“వినరో భాగ్యము విష్ణు కథలు”:(31): - ఎం బిందుమాధవి

 “అగ్రణీ ర్గ్రామణీ: శ్రీమాన్న్యాయో నేతా సమీరణ:
సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష: సహస్రపాత్”
“నిన్న మనం “వాచస్పతి” గా ఆ శ్రీమన్నారాయణుడు మన వాక్కులకు మూలాధారమైన వాడు అని చెప్పుకున్నాం కదా! వాక్కులకు ఆధారం అంటే ఇంకా వివరంగా ఎవరైనా చెప్పగలరా” అనడిగింది బామ్మ.
“ఆ:( నేను చెబుతాను బామ్మా. ఆ శ్రీమహా విష్ణువు ఒక కవికి కవిత్వ రూపంగా, ఒక గాయకుడికి సంగీత రూపంగా, ఒక టీచర్ కి విద్యావేత్తగా, ఒక ఉపన్యాసకుడికి.. వక్తకి అవసరమైన భాషా రూపంగా..ఇలా అనేక విధాలుగా భాసిస్తాడు” అన్నాడు హరి.
“ఈ శ్లోకాలు అర్థం చేసుకోవటంలో నువ్వు బాగా ఎదిగావు. నీలో భాషా జ్ఞానం కూడా బాగా పెరిగింది. నీ ఆలోచనలో పరిణతి వచ్చింది” అని బామ్మ హరిని మెచ్చుకుంటూ..”ఈ శ్లోకాలు పూర్తి అయ్యేసరికి, మీ అందరికీ కూడా ఆ దేవ దేవుడి తత్వం బాగా అర్థమవుతుంది” అని మిగిలిన వాళ్ళు చిన్నబుచ్చుకోకుండా భరోసా ఇచ్చేసింది.
“సరే..అలా జీవులందరిలో ఉన్న జ్ఞానం, కళలు, ప్రతిభా విశేషాలు ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపాలే కాబట్టి ఆయన “అగ్రణీ”..అంటే అందరికంటే గొప్పవాడు, అతనికంటే అధికులు లేరు అన్నమాట. అంతేకాదు..ఎవరెవరి పూర్వ జన్మల కర్మల ననుసరించి వారికి ఆయా విశేష లక్షణాలని ఈ జన్మలలో అందించి, అవి వికసించటానికి కావలసిన పరిస్థితులని, వాటి ద్వారా రాణించే అవకాశాలని కూడా అందించి, జగత్తుని నిర్వహించే గొప్ప ఉదారుడు ఆయన. అలా అందించటంలో అన్ని జీవుల పట్ల సమానత్వాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని పాటించే ధర్మ స్వరూపుడు” అని ఆగింది బామ్మ.
“వారి కర్మ ఫలాలను బట్టే కళలు, ప్రతిభలు వారికి అబ్బినా కూడా..వాటి ఆధారంగా అందరూ ఒకే విధంగా రాణించలేరు. అలా రాణించలేని వారు తమకి ఆ దేవ దేవుడు అన్యాయం చేశాడనో , తమలాంటి ప్రతిభ కలిగిన వారే అయినా తమకంటే ఎక్కువగా, అన్యాయమైన మార్గాల్లో పైకి వచ్చేశారనో బాధ పడిపోతూ ఉంటారు. కానీ ఆ శ్రీమన్నారాయణుడికి ఎవరి పట్ల ఎలాంటి భేద భావం ఉండదు. అన్నీ వారి కర్మ ఫలాలని బట్టే అందిస్తాడు. అలా అందించి వారి వారి ఉచ్ఛ్వాస నిస్వాసాల ద్వారా ఆయన వారిలో ప్రకటించబడుతూ..వారిని పోషించి రక్షిస్తూ ఉంటాడు కనుకనే ఆయన “శ్రీమాన్ న్యాయో నేతా సమీరణ:”
“అలా జీవులు..అంటే దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, పంచ భూతాలు, గ్రహాలు, నక్షత్రాలు, మనుషులు, జంతువులు, పశు పక్ష్యాదులు, సరీ సృపాలు..అన్నిటిలోనూ చైతన్య రూపంగా ఆయనే ఉంటాడు కాబట్టి ఆయనని విశ్వాత్మా అంటాం అని చెప్పుకున్నాం కదా! అలా ఆయనకి వేయి (వేయి అంటే..చెప్పలేనన్ని అని అర్థం) తలలు, వేయి కళ్లు, వేయి నుదుటి భాగాలు, వేయి పాదాలు, వేయి ఇంద్రియాలు కలిగి విరాట్స్వరుపుడిగా ఉంటాడు కనుక ఆయనని “సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష:సహస్ర పాత్” అని పిలుస్తారు. ఆయన విశ్వాన్ని అంతా ఆవరించి ఉంటాడు కాబట్టి ఆయన లేనిది, ఆయనది కానిది అంటూ ఏమీ ఉండదు” అని ముగించింది బామ్మ.
“మా ఇంట్లో శ్రీమహావిష్ణువు ఫోటో ఒకటి ఉంది బామ్మా. అందులో ఆ శ్రీమన్నారాయణుడికి బోలెడు చేతులు, బోలెడు తలలు..ఆ తలల్లో బోలెడు దేవుళ్ళు ఉండి చూడటానికి భలే విచిత్రంగా ఉంటుంది. అమ్మని అడిగితే అది ‘విశ్వరూప సందర్శనం’ అని చెప్పింది. ఆ ఫోటో అర్థం ఇదా” అన్నాడు పవన్.
“మీకు శ్లోకాల అర్ధాలు చెబుతుంటే అర్థం చేసుకోవటమే కాకుండా..మీరు చూసిన వస్తువులని, విషయాలని ఆ శ్లోకాలతో కలిపి ఆలోచించటం నేర్చుకుంటున్నారు. బాగుంది. ఇలాగే అందరూ నేర్చుకుంటే దైవం అంటే ఏమిటో, మనని మనం అర్థం చేసుకుంటూ..చుట్టూ పక్కలవారిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది” అని బామ్మ పిల్లలని పంపించేసింది.

కామెంట్‌లు