సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం.
 సామెత -115: అవిటివాని ఆలి/ పెళ్ళాం అందరికీ లోకువే
*****
"గిదన్నాలం గదవ్వా? గా పొల్లని బట్కొని  గా రచ్చ బండ కాడ కూకున్నోళ్ళలో కొందరు కారు కూతలు కూత్తుండ్రంట. ఏమేమో అని బనాయిత్తుండ్రంట.గా పొల్ల నాతో జెప్కొని వలవలా ఏడ్వబట్టింది. ఏవన్న సౌదలు, కూరగాయలు దెచ్చుకోవాలంటే గక్కన్నించే బోవాలంట.గటు దిక్కు ఎల్లాలంటేనే పానం గడగడల్లాడుతుందని శెప్పింది."
"ఎవలో ఏమో గని శెల్లె! ముందుగ ఎడంకాలి శెప్పు దీసి ఎడాపెడా వాయించమనక పోయినావ్!ఆటెంక సంగతి అటెంక సూస్కుందుం గని."
గీ నడ్మల ఆడోళ్ళని సూస్కుంట సొంగలార్సుడు ఎక్కువైంది. ఏందేందో మాటల్తో షిడాయించుడు. ఎకిలిగ నవ్వుడు, ఎదయ్యేషాలు ఏసుడు ఎక్కువైంది."
 "అవునవ్వా ఆడివిల్లలను పెశాంతంగ బత్కనియ్యడం లేదు.అందునా గీ పొల్లనైతే నెరీ శికాకు శికాకు శేత్తుండ్రంట."
"అయ్యో ! గట్లనా శెల్లె! అన్నందాల సక్కంగున్నోళ్ళ పెళ్ళాల్ని జూసే,మొగుడొచ్చి నాల్గు దంతడన్న బయం లేకుండ నోటికొచ్చినట్లు వాగుతుండ్రాయె.గీ పొల్ల అసలే  అవిటి వాని పెళ్ళాం. ఇంగ గా ఎదవన్నర ఎదవ మొకాలకి ఇంకాత్త అలుసై పోయింది."
గందుకే మన పెద్దోళ్ళు అంటుంటరు "అవిటివాని పెళ్ళమంటే అందరికీ లోకువే" అని."
గస్మంటోళ్ళను అస్సలు శెమించొద్దు శెల్లె. మొన్నో మీటింగుల వో పెద్దాయన రజాకార్ల కాలం ముచ్చెట్లు శెప్పిండు. మొగోళ్ళు, ఆడోళ్ళని మస్తు శెర బెట్టిర్రంట."
 ఆడోళ్లంత ఓ సోట జేరి గా రజాకార్ల మీద తిర్గుబాటు శెయ్యడాన్కి ఇశారం జేసిండ్రంట."
 " ఏం ఇషారం  జేసిండ్రవ్వా!
 " పతొక్కరు  రొండైపుల కీసలున్న  లాగులు తొడుక్కోవాలె. గందుట్ల వొక దాంట్లెనేమో మాంచి ఎండు కారం పొడి పొట్లం గట్టుకొని ఉంచుకోవాలె."
"బలేగుంది అవ్వా!ముచ్చెటి శెప్పు శెప్పు. "
 "ఇంకో పక్క శిన్న కత్తి పెట్టుకోవాలె.ఎవలన్న అతి జేత్తరా గాని కంట్లె కారప్పొడి సల్లుడే. ఆడింకా మీద మీద కొత్తె మాత్తరం కత్తి దీస్కుని ఎదిరిచ్చుడే". గట్ల అప్పటోళ్ళు మానాల్ని పానాల్ని రచ్చించుకునేటోళ్ళంట. గదిన్నంక  గానాడు  ఆడోళ్ళు ఎన్ని బాదలు పడ్డరో తెల్సి కండ్లల్ల నీళ్ళొచ్చినయ్ శెల్లె."
 గిప్పుడు అవాలా గాండ్లు కొందరు గాళ్ళ లెక్క శెయ్యబోతుండ్రు. గా పొల్లలాంటోళ్ళను ఏడిపిత్తుండ్రు. గందుకే ఆడివిల్లలు ఎన్కటి లెక్క గస్మంటివి దెగ్గర బెట్కోవాలె శెల్లె! గప్పుడు తెలుత్తది. లోకువనుకున్నోళ్ళ శకితి దైర్నం జూసి గట్ల షిడాయించినోళ్ళకి శెప్పుకుంటే పర్వు బోయేటట్టుండాలె. ఏమంటవ్ శెల్లె?"
 గిట్ల నీ దగ్గర్కి వొత్తెనే గిస్మంటి ఎన్నో విషయాలు,మంచి శెడులు, ఏమేం శెయ్యాలో తెలుత్తయి. గా పొల్లని నీ తానకి తోల్కొత్త ‌అవ్వా!" అన్కుంట బయటికి అడుగులేసింది శెల్లె బవాని."
గదండీ సంగతి. "అవిటి వాని పెళ్ళామంటే అందరికీ లోకువే" అనుకుంటుండ్రేమో గని అవ్వ చెప్పినట్టు జేత్తే సాలు.ఇంకో త్యేప జోలికి రాలేత్తరా ? అస్సలు కన్నెత్తి సుత సూడరు.d


కామెంట్‌లు