పెరట్లో కొత్తగా చల్లిన విత్తనాలకు నీరు పోసి, ఎన్ని మొలకలు వచ్చాయో చూసి, తన చీరకు చేతులు తుడుచుకుంది బామ్మ ఇంట్లోకి వస్తూ ఉండగా, వానర సైన్యం లాగా పిల్లలందరూ బాల బిలలాడుతూ లోపలికి వచ్చారు.
“రండి రండి..ఆ చాప వేసుకు కూర్చోండి. ఇవ్వాళ నేను శ్లోకం చెబుతాను. మీరు నోటితో అన్నాక అర్థం ఆలోచించండి” అని బామ్మ తను కూడా ఒక చిన్న స్టూల్ లాక్కుని కూర్చుంది.
“లోకాధ్యక్ష: సురాధ్యక్షో ధర్మాధ్యక్ష: కృతాకృత:
చతురాత్మా చతుర్వ్యూహ: చతుర్దంష్ట్ర: చతుర్భుజ:”
“ఆ శ్రీమన్నారాయణుడు అందరి కంటే ముందునించి ఉన్నవాడు, పుట్టుకే లేనివాడు, మార్పు చెందనివాడు, అపరిమితమైనవాడు, నాశనం లేనివాడు, ఎప్పుడు మనని పోషిస్తూ కాపాడుతాడు, రాక్షసులను సంహరించి తన భక్తులని రక్షించేవాడు, ఈ సృష్టి మొత్తం కలగటానికి కారకుడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! ఈ నేపథ్యంలో ఈ శ్లోకానికి అర్థం ఎవరు చెబుతారు”అని అడిగింది బామ్మ.
“నేను చెబుతాను బామ్మా”అన్నాడు పవన్.
“పధ్నాలుగు లోకాలని, వాటిలో జీవరాశిని సృష్టించి వాటిలో తానే చైతన్యంగా ఉండే ఆ నారాయణుడు ఈ లోకాలన్నిటికి అధ్యక్షుడు” అన్నాడు. “అధ్యక్షుడు అంటే..తాను సృష్టించిన లోకం కంటే పై నించి అన్ని జీవరాశులను, వారి వారి కర్మలని గమనించేవాడు. అజమాయిషీ చేసేవాడు. అందుకే అందరికంటే పెద్దవాడు, ఉన్నతుడు అన్నమాట” అన్నది బామ్మ.
“సురలు అంటే దేవతలు కదా బామ్మా. వారిని కూడా రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ‘సురాధ్యక్షుడు’ అంటాం. ధర్మంగా జీవిస్తూ, ఇతరుల పట్ల కరుణతో ఉంటూ, తన పట్ల భక్తిగా ఉండి..మనో వాక్కాయ కర్మల ద్వారా అనుక్షణం తననే మనసులో ధ్యానించి పూజించే మంచివాళ్ళని కాపాడటం ఆయన కర్తవ్యం. లేకపోతే లోకంలో మంచి అనేది మిగలదు. అలా ధర్మంగా బతికే వారి వారి జీవితాలని పాడు చేస్తూ బాధించే దుష్టులను శిక్షిస్తూ ఉండటం కూడా ఆయన కర్తవ్యమే! అందుకే ఆయన ‘ధర్మాధ్యక్షుడు’. అలాంటి లోకాన్ని తయారు చేసినవాడు కాబట్టి కృతాకృత: అనచ్చు కాదు బామ్మా” అన్నాడు పవన్.. రెట్టించిన ఉత్సాహంతో.. తనకి విష్ణు సహస్రనామ భావం తెలిసింది అన్న నమ్మకంతో!
“బాగా చెప్పావు పవన్. నిజంగానే నేను రోజు చెప్పేది మీకు అర్థం అవుతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. ఇప్పుడు “చతురాత్మా” అంటే సృష్టి కార్యక్రమం చేసేటప్పుడు..తానే బ్రహ్మ, ప్రజాపతులు, మనువులు, వసువులు అనే నాలుగు రూపాలుగా విస్తరించుకుని, అందులో ఆత్మ అయి ఉంటాడు. “చతుర్వ్యూహ” అంటే..ఈ లోకాన్ని నిర్వహించటానికి ఆయన అనుసరించే విధానాలే చతుర్వ్యూహాలన్నమాట. నిర్వహించటం అంటే..తమ కర్మ ఫలాలతో పుట్టే ప్రతి ప్రాణి, ఆ ఫలాలను అనుభవించటానికి చెయ్యవలసిన పనులు నిర్ణయిస్తూ..అందుకు తగిన ఏర్పాట్లుగా చుట్టూ ఇతర సమూహాలను సృష్టిస్తాడు అని చెపుకున్నాం కదా. అలా నిర్వహించటంలో భాగంగానే..కొంతకాలానికి సృష్టి మొత్తం నశింప చెయ్యటంలో కాల స్వరూపంగా, రుద్రుడి అంశగా ఉంటాడు అని కూడా చెప్పుకున్నాం కదా! అలాంటి చతుర్వ్యూహాలని వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు అనే నామాలతో నిర్వహిస్తాడు. అదే చతుర్వ్యూహ అంటే!”
“మన సనాతన ధర్మానికి వేదమే ఆధారం అని చెప్పుకున్నాం! మళ్లీ ఆ వేదం సులువుగా నేర్చుకోవటానికి, అర్థం చేసుకోవటానికి వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించాడని నిన్న చెప్పుకున్నాం కదా! ఆ వేదం ఎలా బతకాలో చెప్పింది, ఎలా బతకకూడదో చెప్పింది. అదే కదా నిర్వహణ అంటే!”
“ఇంట్లో అమ్మ పిల్లలకి బుద్ధులు నేర్పిస్తూ..ఉదయం ఎన్నింటికి నిద్ర లేవాలి దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు క్రమశిక్షణతో ఎల్లా ఉండాలో అన్ని విషయాలు చెబుతుంది. చదువు ఎంత ముఖ్యమో, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెబుతూ..అలాగే ఇంటికి ఎవరైనా వస్తే ఎలా అతిథి మర్యాదలు చెయ్యాలో, పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో, మన చుట్టూ ఉన్న మన మిత్రులతో ఎలా మెలగాలో చెబుతూ ఉంటుంది కదా! అలా అన్నమాట.”
“వేదం ఆ విధంగా స్పష్టంగా, నిక్కచ్చిగా ధర్మాన్ని నిర్వచించింది కాబట్టే ఆ నాలుగు వేదాలని నాలుగు కోరలు అని చెప్పారు. తప్పు చేసిన రాక్షసులను, దుష్టులను దండించడానికి ఆ దేవ దేవుడు కోరలని ఉపయోగిస్తాడు. వేణు.. దేవుడు కోరలని ఎప్పడు ఉపయోగించాడో చెప్పు”అంది బామ్మ.
“హిరణ్యకశిపుడిని శిక్షించటానికి తన గోళ్ళని, కోరలని ఉపయోగించాడు కదా బామ్మా” అన్నాడు వేణు.
“సరిగ్గా చెప్పావు. అందరూ విష్ణుసహస్రనామాలని బాగా ఒంటపట్టించుకుంటున్నందుకు మీ అందరికీ ఈ రోజు జామ పండ్లు, నేరేడు పండ్లు ఇస్తాను రండి” అని బామ్మ వాళ్ళందరినీ దగ్గరకి తీసుకుని తలమీద ముద్దు పెట్టి అభినందించి, వాళ్ల చేతుల్లో పండ్లు పెట్టి పంపించింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి