సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -117:అగడ్తలో కప్పకి అదే వైకుంఠం.
*****
"అబ్బబ్బా! కొందరు మడుసులు బలేగుంటరవ్వా! ఏం జెప్పినా నమ్మరు.ఏమన్నా మంచి శెడులు శెప్పినా ఒప్పుకోరు.ఆళ్ళు శెప్పిందే ఏదం.ఆళ్ళు సూశిందే పెపంచకం.గదేందో గని గాళ్ళు మనల్నే పిచ్చోళ్ళ లెక్క సూత్తరు. బోలెడంత జాలి కురిపిత్తరు. లచ్మన రేకలొతికె గిర్లు గీసుకుని అందులోనే బత్కుతరు.
"అవ్వా!గీళ్ళ యవ్వారం ఎట్టుంటదంటే 'ఊరందరిదో దారి ఉలిపికట్టెదో దారి' అన్నట్టుంటది."
ఎవలు శెల్లె! ఎవలా శెబితె యినని మడుసులు. గా బైటి పెపంచకం సూడనోళ్ళ  జాడ నీకెట్ల దెల్సింది? గీ దినాల్ల గిస్మంటోళ్ళు ఉండ్రంటే ఆచ్చెరంగా ఉంది."
"గింతకీ గా ఆదిమానవులెవరో శెప్పు. సుట్టాలు పక్కాలైతే దోత్తులైతే కాదు గద"!
*ఊల్లె ఎవ్వలైనా సరే సుట్ట పక్కాల్లక్కనే ఉంటరు గద అవ్వా!"
అవును నిజమే శెల్లె. ఊల్లెల్ల కులం తలం కంటే మించిన అనుబంధాలు ఉంటయి. గవే మస్తు బాగనిపిస్తయి.
అవును శెల్లె! పల్లెటూళ్ళు మున్పటి లెక్క లెవ్వు.శానా మార్పులొచ్చినయ్! పట్నం లెక్కనే మారుతున్నయ్.
అవునవ్వా!మొన్న సంకురేతిరి పండక్కి మా యమ్మోళ్ల ఊరు ,గట్నించటే శాన్నాల్లయింది సూడక ఓ పాలి పొయ్యొద్దమని మా యమ్మమ్మోల్ల ఊరెల్లినవ్వా!"
అవునా శెల్లె! మంచి పని జేశ్నవ్. గీ రోజుల్ల ఫిరీ బస్సే ఉండెనే ఉండె. యాడికైన సప్పున బొయ్యి రావచ్చు గదా! శెల్లె! మంచిగ బొయ్యొచ్చినవ్. అవ్వ తాతలు లేకున్నా గట్ల ఊర్ని సూత్తెనే గాళ్ళని సూశినంత సంబురమైతది."
 "అవునవ్వా! గక్కడి యిషయం  నీతో జెప్పాలె. గిప్పుడు సుత మా ఊరికి బస్సేలేదు తెల్సా! మా పెద్దోడ్ని బతిలాడ్తే గాడు కారు ,డైవర్నిచ్చి పంపిండు."
 " అయ్యో అవునా శెల్లె! లోతునున్న ఊరికి సైతం బస్సు బోతుంటే బస్సు లేక పోడమేంటి?
"రాజకీయమో! గ్రాచారమో ఏమో గని?  మా అమ్మమ్మోల్ల ఊరికి ఏ సౌలతు లేదు. కార్లె కాబట్టి తెల్సినోళ్ళందర్ని పల్కరిచ్చుకుంట నేను పలానా అని జెప్పుకుంట ఎల్లిన.
"ఓ ఇంటికెల్లిన పల్కరిద్దమని.పావుగంట కూసుందమని ఎల్లిన దాన్ని పది చనాలు సుత ఉండ్లేక బోయిన్కో. గా యిల్లు గట్లుంది. ముందే ఎవలో శెప్పిండ్రు గని పోకుండ ఎట్లుండనని పోయిన.
"ఏం మడుసులో అవ్వా!  గీ నడ్మల వైరల్ జొరం వొచ్చిందని అస్సలు శాత గాట్లేదని శెప్పిండ్రు.ఒకటికి రొండుకు పోనీకి సుత కట్టమైతుందట.వాటికి బోవాలంటే ఇంట్లె నుంచే ఓ అంత దూరం బోవాల్నట. తానాలకి, దానికి కల్పి ఓ గది దగ్గర్ల కట్టిచ్చు కోవొచ్చు గద అన్న అవ్వా!గంతే
శెవ్వా !గట్ల ఇంట్లె ఉంటదా? అసలు కట్టుకోం అన్నట్టుగ మాట్లాడిండు. గాయన పెళ్ళాం అంతే. గామె సుత నడవనీకి కాళ్ళు సరిగ పన్జేయక డేక్కుంట గంత దూరం ఎల్లొత్తదట. గిట్లయితే బాగుంటదా నువ్వే శెప్పు.
గట్లనే మంచంల ఎక్వ,తక్వ పక్క బట్టలు మురిగ్గ ఉంటే లేని పోని జబ్బులు వత్తయి శుబ్బరంగ ఉంచుకోవాలని శెప్పిన. ఎన్కటి సంది గిట్లనే ఉంటున్నం ఏం గాదు.మేం మంచిగ లేమా ఏంది అన్నరు. ఏమనాల్నో తోసక నోర్మూసుకున్న.
ఇంగ గా ఇంట్లె ఎవల్ని పల్కరించినా వాళ్ళకి మస్తు తెల్వున్నట్టు శెబుతుంటే నాకేం తోసలే.అవి ఇవి శెప్పి గాళ్ళని మారుద్దామన్కున్న దాన్ని ఇంకాత్త ఆడుంటే నేనేమైతనో అన్కొని బయమేసి గబ్బగబ్బ బయటికొచ్చినవ్వా!"
"గస్మంటోళ్ళని బెమ్మ దేవుడు సుత మార్సలేడు. గాళ్ళు అగడ్తల కప్పలసుమంటోళ్ళు.  గదే పేద్ద పెపంచకం అన్కుంటరు.శెప్పినా నమ్మరు.తోటోళ్ళు ఎట్ల సుఖంగా బత్కేది తెల్సుకోవాలన్కోరు.పైగా గాయన పక్కా రైతు‌. పంటలు బాగనే పండిత్తడు. డబ్బులు శాన్నై ఉన్నయి.ఎంతుంటేది మనిషి,మనసు,ఇల్లూ ఆకిలి సుబ్బరంగ ఉండాలె.తెల్వకపోతే తెల్సుకోవాలి గని.
"గాల్లు అడ్వి మడుసులెక్కున్నరేంది  శెల్లె!"
"అవును అవ్వా! అడ్వి మడుసులే.విషయానికి వత్తె  మాత్తరం గాళ్ళంత పరమ మూరుఖులు ఇంకోలు ఉండరు మంచిని,మారుపును ఒప్పుకోరు.గాళ్ళకి ఇల్లే వైకుంఠం - పందిరే పర్వతం లెక్క."
అవును శెల్లె! అందరు ముందుకు ఎళ్తుంటే గాళ్ళు ఎనక్కి ఎల్తుంటరు."అగడ్తలో పడ్డ కప్ప లెక్క గాళ్ళ లోకంల గాళ్ళుంటరు- గదే వైకుంఠం" లెక్క అన్కుంటరు కాబట్టే గిస్మంటి సామెతలు బుట్టినయి."?
"గదండీ సంగతి అగడ్తల కప్పకి అదే వైకుంఠం" అంటే గిదే మరి. గస్మంటోళ్ళను మార్సలేం కొందరి జీవితాలు గట్లనే ఎల్లిపోతయి.

కామెంట్‌లు