సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -90:-అన్నం పెడ్తే అరిగిపోతది,చీర ఇస్తే శినిగిపోతది- కాల్చి సురుకు బెడ్తే కలకాలముంటది
***
"గిదేం మడిషవ్వా? నల్గుట్ల గల్వదు.తనేందో పేద్ద బవంతు బంగ్లాల పుట్టి పెర్గిన దాని లెక్క నకరాలు బోతది.గట్లనేమన్నా దానం దర్మం చేత్తదా అంటే గదీ లేదు. "పిల్లికి బిచ్చెం బెట్టదు - ఎంగిలి శేత కాకిని గొట్టదు". మల్ల మాటలు మాత్తరం మామూల్గుండవు.ఐసాపైసా అన్నట్టు చేత్తది. గాల్లింట్లె పన్జేసే ఈరమ్మకి పోసే శాయ గిలాస సూత్తే నువ్వైతే గిస్మంటోళ్ళు సుత ఉంటరాని ఆచ్చెరపోతవు. ఒక్కించు పొడ్గుంటదో ఉండదో! గందుల శాయ్ సుక్క ఒక్కటంటే ఒక్క గుక్క కంటె ఎక్కువుండదవ్వా!"
 "ఇంగ గా వొదినె మాటలు జూడాలె.కోటల్ దాట్తయ్.తన సోకులు,తన యవ్వారం దప్ప ఇంకో ముచ్చెటే ఉండదు. వామ్మో! గస్మంటోళ్ళను పైన బెడ్తె పంటలుండవు,కింద వెడ్తె ఆనలుండవు."
 ఇంతకీ ఎవ్వలే రత్తమ్మా? గంత ఇచ్ఛింత్రాల మడిషి ? పతొక్కరి ముచ్చెట్లు నీకు బలే తెలుత్తయే.ఎవలే గా పీనాశి మొగం?నువ్వు శెప్తుంటె గా మణిషెవలో సూడాలనిపిత్తోంది శెల్లే!
అవ్వ మాటల్కి" ఓ అవ్వా ! రేషను బియ్యం కోస్రం మనూల్లె గా పాత బజార్కి బోయిన.బియ్యం ఇచ్చే తాన పేద్ద కుయూ వుందని,గా పక్క సందులున్న  బొజ్జమ్మొదినె ఇంటికి బోయిన. ఇంగ జూస్కో గామె తరీక.ఎందుకు బోతిన్రా అన్పించిందవ్వా!"
ఇంతకీ ఏం జరిగిందే తల్లీ! గా ముచ్చెటేదో సూటిగ జెప్పక ఊరిత్తున్నవు."
 నన్ను సూడంగనే రా వొదినె! అని పిల్చింది. గంత వర్కు బాగనే ఉంది.ఇంగ ఆల్ల ఇలాకా ముచ్చెటి శెప్తా వుంది.గట్ల శెప్పుకుంటనే  శారెడు ఏయించిన పల్లీలు దెచ్చుకొని నవలబట్టింది. దోశెడు శిట్టులువలు గిన్నెల బోస్కొచ్చుకుని ఎదురంగ కూసుంది.గవ్వి సుత ఇసర్రాయిల బోసినట్లు నోట్లేసి ఒక్క తీర్గ ఆడిచ్చుడు.గవి సూడంగనే నాకు సుత నవలబుద్ధయింది. గవో గివో పెడ్తనంటదేమోనని ఆశ పడ్డవ్వా! అస్సలా సోవిన్నే లేనట్టు జేసింది.
 గంతట్లనే ఓ అడుక్కునే మడిషి వచ్చింది. అమ్మా! నీ బాంచెన్ కాల్మొక్త. గింత అన్నమో! ఓ పాత శీరో ఇయ్యవ్వా! నీ పేరు తల్సుకుంట అని దీనంగ అడ్గబట్టింది.
నోట్లెయి నవులుడు ఆపకుండనే గామెని ఎగాదిగా జూసి ఏమన్నదో తెల్సునా?''
నువ్వు శెప్పంది నాకెట్ల తెలుత్తది.గింతకి ఏమన్నది శెల్లే?
 అన్నం బెడ్తె అర్గిపోద్దంట, శీరిత్తె శిరిగిపోద్దంట. కాల్శి సురుకు బెడ్తే ఎప్పుడు యాదికొత్తదట. గట్ల జెయ్యనా? అంటుంటే పరాశ్కానికేమో అన్కున్న గని గా వొదినె శెకలు సూత్తుంటే నిజ్జంగా గట్ల జేసేటట్టే అన్పించింది.ఒక్కసారిగ ఉలికిపడ్డ.ఇంగ అడుక్కునే ఆడ మనిషి గక్కడుంటే అంతొట్టు.
 "గీమేం మడిషి! వామ్మో! ఎక్కడ సూల్లేదు దేవుడా!"అన్కుంట ఇంకాసేపుంటె నిజంగనే శేత్తదేమోనని ఉరికురికి బోయింది.
 "నిజమే శెల్లె!గదేం మనిషి. అంత గరువమా! గట్లెవలన్న మాట్లాడుతరా? నడ్మంత్రపు సిరి-నరం మీద పుండు గిట్లనే ప్రేలాపనలు పల్కేటట్లు శేత్తయి. లేకుంటే ఏంది మరి?"
అవునవ్వా! సత్తెం జెప్పినవ్.నీ కడ్పు సల్లగుండ".అంటుంటే గస్మంటోళ్ళను జూసే మన పెద్దోళ్ళు గిస్మంటి సామెతను పుట్టించిండ్రు.
"గిదండీ సంగతి! అన్నం బెడ్తె అర్గిపోద్ది, శీర ఇస్తే శిరిగి పోద్ది.కాల్శి వాత బెడ్తె కలకాలముంటది" అంటే గిదే మరి.

కామెంట్‌లు