సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!
 వన పర్వము చతుర్థాశ్వాసము- *103 వ రోజు
శరత్కాలంలో దక్షిణదిశగా అగస్త్య నక్షత్రం కనిపించింది. శరదృతువులో పాండవులు సరస్వతీ నదిలో స్నానం చేస్తూ కొంత కాలం గడిపారు. తరువాత కామ్యకవనం చేరారు. కామ్యకవనానికి శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి సత్యభామా సమేతుడై వచ్చాడు. ఆ సమయంలో చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి కూడా వారిని చూడటానికి వస్తున్నట్లు వర్తమానం అందింది. ధర్మరాజు శ్రీకృష్ణుని సాదరంగా ఆహ్వానించి సత్కరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుని చూసి " ధర్మజా ! కౌరవులు నిన్నూ, నీ సోదరులను, భార్యనూ ఎన్నో బాధలకు గురిచేసారు. ధర్మం నీ పక్షంలో ఉన్నది. నీకు విజయం తధ్యం. అంధక, వృష్ఠి, బోజక మొదలగు భూపతులు నీ పక్షాన ఉన్నారు. ఈ సామ్రాజ్యానికి నీవే చక్రవర్తివి కాగలవు చింతింపకుము " అని అనునయంగా చెప్పాడు. ధర్మరాజు " దేవా ! అరణ్యవాస కాలం చాలా వరకు గడచి పోయింది. అలాగే అజ్ఞాత వాసం పూర్తి చేసి మా ధర్మం తప్పకుండా మా రాజ్యాన్ని మేము జయిస్తాము. నీ దయ మా మీద ఉంటే మాకు చాలు. భారం అంతా నీ మీద మోపుతున్నాను " అన్నాడు. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న ద్రౌపదిని చూసి " అమ్మా! ద్రౌపదీ నీ కుమారులు యాదవరాజకుమారులతో కలసి సంతోషంగా ఉన్నారు. అస్త్రశస్త్ర విద్యలు అభ్యసిస్తున్నారు. నా చెల్లెలు సుభద్ర తన కుమారుని కంటే నీ కుమారుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. వారిని గురించి నీవు చింత పడవద్దు " అని ఓదార్చాడు.
మార్కండేయ మహర్షి రాక
ఒకరోజు మార్కండేయ మహర్షి పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణాదులతో మహర్షికి అతిథి సత్కారాలు చేసాడు. ధర్మరాజు మార్కండేయ మహర్షితో " ఓ మహర్షీ మేము ఎప్పుడూ ధర్మం తప్పి చరించ లేదు. మేము ఈ విధంగా బాధలు పడుతున్నాము. దార్తరాష్ట్రులు అధర్మ వర్తనులు అయినా పాపకార్యాలు చేస్తూనే సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. ఈ విపరీతానికి కారణం ఏమిటి? మనుషులు తాము చేసిన కర్మల ఫలాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తారా? లేక ఈ లోకం లోను పరలోకంలోను అనుభవిస్తారా? ఈ విశ్వకర్త అయిన ఈశ్వరుని చూడని వాడు కర్మఫలం అనుభవించడా? ఈ దేహంతోనే కర్మలు వెడలి పోతాయా ? నాకు ఇవన్నీ వివరంగా తెలుపగలరా? " అని అడిగాడు.
కాలధర్మాలు
మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. " ధర్మజా! తొలుత ప్రధమ కల్పంలో అత్యంత నిర్మలమైన శరీరాలను సృష్టించాడు. ఆ ప్రకారం పుట్టిన మానవులు మహా సత్వగుణ సంపన్నులు, సత్యం పలికే వారు, సత్యవ్రతులై ఉన్నారు. జ్ఞాన సముపార్జన చేసారు, స్వేచ్ఛగా జీవించారు. దేవతల మార్గంలో పయనించారు. అధిక శ్రమ లేకుండా ఎక్కువ ఫలితాన్ని పొందారు. ధర్మం తప్పకుండా చరించారు. వారికి మత్సరం వంటి దుర్గుణాలు లేవు. అధిక సంతానవంతులై వేల సంవత్సరాలు జీవించారు. కాలక్రమేణా వారిలో కామము, లోభము, మదము, మాత్సర్యము లాంటి దుర్గుణాలు ప్రవేశించాయి. దేవతలు వారిని వదిలి వేసారు. మానవులలో బలం క్షీణించింది. సంపదలు తొలగి పోయాయి దరిద్రులు అయ్యారు. చేసిన కర్మలకు సత్ఫలితాలు రావడం తగ్గింది. రోగగ్రస్తులు అవడం మొదలైంది. మానవులకు దేవుని మీద నమ్మకం సన్నగిల్లి నాస్తికులు అయ్యారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. పాపాలు చేస్తున్నారు. నరకానికి పోతున్నారు. జంతు జన్మలు ఎత్తుతున్నారు. ఈ సంసారంలో తిరుగుతూ జనన మరణ చక్రంలో పడి సతమౌతున్నారు

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు