స్వభావముద్ర: - కోలా సత్యనారాయణ -విశాఖపట్నం

విత్తనంలో దాగిన వృక్షమే జీవితం!
కాలం దాన్ని వెలికి తీయగలదు! 
గంగా యమునలు దానిలో కలిసినా, 
ఉప్పుగానే నిలుస్తుంది సముద్రం!
 ముఖానికి ముసుగు వేసుకున్నా,
మనసు తన రూపం దాచుకోలేదు! 
మాటల్లో నకిలీ మెరుపు మెరిస్తే, 
చేతల్లో నిజం కనబడుతుంది! 
యజ్ఞంలో పుట్టిన ఆలోచన... 
అగ్నిలా పవిత్రంగా వెలుగుతుంది!
ద్వేషపు గర్భంలో పుట్టిన భావం,
విషంలా చుట్టూ ప్రాకుతుంది! 
పువ్వుకు సువాసన నేర్పుతాం! 
ముల్లుకు కోమలత చేర్చలేము!
సంస్కారం అలంకారం కాదు! 
అది లోపలి వంశపారంపర్యం! 
కష్టాల్లోనే బయట పడుతుంది... 
మనిషి నిజ స్వభావం!
అందుకే శాస్త్రం చెబుతుంది... 
యత్స్వభావం తద్భవతి అని!! 
కామెంట్‌లు