ప్రముఖ గాంధేయవాది లావణ్య ప్రభా ఘోష్. (బెంగాలీలో లాబణ్య ప్రభా ఘోష్ అని అంటారు). ఆమె చేతలను
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా ప్రాంతంలో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించారు.
లావణ్యా ప్రభా ఘోష్ 1897 ఆగస్టు 14న పురూలియాలో జన్మించారు. నలుగురి పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే దేశం కోసం ఉద్యమించిన సంఘటనలనేకం.
ఆమె తండ్రి, రుషి నబరున్ చంద్ర కూడా స్వాతంత్ర్య సమరయోధుడే.
పురూలియా వాసులు ఆమెను "మంభుం - జనని" (మంభుమ్ తల్లి) అని పిలుస్తారు. ఆమె పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు. కానీ ఆమెకు తండ్రి ఇంటి వద్ద చదువు చెప్పారు. పదకొండేళ్ళ వయస్సులో ఆమెకు అతుల్ చంద్ర ఘోష్‌తో పెళ్ళి చేశారు.
ఆమె పురూలియా పట్టణంలోని తెల్‌కల్‌పరా వద్ద "శిల్పాశ్రమం" (ఆశ్రమ జీవన విధానంలో గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి)కి ఇరుసులా ఉండేవారు. "శిల్పాశ్రమం" మంభూమ్ ప్రాంతం స్వాతంత్ర్య పోరాటానికి, అనుబంధ సామాజిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉండేది. సుభాస్ చంద్రబోస్‌తో సహా అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు ఈ ఆశ్రమంలో సమావేశమయ్యేవారు. చిత్తరంజన్ దాస్, కొన్ని సందర్భాలలో మహాత్మా గాంధీ కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించారు.
1926లో అప్పటి మంభూమ్ జిల్లా నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఆమె ప్రతినిధిగా కొనసాగారు. గాంధీజీ విధానాలను ఆదర్శంగా తీసుకుని తన కార్యకలాపాలు కొనసాగించారు. 1930లో; మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలోను, 1945లో కోనపర వద్ద "పతాక సత్యాగ్రహం"లోను ఆమె ప్రధాన పాత్ర పోషించారు.
జన్మతః నాయకురాలి లక్షణాలున్న ఆమె కలకత్తాలో అరెస్టయిన 1,025 మంది సత్యాగ్రహ బృందానికి నాయకత్వం వహించారు. అవిభక్త మంభూమ్ జిల్లాలోని బెంగాలీ మాట్లాడే ప్రజల సంక్షేమం కోసం ఆమె పోరాడుతుండేవారు.
బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు చాలాసార్లు జైలుకు తరలించారు.
స్వాతంత్ర్యం తరువాత, బెంగాలీపై హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి మంభూమ్ జిల్లాలో "భాషా ఆందోళన్" కార్యక్రమాన్ని ముందుండి నడిపారు.
బీహార్ ప్రభుత్వం ఆమెను చాలాసార్లు జైలుకు పంపింది. ఆరు వందల రూపాయల జరిమానా కూడా విధించారు.
"భాషా ఆందోళన్" ఫలితంగా, కొత్త జిల్లా పురూలియా మంభం జిల్లా నుండి విడివడింది. బీహార్ నుండి పశ్చిమ బెంగాల్‌లో చేరింది.
1975లో ఎమర్జెన్సీ కాలంలో ఆమె జైలుకెళ్లారు. ఆమె "ముక్తి" పత్రికలో అనేక వ్యాసాలు రాసారు. పురూలియా జిల్లాలో మొదటిసారిగా ఆమె పురూలియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెకు వివిధ సందర్భాలలో మూడుసార్లు జైలు శిక్ష విధించారు. పురూలియా, హజారీబాగ్, భాగల్పూర్ ప్రాంతాలలో జైలు జీవితం గడిపారు. తర్వాత రాజకీయ వ్యవస్థ పట్ల తీవ్ర అసహ్యంతో, వేదనతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
ఆమె మరణించే వరకు శిల్పాశ్రమంలోని తన గదిలో గడిపారు. స్వాతంత్ర్య సమరయోధుల కోసం ఇచ్చే పెన్షన్ తో మాత్రమే ఆమెకు ఆదాయ వనరుగా ఉండేది.
ఈ ఆధునిక రోజుల్లో కొనసాగుతున్న కార్యకలాపాలేవీ ఆమెకు నచ్చలేదు. తాను కన్న కలలేవీ నెరవేరలేదని భావించి బాధపడేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఆమె తీవ్రంగా విమర్శించారు. శిథిలావస్థలో ఉన్న గదుల్లో కొన్ని అత్యవసర గృహోపకరణాలు తప్ప కుటుంబానికంటూ ఏమీ నిల్వ చేసుకో లేదు.
లావణ్యా ప్రభా ఘోష్ 2003 ఏప్రిల్ 11న 106 సంవత్సరాల వయస్సులో మరణించారు.
స్వాతంత్ర్య సాధన కోసం ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరాలను త్యాగం చేసారని ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆమె జీవిత కథనం భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తరువాత అని రెండు కోణాల్లో చూడాలి. ఆమె జీవితమంతా త్యాగానికి అద్దం పడుతుంది. సామాన్యుల న్యాయం కోసం, హక్కుల కోసం ఆమె ఎప్పుడూ పోరాడుతుండేవారు.
ఆమె కుమారుడు అరుణ్ చంద్ర ఘోష్, కుమార్తె ఊర్మిళ మజుందార్ కూడా స్వాతంత్ర్య సమరయోధులు.
భాషా ఉద్యమానికి ( భాసా ఆందోళన్ ) ఆమె చేసిన కృషికి గుర్తుగా భాషా సాహిద్ స్మారక్ సమితి తరపున ఫిబ్రవరి 2003లో సునీల్ గంగోపాధ్యాయ ఆమెను సత్కరించారు. పురూలియాలో ఆమె విగ్రహాన్ని చూడవచ్చు.






addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి