సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము చతుర్థాశ్వాసము- *101 వ రోజు
నివాతకవచులు
నేను మాతలి రథం తోలగా రథం ఎక్కి నివాతకవచుల దగ్గరికి వెళ్ళాను. వారు సముద్రంలో ఉన్న నగరంలో ఉన్నారు. నేను శంఖాన్ని పూరించాను. అది విని రాక్షసులు నా మీదకు యుద్ధానికి వచ్చారు. వారికి నాకు మధ్య ఘోర యుద్ధం జరిగింది ఇంతలో దేవతల సారధి మాతలి స్పృహతప్పి పడిపోయాడు. ఇది చూసి రాక్షసులు మా మీద బాణప్రయోగం చేసారు. నేను స్వయంగా రధాన్ని నడుపుతూ వారితో యుద్ధం చేసాను. వారు తిమిర బాణాన్ని వేసారు. లోకమంతా చీకటి అయింది. అది చూసి మాతలి పెద్దగా అరిచాడు. ఎవరూ ఎవరికీ కనిపించలేదు. నేను దేవేంద్రుడు ఇచ్చిన సూర్యాస్త్రాన్ని ప్రయోగించాను. చీకటి తొలగి వెలుగు వచ్చింది. నేను నా గాండీవం నుండి అస్త్రప్రయోగం చేసాను. ఆబాణములకు రాక్షసులు అందరూ మరణించారు. ఆ విధంగా నేను రాక్షసులను జయించి దేవలోకం వెళుతూ మార్గ మధ్యంలో నేను హిరణ్య పురం చూసాను. అందులో పౌలోమ, కాలకేయులు అనేరాక్షసులు నివసిస్తున్నారు. వారు దేవతలచే చంపబడ్డారు అని నాకు మాతలి చెప్పాడు. నేను ఆ పురానికి వెళ్ళాను. నన్ను చూసి దేవేంద్రుడు అనుకుని రాక్షసులు నన్ను చుట్టు ముట్టారు. మా మధ్య ఘోరయుద్ధం జరిగింది. వారు నాతో మాయా యుద్ధం చేయసాగారు. వారు వారి పట్టణంతో సహా ఆకాశానికి ఎగిరి అక్కడి నుండి యుద్ధం చేయసాగారు. నేను శివుని స్మరించి పాశుపతాన్ని ప్రయోగించాను. ఆ అస్త్రానికి రాక్షసులంతా మరణించారు. ఆ తరువాత నేను దేవలోకానికి వచ్చి ఇంద్రునితో జరిగినది వివరించాను. ఇంద్రుడు నాతో " అర్జునా ! నీ కోసం నీ సోదరులు ఎదురు చూస్తున్నారు. నీ విజయ వార్తలు వినటానికి ఉవ్విళ్ళూరుతున్నారు " అని చెప్పి మాతలితో నన్ను ఇక్కడికి పంపించాడు " అని అర్జునుడు చెప్పాడు. అర్జునుని విజయగాధలు విని ధర్మరాజాదులు సంతోషించారు. ధర్మరాజు " అర్జునా! నీకు దేవతలు ఇచ్చిన అస్త్రాలు మాకు చూపించు " అన్నాడు. అర్జునుడు ప్రయోగించి చూపడానికి ఉద్యుక్తుడు కాగా అక్కడకు వచ్చిన నారదుడు " అర్జునా! అవి దివ్యాస్త్రాలు. ఆ అస్త్రాలు లక్ష్యం లేకుండా ప్రయోగించకూడదు. అలా ప్రయోగిస్తే అవి మూడు లోకాలను దహించగలవు " అని చెప్పాడు. నారదుని ఆదేశం మేరకు అర్జునుడు అస్త్ర ప్రయోగాన్ని ఆపి వేసాడు. తరువాత ధర్మరాజు తన సోదరులతో అక్కడ పది మాసాలు గడిపాడు. తరువాత దేవఋషి రోమశుడు దేవలోకం వెళ్ళాడు. తరువాత పాండవులు బదరీ వనంలోని సుబాహు పురం వచ్చి అక్కడి నుండి ఘతోత్కచుని తన పరివారంతో సహా పంపి వేసారు. తరువాత వారు హిమవత్పర్వతము లోని అనేక ప్రదేశములు దర్శిస్తూ ఒక సంవత్సరం గడిపారు.
నహుషుడు
ఒకరోజు భీముడు వేట నిమిత్తం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండచిలువ భీముని ఆహారంగా పట్టుకుంది. అది భీముని తన శరీరంతో చుట్టేసింది. భీముని బలం ఆ కొండచిలువ బలం ముందు చాలలేదు. భీముడు ఆశ్చర్యపడి " నా వంటి బలవంతుని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు వరప్రసాదివా? " అని అడిగాడు. ఆ కొండచిలువ భీమునితో ఇలా పలికింది " భీమసేనా ! నేను నహుషుడు అనే మహారాజును. ఒకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్టించాను. కాని ఒక మునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను " అని దుఃఖించాడు. ఇంతలో భీమసేనుడు కనపడలేదని కలత పడి ధర్మరాజు అతడిని వెతుకుతూ వచ్చాడు. కొండచిలువ బంధించి ఉన్న భీముని చూసి " ఆహా ఏమి కాల మహిమ? అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బందీకృతుడు కావడమా? " అనుకున్నాడు. ధర్మరాజు కొండచిలువను చూసి " అయ్యా ! నీవు ఎవరు? రాక్షసుడివా దేవతవా చెప్పు. నేను పాండురాజు పుత్రుడను. నా పేరు ధర్మరాజు. నీవు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టు కుంటే అతడిని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగ మాంసం సమకూరుస్తాను " అన్నాడు. ధర్మజా! నేను నీ వంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రుడితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో వివేకం లేక సప్త ఋషులతో పల్లకి మోయించుకుని వారిని అవమానించాను. ప్రత్యేకంగా అగస్త్యుడిని అవమానించిన కారణంగా అతడు నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. ఆ శాపప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను. నా శాపవిమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నాను. అగస్త్యుడు కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో వారి వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ మహానుభావుని కొరకు నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముని విడిపించుకో.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు