“పిల్లలూ రండి రండి. స్కూల్ నించి వచ్చాక ఏమైనా తిన్నారా? శ్లోకాలు, కథ మొదలుపెట్టుకుందామా” అంది బామ్మ.
“బామ్మా..ఇవ్వాళ్టి శ్లోకం నిన్న మా అమ్మ నేర్పించింది. నేను చెప్పనా” అన్నాడు ఉత్సాహంగా గోపాల్.
“అబ్బో..నిన్న నేర్చుకోవటం, ఇవ్వాళ చెప్పెయ్యటమే! బాగుంది. చెప్పు”అంది బామ్మ.
“సర్వగ సర్వ విద్భాను: విశ్వక్సేనో జనార్ధన:
వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి:”
“భలే రైమింగ్ గా ఉంది కదా” అన్నాడు వేణు.
“ఇంకా ముందు ముందు అలా చాలా ఉంటాయి. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటి ఆధారంగా వీటి అర్థం ఎవరైనా చెప్పగలరా” అన్నది బామ్మ.
“నేను చెబుతాను బామ్మా” అని పావని చెప్పటం మొదలు పెట్టింది.
“ఆ శ్రీమన్నారాయణుడు అన్ని చోట్లకి వెళ్లగలడు..అంటే అంతటా వ్యాపిస్తాడు. ఎలా అంటే సూర్య కాంతి అన్ని చోట్లకి ఎలా చేరుతుందో అలా అన్నమాట!” అని పావని అనగానే..బామ్మ అందుకుని..
“మీకు దీనికి ఉదాహరణ చెబుతాను. మహా భారతం లో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉండగా..’నేను పాండవుల వంశం మొత్తం నాశనం చేస్తాను’ అని అశ్వత్థామ, దుర్యోధనుడికి మాట ఇస్తాడు. అలా రాత్రి పూట నిద్రపోతున్న ఉప పాండవులందరినీ వాళ్ల శిబిరాల్లో చంపేస్తాడు. యుద్ధం అయిపోయి, కౌరవులందరూ చనిపోయాక..పాండవులు, శ్రీకృష్ణుడు ఇంక మిగిలిన అందరూ యుద్ధభూమి వదిలి తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోతారు. అర్జునుడికి, శ్రీకృష్ణుడి సోదరి సుభద్రకి జన్మించిన ఉత్తరకుమారుడు యుద్ధంలో పద్మవ్యూహంలో చంపబడతాడు అని మీరు భారతంలో చదువుకున్నారు కదా. ఆ ‘ఉత్తరకుమారుడి’ భార్య ‘ఉత్తర’ ఆ సమయంలో గర్భవతిగా ఉంటుంది. అశ్వత్థామ అది తెలిసి, తను దుర్యోధనుడికి ఇచ్చిన మాట చెల్లించటానికి..ఆమె గర్భంలో ఉన్న పాండవుల వారసుడిని చంపటానికి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దాని ప్రభావం వల్ల ఆమెకి గర్భంలో మంటలు బయలుదేరుతాయి. ఆమె రథం ఎక్కబోతున్న శ్రీకృష్ణుడి పాదాల మీద పడి నా గర్భంలో ఉన్న బిడ్డని కాపాడమని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన చక్రాన్ని గర్భంలో ఉన్న పిండానికి రక్షణగా పంపి, ఆ బిడ్డని కాపాడతాడు. పిండ రూపంలో ఉన్న ఆ శిశువు, తన చుట్టూ ఏదో ఒక దివ్యమైన వెలుగు కాపలాగా ఉన్నదని తెలుసుకుంటుంది. ఇది ఎవరు అని వెతుకుతూనే ఆ బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తుంది. అలా వచ్చాక కూడా తన చుట్టూ ఆ తేజస్సు కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయనే ‘పరీక్షిన్మహారాజు’. అలా వెతుకుతూ పుట్టటం వల్లనే ఆయనకి ఆ పేరు వచ్చింది. అలా బయట వ్యాపించి రక్షించి, పోషించి, సంతోషపెట్టటమే కాదు..ఆ శ్రీమన్నారాయణుడు అలా ఎక్కడికైనా వ్యాపించగలడు.”
“సర్వ విద్భాను:” అంటే అన్నిటిలోనూ తనే చైతన్యం అయి ఉండి, ఆ విషయం తెలిసినవాడు. అంటే అన్నీ తెలిసే చేస్తాడు. ఎలా అంటే..సూర్యుడిలో ప్రకాశం, అగ్నిలో వేడి, నీటిలో దాహం తీర్చే గుణం ఉన్నాయి అని మనకి సమయానుకూలంగా తెలియజేస్తూనే తాను వ్యాపించి ఉంటాడన్నమాట.
“విశ్వక్సేనో జనార్ధన:” అంటే..విశ్వం అంతటా తన సేనలు కల గొప్ప రాజు. సేనలు ఏం చేస్తాయి” అని అడిగింది బామ్మ.
“సేనలు ఒక రాజు అధీనంలో ఉండి, శత్రువులు దాడి చేసినప్పుడు వారితో యుద్ధం చేసి, శత్రువులని చంపి తమ రాజుని గెలిపిస్తారు” అన్నాడు పవన్.
“కదా..అలా తన శక్తులను అనేకమంది సైనికుల రూపంలో విశ్వం అంత వ్యాపింపచేసి ..అవసరమైనప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు కాబట్టే ఆయన విశ్వక్సేనుడు అన్నమాట.” అంది బామ్మ.
“వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి:” అంటే ..తానే జ్ఞానమై ఉండి, ఆ జ్ఞానాన్ని అన్ని జీవులకు పంచి, వాటికి ఆ జ్ఞానం అర్థం చేసుకునే శక్తి ఇచ్చి ప్రకాశించేవాడు. ఎలా అంటే సూర్యుడు తానే కాంతి రూపం. మళ్లీ ఆ కాంతిని లోకానికి అంతా పంచుతాడు అని ఇందాక చెప్పుకున్నాం కదా! అలా ఏ లోపమూ లేకుండా, సంపూర్ణంగా తన జ్ఞానాన్ని పంచుతూనే భౌతికమైన విజ్ఞానానికి, ప్రయోగాలకు దొరకకుండా, తన ఉనికిని నిరూపించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు అన్నమాట.”
“వేదాంగ:” అంటే ..వేదానికి అనేక భాగాలు, ఉపభాగాలు ఉన్నాయి. వాటిని అంగాలు, ఉపాంగాలు అంటారు. వేదం అంటేనే భగవంతుడి నించి వెలువడిన శబ్ద రూపమైన జ్ఞానం! ఎంతో మంది ఋషులు తమ తపస్సుతో మంత్ర రూపంగా ఆ శబ్దాలని దర్శించి మనకి అందించారు. అలాంటి వేదం మనకి తెలిసిన నాలుగు భాగాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదం, అధర్వణ వేదం మాత్రమే కాదు. మనకి సులువుగా అర్థం చేసుకోవటానికి వ్యాసుడు చేసిన విభాగం మాత్రమే అది. ఇంకా అనేక ఉపాంగాలు ఉన్నాయి.” అన్నది బామ్మ.
“నాలుగు వేదాల పేర్లు మా తెలుగు టీచర్ చెప్పారు. ఉపాంగాల పేర్లు ఏంటి బామ్మా” అని అడిగాడు విష్ణు.
“అవి శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని ఆరు” అన్నది బామ్మ.
“ఓహో ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం అనేవి వేదంలోనివా? ఛందస్సు మాకు టెంత్ క్లాసులో చెప్పారు. వ్యాకరణం చిన్నప్పటి నించి తెలుగు పద్యాల్లో చెప్పేవారు” అని చెబుతూ..”మరి జ్యోతిష్యం కూడా వేదంలోనిదే అయితే అది శాస్త్రమే కాదు అని ఎందుకంటారు బామ్మా” అని అడిగింది పావని.
“అవన్నీ తెలిసే తెలియని వ్యాఖ్యానాలు. మనకి తెలియనివన్నీ బూటకాలని, అదంతా ట్రాష్ అని అనటం మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. జ్యోతిష్యం శాస్త్రం కాకపోతే, ఫలానా రోజున, ఫలానా టైంలో గ్రహణం వస్తుందని, అది ఎంత సేపు ఉంటుందో చెబుతూ..ప్రపంచంలో ఫలానా చోటే కనపడుతుందని ఎలా ఖచ్చితంగా చెబుతున్నారు? మనం చదివే పంచాగం సంవత్సరం ముందే అన్ని విషయాలు ఎలా చెబుతున్నది? మనం పుట్టినప్పటి గ్రహాల స్థానాలబట్టి, ప్రస్తుతం నడిచే గ్రహాల గతులని, అవి సంచరించే కోణాలని బట్టి సమన్వయం చేసి, ఒక అంచనాతో మనకి వచ్చే అనారోగ్యాల గురించి, ఉద్యోగాల్లో వచ్చే ప్రమోషన్స్ గురించి ఎలా చెబుతున్నారు? ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక క్రమ పద్ధతి, ఒక గణిత ప్రమాణం, నిర్దేశించిన గమనం ఉంటాయి. తెలియని వారు వితండ వాదం చేస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా..ఆ దేవ దేవుడి అనంత శక్తి, భౌతికంగా చేసే ప్రయోగాలలో నిరూపించటానికి అందనిది అని! అదన్నమాట. సరే వెళ్లి మళ్ళీ రేపు రండి” అని బామ్మ పిల్లలని పంపేసి, నిన్నటి రోజున పెరట్లో నాటిన విత్తనాలకు నీరు పొయ్యటానికి వెళ్ళింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి