“అమృత్యు: సర్వ దృక్సింహ: సంధాతా సంధిమాన్ స్థిర:
అజో దుర్మర్షణ: శాస్తా విశ్రుతాత్మా సురారిహా”
“ఈ రోజు వాసు రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? ఊళ్లో లేడా” అంది బామ్మ అందరి వంక చూస్తూ!
“వాళ్ల మామయ్య చనిపోయాడుట. చూసి రావటానికి వాళ్ల అమ్మానాన్నతో కలిసి ఊరెళ్లాడు బామ్మా” అన్నాడు విష్ణు.
“సరే ఈ రెండు మూడు రోజులు మీరు నేర్చుకున్నవి వాడికి నేర్పండి. ఆ పరమాత్మ సృష్టించే మనబోటి జీవరాశులకి మాత్రమే పుట్టటం, పెరగటం, మార్పు చెందడం, మరణించటం అనేవి ఉంటాయి అని ఇంతకు ముందు చెప్పుకున్నాం అవునా? కానీ…” అని బామ్మ చెప్పటం మొదలు పెట్టగానే..”
“వాటిని ‘షడూర్ములు’ అంటారని చెప్పావు బామ్మా” అన్నది పావని మధ్యలో కలగజేసుకుని!
“ఆ పరమాత్మ కి పుట్టుక, మరణం అనేవి ఉండవు. అందుకే ఆయన “అమృత్యు:” కదా బామ్మా” అన్నాడు హరి.
“అవును. అలా సందర్భం వచ్చినప్పుడు ఇంతకు ముందు నేర్చుకున్నవి అన్వయం చేసుకోవాలి. “సర్వ ద్రుక్” అంటే..అన్ని ప్రదేశాల్లో, అన్ని వైపులా, అన్ని దిక్కులా చూడగల శక్తి కలవాడు అని అర్థం. ఆయన ‘సహస్రాక్షుడు” అంటే వెయ్యి కళ్ళతో చూసేవాడు అన్నమాట. దానికి ఉదాహరణ ఎవరు చెబుతారు?” అని బామ్మ అందరి వైపు చూసింది.
“సూర్య భగవానుడు. నువ్వు అప్పుడు చెప్పావు కదా..ఆయన ఇక్కడా, అమ్మమ్మ వాళ్ల ఊర్లో, సముద్రంలో, అడవిలో, అమెరికాలో..ఇలా అన్ని చోట్లా తన కిరణాలు ప్రసరింపచేస్తూ ఉంటాడు. అంటే అన్ని చోట్లా తన సహస్ర కిరణాలనే నేత్రాలతో చూస్తూ ఉంటాడు” అంది మానస.
“అందుకే ఆయనని సర్వ సాక్షి అని, అన్నీ గమనించే ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు. ఆయనకి తెలియకుండా మనం ఏ పని చెయ్యలేము. సరే “సింహ” అంటే”..అని మళ్లీ పిల్లల వంక చూసింది బామ్మ.
“ఆ:( సింహ అంటే శిక్షించే పరమాత్మ స్వరూపం. హిరణ్యకశిపుడిని సంహరించింది నరసింహ రూపమే కదా” అన్నాడు రవి.
“మీకు శ్లోకాలు నోటికి రావటమే కాదు..చక్కగా అర్థం కూడా అవుతున్నాయి. భేష్! ఇప్పుడు మొత్తం ‘సర్వదృక్సింహ’ పదం మొత్తానికి అర్థం..అన్ని జీవుల కదలికలు, గమనం, చేష్టలు అన్నీ చూస్తూ..తప్పు చేసిన వారిని శిక్షించే భగవంతుడి గుణ విశేషం అని చెప్పచ్చు.”
“సంధాతా” అంటే ..కర్మలని జీవులతో కలిపేవాడు. అంటే చేసే కర్మలని గమనించి వాటికి అనుగుణమైన జన్మ ఇచ్చే వాడు అని అర్థం.
“సంధిమాన్” అంటే..కర్మానుసారంగా జన్మించిన అన్ని జీవుల్లో ఉండే చైతన్య రూపం ఆయనే కాబట్టి ఆ కర్మలను అనుభవించే జీవుడు కూడా ఆయనే!
“స్థిర:” అంటే..అలా ఎప్పుడూ నశించని అమరుడిగా, చెక్కు చెదరకుండా స్థిరంగా ఏక రూపంతో ఉంటూ, సర్వ లోకాలని..సర్వ జీవుల చర్యలని..కర్మలని గమనిస్తూ, అందుకు అర్హమైన జన్మలని ఇస్తూ..తప్పు చేసి ధర్మం తప్పిన వారిని శిక్షించే పరమాత్మే ఆ శ్రీమన్నారాయణుడు! తెలిసిందా?
“అజో దుర్మర్షణ” అంటే..చావు లేనివాడు కాబట్టి ఆయనకి పుట్టుక కూడా ఉండదు, ఆయన శాశ్వతుడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అలా జనన మరణాలు లేనివాడు..అసురులకి, దానవులకి ఎంత తపస్సు చేసినా, ఎంత శ్రమపడినా లొంగక వారిని శిక్షించి ధర్మ పరులని కాపాడటం కోసం అవతారం స్వీకారం చేస్తూ ఉంటాడు.
“శాస్తా..విశృతాత్మా సురారిహా” అంటే వేద శాస్త్రాల ద్వారా మాత్రమే తెలియబడేవాడు..అంటే మన ఇంద్రియాల ద్వారా ఆయన స్వరూప స్వభావాలని తెలుసుకోలేము. ఆ వేదాలు, శాస్త్రాల ద్వారానే ఈ లోకాన్ని సృజించి, నిర్వహించి, పోషించి, రక్షించేవాడు. ఆ శాస్త్ర నియమాల ప్రకారమే దేవత శత్రువులని శిక్షించేవాడు అని అర్థం” అని బామ్మ ముగించగానే పిల్లలు లేచి పెరట్లో మొక్కల దగ్గరకి పరుగెత్తారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి