సంక్రాంతి సంబరాల్లో గురువులకు సత్కారాలు

మాధవరాయపురంలో సుమారు పదేళ్ల క్రితం పనిచేసిన ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, నక్క ఈశ్వర్ లాల్, వావిలపల్లి అప్పలనాయుడులను ఆ గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ గ్రామ పౌరులు, యువకులు పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈ సన్మానాలు గావించారు. ముఖ్య అతిథి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు మాట్లాడుతూ భోగి, సంక్రాంతి, కనుమలనేవి తరతరాలుగా ప్రకృతిని ఆరాధించే భావనలకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు, ఆద్యాత్మిక శోభకు, పుట్టిన గ్రామం పట్ల మమకారాలకు ప్రాధాన్యతనిచ్చే పెద్ద పండుగలని అన్నారు. నక్క ఈశ్వర్ లాల్ మాట్లాడుతూ యువతలో దేశభక్తి క్రమశిక్షణ నీతి నిజాయితీ అలవడితే స్వర్ణమంటి భవితను పొందగల్గుతారని అన్నారు. వావిలపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ గతంలో తాము పాఠాలు నేర్పగా నేడు తమను గుర్తుపెట్టుకుని పిలిచి సత్కరించడం మిక్కిలి అభినందనీయమని, సంక్రాంతి సంబరాల్లో గొప్ప స్ఫూర్తిని సంతరింపజేసారని అన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, వేషధారణ ప్రదర్శనలు, మ్యూజికల్ చైర్, స్లో సైకిల్ రన్నింగ్, బకెట్ లో బాల్, స్పూన్ లెమన్ వంటి పోటీలు నిర్వహించగా,  విజేతలకు అతిథులుగా విచ్చేసిన కుదమ తిరుమలరావు, నక్క ఈశ్వర్ లాల్, వావిలపల్లి అప్పలనాయుడుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కుదమ తిరుమలరావు ఆలపించిన సంక్రాంతి గీతాలు అందరినీ రంజింపజేసాయి. అనంతరం జరిగిన నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కామెంట్‌లు