న నన్ను వృద్దాశ్రమంలో పెట్టక
నీ చేతిలో పిడికెడు  బూడిద నవ్వాలని ఎదురుచూస్తున్న  సగటు తల్లిని రా నేను...!!
...........................

కామెంట్‌లు