ఆ క్రిస్మస్ రాత్రి అంతా
కొత్త కలలతో నిండిపోయే…
ఈ భువనమంతా
దివ్యగానాలతో మారుమ్రోగే…
కుంటివారికి నడకనిచ్చి...
గుడ్డివారికి చూపునిచ్చి...
మూగవారికి మాటనిచ్చి...
రోగుల హృదయాలకు
ఆరోగ్యాన్ని ప్రసాదించే...
ఒక మహా వైద్యుడుదయించే…
శాంతి సందేశాన్ని
శ్వాసగా ధరించిన
ఒక శాంతి స్వరూపుడు…
ప్రేమకు ప్రతిరూపంగా
కరుణకు చిరునామాగా
ఒక మహిమాన్వితుడవతరించే...
మనుష్య రూపాన నేడు
మరియ–యోసేపు సుతునిగా
పరిశుద్ధాత్మ వరమున...
బెత్లహేము పురమున...
పశువుల పాకలో శిశువై జన్మించే…
నేనే పాపుల భారాన్ని మోసే
గొర్రెపిల్లనంటూ లోకరక్షకుడు
మంచి గొర్రెలకాపరిగా ఉదయించే
దేవదూతల గానాల నడుమ దర్శించిన
గొర్రెల కాపరుల జన్మ ధన్యమాయే...
అదిగో ఆకాశాన ఓ నక్షత్రం ఉదయించే...
అది ప్రపంచమంతా ఆశాదీపమై ప్రకాశించే…
అజ్ఞానాంధకారాన్ని చీల్చే
ఒక జ్ఞాన సూర్యుడు ఉదయించే…
దర్శించి ముగ్గురుజ్ఞానులు మురిసిపోయే..
నేనే జీవము...
నేనే సత్యము....
నేనే మార్గమంటూ...
మానవాళికి దారిచూపే
దైవతార ఒకటి ఉదయించే…
కోటానుకోట్ల హృదయాలు పరవశించే...
జై "జీసస్…జై జీసస్"అంటూ
ఆనందతాండవం చేసే…
ఆకాశంలో మెరిసే నక్షత్రాలై...
ఉల్లాసంతో… ఉత్సాహంతో…
ఉప్పొంగిపోయే మనసులతో
ఉయ్యాల జంపాల లూగుతూ
సంతోష సాగరంలో మునిగితేలే…
పాపపు నరకకూపంలో
అల్లాడుతున్న నరుల కోసం
పుడమిపై పుట్టే ఓ పుణ్యపురుషుడై…
మరణపు ముల్లును విరిచే
మృత్యుంజయుడై ముందే ఉదయించే...
కాలానికి అతీతుడై
కాలగర్భంలో అడుగుపెట్టి కాంతినిపంచే...
ఆ ప్రభువు పరిశుద్ధ నామాన్ని
నిత్యం స్మరించిన...భక్తితో ప్రార్థించిన...
ఆకలిదప్పులు...మరణ భయంలేని...
జీవజలాలుప్పొంగే పరలోక రాజ్యప్రాప్తికై
ప్రభువు పరీక్షించిన...ఆశతో నిరీక్షించిన...
వారి జన్మ ధన్యం...వారికి దక్కు పుణ్యం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి