శిక్షల్లోంచీ!!!:-డా ప్రతాప్ కౌటిళ్యా.
గాయమైన హృదయంల్లోంచీ గందరగోళం పుట్టినట్లు. 
మాయమైన గోళాల్లోంచి భూగోళం పుట్టినట్లు 
మచ్చల్లోంచే స్వచ్ఛమైన వెన్నెల పుట్టింది. 

విషాన్ని విరబూసినా -తీయదనాన్ని కూడబెట్టిన కీటకం మకుటం లేని మహారాణి అయినట్లు 
బాధల గాధల్లోంచి అఘాతాలను జయించే ఆణిముత్యాలు లాంటి సత్యాలు బయటపడినట్లు 
ఎగిసిన ప్రతి కెరటం మురిసినా ముగిసిపోయినట్లు 
చిట్లినా కలిసికట్టుగా మళ్లీ ఎగిసినట్లు 

ఏడ్చినా- కుబుసం విడిచిన కన్నీళ్లను కళ్ళు రెప్పల చాటున కాటేసినట్లు 
అమావాస్య లాంటి సమస్యల నుంచి సమయస్ఫూర్తి మల్లెల్లా విరబూసినట్లు 
ఆకాశం మేఘాల్లో చిక్కుకుంది. 

అర్థనగ్న అయస్కాంతాల్లా ఆకర్షణలు ఉత్తర దక్షణాలను వికర్షించి 
దిశను మార్చుకొని ఆకర్షించినట్లు 
సుడిగుండాల్లో చిక్కుకున్న గడుసు పిండాల్ని 
నీరు చల్లగా జారుకున్న గాలి ఎగిరేసుకుపోయినట్లు 

మకరందాన్ని పీల్చినట్లు సుగందాన్ని పూసినట్లు 
చెట్లు ఆకట్టుకుంటున్నాయి 
ముస్తాబైన శరీరాల్లోకి శరవేగంగా చూపుల బాణాలు గుచ్చుకొని చచ్చిపోతున్నాయి. 
ఎగిరే క్షణాలకు రక్షణ లేక ఉరికొ య్యల్లో వేలాడుతున్నాయి. 
పచ్చి రక్తం లోంచి పసికందు ఈ లోకంలోకి వచ్చినట్లు 
దేవుడు కూడా శిక్షణలోంచి కాదు శిక్షల్లోంచి పురుడు  పోసుకున్నాడు.

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు