బాలికా సంరక్షణ కోసం శ్రీకాకుళం జిల్లా పోలీస్ శక్తి టీమ్ లు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాయని, శక్తి యాప్ ను ఉపయోగించుకొని రక్షణ పొందవచ్చునని శక్తి టీమ్-త్రి సభ్యులు హెచ్.సి. బల్లా ఉమారాణి అన్నారు.
పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో నిర్వహించిన శక్తి అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడారు. ఏయే సమస్యలకు ఏయే ఫోన్ నెంబర్ లను వినియోగించాలో ఆమె తెలిపారు. ఆ బృందసభ్యులు, హెచ్.సి. పి.కుమార్ బాబు మాట్లాడుతూ బాలికలకు సమస్యలు ఏర్పడే సందర్భాలు, తెలివిగా తప్పించుకొనే సమయస్ఫూర్తి అంశాలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112నెంబర్ ద్వారా పరిష్కారం పొందాలని ఆయన సూచించారు. అలాగే శక్తి టీమ్ సభ్యులు బి.ఈశ్వరమ్మ గుడ్ టచ్ బేడ్ టచ్ గూర్చి అవగాహనపర్చారు. సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ బాలికలంతా మిక్కిలి క్రమశిక్షణ కలిగియుండి, తన చుట్టూ జరుగుతున్న సంఘటనలపట్ల వివేకంతో ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ ఇలలో కీర్తిగాంచిన మహిళామణులను ఉదహరిస్తూ అంతటి ఘనచరితకు బాలికాలోకం వారసులంటూ మిక్కిలి ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రతి బాలిక సాధించుకోవాలని అన్నారు. జిల్లా ఎస్.పి.నిర్దేశాలతో జిల్లాలో ఐదు శక్తి టీమ్ లు పనిచేస్తుండగా ఈ శక్తి టీమ్-త్రి సభ్యులు రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు మండలాలతో పాటు ఈ జి.సిగడాం మండలంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అందరినీ చైతన్యపరచుచున్నారు. గృహ హింస, వరకట్నవేధింపులు, బాలికల అక్రమరవాణా, లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, గంజాయి వంటి మత్తుపదార్ధాలకు లోనగుట మున్నగు అసాంఘిక కార్యకలాపాలను సంస్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఎ.పి.పోలీస్ విభాగం ఆదేశాలమేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ అధికారిణి బి.చంద్రకళ మాట్లాడుతూ బాల్యవివాహాల వలన శారీరక మానసిక నష్టాలు వాటిల్లునని అన్నారు. బాలికలు యుక్త వయస్సులో తీసుకోవలసిన ఆరోగ్య సూత్రాలు తెలిపారు. స్థానిక సచివాలయ మహిళా సంరక్షణా కార్యదర్శి మావూరు సంధ్య ప్రసంగిస్తూ బాలికలకు ఎవరైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడితే తక్షణమే తన దృష్టికి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ఎంటీఎస్ టీచర్ ఎం.పెంటయ్య, జిఎంఆర్ విఎఫ్ వాలంటీర్ పిల్లల దాలమ్మ, ఎఎన్ఎం కుప్పిలి లక్ష్మీ నారాయణమ్మ, ఆశ కార్యకర్త ఎన్.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి