“బామ్మా..చూడు చూడు ఇక్కడ వానపాములు ఉన్నాయి. ఇంకా ఈ మట్టిలో వేరే పురుగులు కూడా ఉన్నాయి. మనం మొక్కల కోసం ఉత్తిగా గింజలు వేశాం. ఇవి ఎక్కడి నించి వచ్చాయి?”అని మొక్కలకి నీళ్ళు పోస్తూ కేకేశాడు విష్ణు ఉత్సాహంగా.
“ఆ:( ఉంటాయి. బురదలో చిన్న పురుగులు, వానపాములు ఉంటాయి. అవి నేలని గుల్ల చేసి, మొక్క మొదలుకి గాలి తగిలేట్టు చేస్తాయి. ఇంకా మనం వేసే ఎరువులు మొక్క పీల్చుకునేట్టు కూడా చేస్తాయి” అంది బామ్మ.
“ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తెలిసినంత వరకు చెప్పండి. మిగిలినవి నేను చెబుతాను” అంది బామ్మ.
“ఆ :( అడుగు, అడుగు” అని ఉత్సాహ పడి పోయారు పిల్లలు.
“మొన్న మనం గింజలు వేశాం. రోజు నీళ్ళు పోస్తున్నాం. ఇప్పుడు ఆ గింజలు ఏమయ్యాయి? అసలు మొక్క ఎలా వస్తుంది? అని అడిగింది బామ్మ.
“గింజ లోనించి మొక్క వచ్చి అది తెగ గానో, పెద్ద చెట్టుగానో, పెరుగుతుంది” అన్నాడు పవన్.
“అలాగే మీలో కోడి గుడ్డు ఎంతమంది చూశారు. ఉడకబెట్టకుండా, ఆమ్ లెట్ వేసి తినకుండా గుడ్డుని అలాగే వదిలేస్తే ఏమవుతుంది?”
“మా ఇంట్లో ఒక స్తంభం మీద పిచ్చుక గూడు కట్టుకుంది. గాలికి పడిపోతుందని ..అమ్మ ఆ గూడుని, పిచ్చుక చూడకుండా జాగ్రత్తగా తీసి పక్కనే ఉన్న అటకమీద పెట్టింది. పిచ్చుక అందులో కొన్ని గుడ్లు పెట్టింది. ఒక రోజు అక్కడ కిచ కిచ చప్పుడు వస్తుంటే విన్నాను. నిచ్చెన ఎక్కి చూస్తే అక్కడ బోలెడు బుల్లి పిచ్చుకలు ఉన్నాయి. ఆ బుల్లి పిల్లలు భలే ముద్దుగా ఉన్నాయి” అన్నాడు విష్ణు.
“ఆ:( ఇప్పుడు చెబుతా వినండి. ఇందాక నేను చెప్పిన కోడి గుడ్డు పగలకొట్టకుండా, ఉడకబెట్టకుండా ఉంచితే అందులో నించి కోడి పిల్ల బయటికి వస్తుందన్నమాట.”
“ఈ భూమి మీద ఏ జీవి అయినా నాలుగు రకాలుగా పుడుతుంది. ‘ఉద్బుదములు’ అంటే గింజని చీల్చుకుని వచ్చే మొక్కలు, ‘స్వేదజములు’ అంటే తేమలో పుట్టే పురుగులు, వానపాములు, తలలో వచ్చే పేలు లాంటివి, ‘అండజములు’ అంటే గుడ్డుని చీల్చుకు వచ్చే పక్షులు..ఇందాక వీడు చెప్పాడే..గుడ్డులో నించి బయటికి వచ్చిన పిచ్చుకలు, ‘జరాయుజములు’ అంటే మనుషులు, జంతువులు అన్నమాట. అంటే సృష్టి మొత్తం ఈ నాలుగు విధాలుగానే జరుగుతుంది. అదే నిన్న మనం చెప్పుకున్న శ్లోకంలోని ‘చతురాత్మ’.”
“అంతే కాదు.. మనిషి నాలుగు అవస్థల్లో ఉంటాడు అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అవేంటో చెప్పగలరా” అంది బామ్మ.
“అవి జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలు. ఆ అవస్థలన్నిటిలోనూ, భౌతిక శరీరం నిద్రలో ఉన్నా కూడా..మనలోని ఆత్మ మెలకువగా తన ఉనికితో ఉంటుంది“అంది అందరిలోకి పెద్దది అయిన పావని.
“ఆ:( బాగా గుర్తు పెట్టుకున్నావు” అని ప్రశంసిస్తూ..అలా అన్ని అవస్థల్లోనూఉండే దాన్ని ‘చతురాత్మా’ అని చెప్పొచ్చు” అంది బామ్మ.
“మొన్న మనం దిక్కుల గురించి చెప్పుకున్నాం. ఆ విషయాలు మీలో ఎంత మందికి గుర్తు ఉన్నాయి” అని అడిగింది బామ్మ.
“నాకు గుర్తుంది బామ్మా” అని “దిక్కులు నాలుగు..అవి తూర్పు, దక్షిణం,పడమర, ఉత్తరం” అన్నాడు పవన్.
“అంటే ఆ దేవ దేవుడు నాలుగు దిక్కులా, నాలుగు రకాలుగా, నాలుగు అవస్థల్లో ఉంటాడు అని తెలిసిందా? అదే ‘చతురాత్మా’ అన్నమాట.
“దీన్ని ఇంకా కొన్ని విధాలుగా కూడా చెప్పొచ్చు. ఆ శ్రీమన్నారాయణుడు శబ్ద రూపంగా కూడా ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. మనలోపల శబ్దం, గాలి, అగ్ని ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా! శబ్దం బయటికి మాటగా వచ్చే ముందు నాలుగు రూపాలుగా ఉంటుంది. అవి ‘పర’, ‘పస్యంతి’, ‘మధ్యమ’, ‘వైఖరి’.
‘మనం మాట్లాడాలి అని నిర్ణయించుకున్నప్పుడు దాన్ని సంకల్పం అంటాము. అలా సంకల్పించుకున్నప్పుడు ‘మూలాధారం’ లో ఉండే వాయువు పైకి ప్రయాణించటం మొదలు పెడుతుంది. దానికి శబ్దం లేదు. అది ‘పర’ అన్నమాట. అక్కడ ప్రారంభమైన గాలి ‘స్వాధిష్ఠాన’ చక్రం దగ్గరకి ప్రయాణించి ఒక విద్యుత్ రూపం ధరిస్తుంది. అది మనకి ఫలానా విషయం మాట్లాడాలి అనే భావనని ఇస్తుంది అన్నమాట. అక్కడ కూడా శబ్దం పైకి వినపడదు ..అదే ‘పస్యంతి’. అలా పైకి ప్రయాణించిన శబ్ద రూపమైన గాలి మన శరీరంలో ‘అనాహత’ చక్రంలో ‘మధ్యమ’ రూపంగా ఉంటుంది. అక్కడ ఫలానాది మాట్లాడు అనే సంకేతం మెదడు నించి వస్తుంది. ఆ శబ్ద రూపమైన గాలి ఇంకా పైకి ప్రయాణించి ‘విశుద్ధ’ చక్రంలో నించి నోటిలోనికి వచ్చి దవడల చేత నొక్కబడి అక్షరంగా, పదంగా మారి పూర్ణ రూపమైన మాటగా బయటికి వచ్చి వినపడుతుంది.”
“ఇప్పుడు మనలో ఉన్న శబ్దం, గాలి ద్వారా నాలుగు స్థానాల ద్వారా నాలుగు రూపాలుగా ప్రయాణించి చివరికి మాటగా బయటికి వస్తుంది అని తెలిసింది కదా! దాన్ని కూడా ‘చతురాత్మా’ రూపమైన పరమాత్మగా చెప్పొచ్చు..తెలిసిందా?” అంది బామ్మ.
“ఆ శ్రీమన్నారాయణుడు ఇన్ని రూపాలుగా..విశ్వం అంతా వ్యాపించి ఉన్నప్పటికీ, మనం ఒక్కొక్క చోట ఉండే ఒక్కొక్క ప్రత్యేకత గురించి ఇలా అనేక నామాలతో చెప్పుకుంటున్నాం.”
“కాల రూపంలో నారాయణుడు అంటే..నాలుగు యుగాల రూపం. అంటే కృత, త్రేతా, ద్వాపర, కలియుగం అన్నమాట. ఇలా చాలా వివరాలు తరువాత చెప్పుకుందాం. ఇవ్వాళ్టికి చాలు. వెళ్లి కాసేపు ఆడుకుని హోమ్ వర్కులు చేసుకోండి” అని బామ్మ వారిని పంపించేసింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి