జనవరిలో పాఠ్య పఠన పోటీలు : -ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

 పాఠశాల పిల్లలకు వచ్చే జనవరిలో పాఠ్య పఠన(లెసన్స్ రీడింగ్)పోటీలు నిర్వహిస్తామని ఊషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గౌరవ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ 'రీడింగ్ కాంపెయిన్' నిర్వహించాలని సూచించారన్నారు. ఈ నేపథ్యంలో ఈర్ల సమ్మయ్య ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లల చేత తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్ ల పాఠ్య పఠనం(లెసన్స్ రీడింగ్) చేయిస్తున్నామన్నారు. పగలంతా పాఠ్య బోధన చేస్తూ, సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు పిల్లల చేత పాఠ్యాంశాలను చదివిస్తున్నామని, వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ఒక టీచర్ని ఏర్పాటు చేసి, పాఠశాలలో వివిధ సబ్జెక్టుల పాఠాలను పిల్లల చేత చదివిస్తున్నామన్నారు. పాఠశాలలో పిల్లలు ఏడున్నర గంటలు మాత్రమే ఉంటారని, మిగతా సమయమంతా వారు ఇంటి వద్దనే ఉంటారని ఆయన తెలిపారు. ఈ సమయంలో పిల్లలు సమయాన్ని వృధా చేయకుండా పిల్లలు నిర్దేశించిన సబ్జెక్టుల్లో పూర్తయిన పాఠాలను అనర్గళంగా, వేగంగా, స్పష్టంగా, తప్పులు లేకుండా చదివేలా ఇంటి వద్ద తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలని, పిల్లలు చక్కగా చదివేలాగున వారిని ప్రోత్సహించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. పాఠ్యపుస్తకాలతోపాటు, ఇతర కథల పుస్తకాలను సరైన ఉచ్ఛరణతో, అనర్గళంగా, తప్పులు లేకుండా ఎంతమంది చదివినా వారందరికీ కూడా వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని ఈర్ల సమ్మయ్య తెలిపారు. ఈ పాఠ్య పఠనం పోటీలను జనవరి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. తల్లిదండ్రులు, ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు, పిల్లల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని ఈర్ల సమ్మయ్య తెలిపారు.
కామెంట్‌లు