స్టాంప్ ఎందుకూ?: - - యామిజాల జగదీశ్
 ఈ సంఘటన 1983 నాటిది.
అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జగద్గురు ఆదిశంకరుల కోసం తపాలా బిళ్ళను విడుదల చేయాలని  అనుకున్నారు. అయితే అంతకుముందు కంచి పరమాచార్యస్వామి వారి అభిప్రాయం తెలుసుకోవడానికి ఆమె సి. సుబ్రమణ్యాన్ని ఆయన వద్దకు పంపారు. ఆయన మహారాష్ట్రలోని సతారాలో ఉంటున్న స్వామిని కలిశారు. సి. సుబ్రహ్మణ్యం తానొచ్చిన విషయం చెప్పారు. 
అప్పుడు "కేంద్ర ప్రభుత్వం దీనిని జారీ చేయాలా వద్దా అనే దానిపై నా అభిప్రాయం అడుగుతోందా? లేక ఆశీస్సులు కోరుతుందా? లేక ముందుగానే నిర్ణయించి ఉంటే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు" అని పరమాచార్య అన్నారు. 
"స్వామీ, మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే మేము నిర్ణయం తీసుకుంటాం" అని సి.ఎస్. చెప్పారు.
"మంచిది... అయితే మీకొకటి చెప్తాను.. తపాలా బిళ్ళ అవసరం లేదు... అవతారపురుషులైన ఆదిశంకరుడు పుట్టుకతోనే మహామహులు. ఆయన చిత్రాన్ని తపాలా బిళ్ళపై విడుదల చేస్తే ఆయనకొచ్చేదేమిటి? అయినా ఏమి జరుగుతుందో తెలుసా? కారుపై స్టాంప్ అతికించే వారిలో అధిక శాతం మంది తమ నాలుకతో స్టాంపు వెనకాతల తడి చేసి  కవరుపై అతికిస్తారు. మనమెవరం వారిని ఆపలేం. ఇది సహజంగా జరిగిపోతుంది. అటువంటప్పుడు ఇది స్వామివారికి గౌరవప్రదమా" అని పరమాచార్య ప్రశ్నించారు.
ఇందుకు ఆశ్చర్యపోయిన సి. సుబ్రమణ్యం, "మేమెవరమూ ఈ కోణంలో ఆలోచించలేదు" అని అన్నారు.
పరమాచార్యులవారి అభిప్రాయాన్ని సి. సుబ్రమణ్యం నాటి ప్రధాని ఇందిరాగాంధి దృష్టికి తీసుకువెళ్ళారు. అది శంకరులవారి స్టాంప్ వెయ్యాలనుకున్నా ప్రతిపాదనను ప్రధాని మానుకున్నారు.

కామెంట్‌లు