“
* 15 మంది ప్రతిభా మూర్తులకు సన్మానం
* పిల్లల ప్రతిభకు పట్టాభిషేకం
* తుర్లపాటి రచన “మెలొడీస్ ఆఫ్ లైఫ్” పుస్తకావిష్కరణ
=
జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా సామాజిక స్పృహను మరువ కూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ “తెలుగు భాషా సంఘం పూర్వ అధ్యక్షులు పి. విజయబాబు వ్యాఖ్యానించారు. చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన మందిరంలో జరిగిన “తుర్లపాటి సాంస్కృతిక, విజ్ఞాన కేంద్రం” వార్షికోత్సవ సభలో విజయబాబు మాట్లాడుతూ, పురస్కారాలు అందుకున్న వారు సమాజంలో విలువలు పెంచే దిశగా మరింత కృషి చేయాలని అన్నారు. పురస్కారాలు బాధ్యతలను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు.
“సమాజంలో మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం” అన్న నినాదంతో వివిధ కార్యక్రమాలను చేపడుతున్న తుర్లపాటి సాంస్కృతిక వేదిక నిర్వాహకులు తుర్లపాటి నాగభూషణ రావు, మన్నవ శ్రీదేవి అభినందనీయులని రేడియో, టీవీల ద్వారా సాహితీ కృషి చేస్తున్న సాహితీవేత్త
పురాణపండ వైజయంతి ప్రశంసించారు.
ప్రముఖ సర్జన్ డాక్టర్ బి. వరుణ్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన వారిని గుర్తించి వారి సన్మానించడం వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుందనీ, ఇది అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని అన్నారు.
తుర్లపాటి రచన “మెలొడీస్ ఆఫ్ లైఫ్” పుస్తకాన్ని పి. విజయబాబు ఆవిష్కరించారు. రచనలో బలం ఉంటే పాఠకాదరణ పెరుగుతుందని అంటూ, పుస్తక పఠనాసక్తి పెంచాల్సిన బాధ్యత రచయిత మీదనే ఉంటుందని అన్నారు. కాగా, విజయవాడ -ఆంధ్ర లొయొల కాలేజీ పూర్వ వైస్ ప్రిన్సిపాల్ కస్తల వేంకట విజయబాబు పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఇది కేవలం రచయిత స్వీయ చరిత్ర కాదనీ నేటి యువతకు, పిల్లలకు వ్యక్తిత్వ వికాస సూత్రాలను అంతర్లీనంగా తెలిపే చక్కటి రచన అని కొనియాడారు. తెలుగులో పాఠకాదరణ పొందిన “జీవనరాగాలు” పుస్తకానికి మెలొడీస్ ఆఫ్ లైఫ్ అనువాద గ్రంథమని విజయవాడ మేరిస్ స్టెల్లా కాలేజీ ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా సేవలందించి పదవీ విరమణ చేసిన డాక్టర్ కస్తల సత్యసుధ చెబుతూ, స్వీయ చరిత అనువాదం కత్తి మీద సాములాంటిదని అభివర్ణించారు.
పురస్కార గ్రహీతల్లో గరిమెళ్ల గోపాలకృష్ణ మూర్తి, కందేపు రాజశేఖర్, గొట్టిముక్కల శివప్రసాద్, సోమేశ్వర శర్మ , అశ్విని, కాకర్లమూడి నాగేష్, సాహితీ, కాకర్లమూడి లక్ష్మి, లాస్య ప్రియ కొఠారు, శ్రీవేద కొఠారు, పలుకూరు మురళీధర్, డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, చిత్రపు మోహన్ రావు, వి.వి.ఎన్.ఆర్. విజయకుమార్, పి. ఇందిరాదేవి, మొదలి రాజగోపాలం ఉన్నారు.
సినిమా పాటలతో సాగిన “గాన సుధ” కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. ఆకాశవాణి న్యూస్ రీడర్ పోణంగి బాలభాస్కర్, వి.వి.ఎన్. ఆర్. విజయకుమార్ ఈ మహోత్సవ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు .
తుర్లపాటి సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకులు నాగభూషణ రావు మాట్లాడుతూ, ప్రతిభను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. ఆన్ లైన్ లో నిర్వహించిన “పిల్లల ప్రతిభకు పట్టాభిషేకం” లో పాల్గొని విజేతలుగా నిలిచిన ఐదుగురు చిన్నారులకు వేదిక కార్యదర్శి శ్రీదేవి మన్నవ బహుమతులను అందజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి