“సుభుజో దుర్దరో వాగ్మీ మహేంద్రో వసుదో వసు:”
నైకరుపో బృహద్రూప: శిపివిష్ట: ప్రకాశన:”
“వాసు, వేణు కుస్తీ పట్లు పట్టుకుంటున్నారు బామ్మా..త్వరగా రా” అని కంగారుగా పిలిచింది మానస.
“పిల్లలూ..ఏమిటా అల్లరి? కళ్ళు, కాళ్ళు జాగ్రత్త. అసలే పరీక్షలు జరుగుతున్నాయి. మీరు నిన్న టీవీలో వచ్చిన బాక్సింగ్ పోటీలు చూశారా ఏంటి” అని నవ్వుతూ వచ్చింది బామ్మ.
“అవును బామ్మా. మేము కొట్టుకోవట్లేదు. నిన్న చూసిన బాక్సింగ్ మేమిద్దరం ప్రాక్టీస్ చేస్తున్నాం. మానస అక్క కంగారు పడుతోంది” అన్నాడు వాసు తల పక్కకి తిప్పి.
“అలాంటి ఆటలు ఒక ట్రెయినర్ పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మీ అంతట మీరు ఆడకూడదు. ఒడుపు తెలియకపోతే దెబ్బలు తగులుతాయి. సరే రండి..ఈ రోజు మరి కొన్ని కొత్త శ్లోకాలు నేర్చుకుందురుగాని” అని బామ్మ వరండాలోకి నడిచింది.
“శ్రీమహా విష్ణువు కూర్మావతారం లో మంధరగిరిని, కృష్ణావతారంలో గోవర్ధన గిరిని మోశాడు! అవునా? ఇంకా వరాహావతారంలో సాక్షాత్తు ఈ భూమినే మోశాడు. అలా మహాపర్వతాలని, భూమిని మొయ్యాలంటే ఆయన భుజాలు ఎంత బలంగా ఉండాలి? అలా బలమైన భుజాలున్నాయి కనుకనే ఆయనని “సుభుజో దుర్ధరో” అని మెచ్చుకుంటున్నాం. అంటే ఎంత ప్రయత్నం చేసినా..ఎవరివల్లా కానీ అతికష్టమైన పని అయిన భూభారాన్ని, అతి తేలికగా అవలీలగా ధరించి, భరించేవాడు అన్నమాట. అలాంటి శ్రీమన్నారాయణుడిని మొయ్యటం ఎవ్వరికీ చేతకాదు. కానీ భౌతికమైన ఆకర్షణలు, వ్యామోహాలు వదిలేసి, నువ్వే కావాలి అని పట్టుదలతో ఆయన గురించి దీక్షగా తపస్సు చేసే వాళ్ళ మనస్సుల్లో ఆయన ఉంటాడు. ఆయనని వాళ్ళు మొయ్యగలరు. అంటే..అలాంటి ‘దుర్దరుడిని’ మన మనసులో ధరించాలంటే మనం అంత దీక్షగా ఆయనని ధ్యానించాలి, పూజించాలి అన్నమాట” అంది బామ్మ.
“ఒక్కోసారి బుజ్జిగాడు ఉన్నట్టుండి ఏడుపు మొదలుపెడతాడు. నాన్న వచ్చి ఎత్తుకున్నా ఊరుకోడు. మా బామ్మ పిలిచినా కూడా రాడు. అమ్మే కావాలి, ఎవ్వరూ వద్దు” అని మా అమ్మ కోసం బుజ్జి గోల చేస్తాడు. అప్పుడు అమ్మ, వంటింట్లో పని వదిలేసి పరుగెత్తుకొచ్చి వాడిని ఎత్తుకుంటుంది. అప్పుడు వాడి మొహంలో సంతోషం చూడాలి. అబ్బో ఏదో సాధించిన విజయ గర్వం వాడి మొహంలో కనిపిస్తుంది. అలాగే కదా బామ్మా..శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చెయ్యాల్సింది” అని అడిగాడు గోపాల్.
“భలే చెప్పావురా. నువ్వు ఇచ్చిన ఉదాహరణ చాలా బాగుంది. సరే ఇప్పుడు “వాగ్మీ” అంటే మన వాక్కులకి మూలమైన శక్తి ఆయనే అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అంటే ఆయన పవిత్రమైన వాక్కు కలవాడు. అంతే కాదు..ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మన మాటలకి ఆధారం.”
“మహేంద్రో వసుదో వసు:” అంటే..మీకు కొంచెం వివరంగా చెబుతా వినండి. పూర్వం వేద కాలంలో రాజులు అశ్వమేధ యాగాలు చేసేవారు. అశ్వ మేధ యాగం చెయ్యటం అంటే అంత తేలికైన విషయం కాదు. అలా అతి కష్టమైన నూరు అశ్వ మేధ యాగాలు చేసిన వారికి ఇంద్రుడి పదవి వచ్చేది. ఇంద్రుడు అంటే దేవతలకి అధిపతి మీకు తెలుసు కదా! అలా క్లిష్టమైన నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవి పొందే అందరికంటే గొప్పవాడు, పై స్థాయి వాడు కాబట్టి శ్రీమహావిష్ణువును ‘మహేంద్రుడు’ అంటాం. అలాంటి మహేంద్రుడు జీవులకు ఇవ్వలేనిది అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఆయన మనకి అన్ని విధాలైన సంపదలని ఇవ్వగలడు. సంపదలు అంటే మన ఆహారమైన అన్నం కావచ్చు, విద్యాబుద్ధులు కావచ్చు, జీవనానికి సంబంధించిన కళలు కావచ్చు, పంటలు పండించుకునే భూములు కావచ్చు, పాడి పశువులు కావచ్చు, ప్రకృతి కావచ్చు..ఇలా అన్ని సంపదలని భూలోక వాసులకి ఇస్తూ..తాను మాత్రం అన్ని లోకాలకి పైన అంతరిక్షంలో అంతటా వ్యాపించే వాయుదేవుడి లాగా ఎవరికి ఒక రూపంతో కనబడకుండా ఉండే అద్భుత శక్తి ఆ శ్రీమన్నారాయణుడు అన్నమాట.”
“మనం ఇంతకు ముందు “సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్” అనే శ్లోకం చెప్పుకున్నాం గుర్తుందా? అలా ఆ శ్రీమన్నారాయణుడు అనేక వేల భుజాలు, పాదాలు కలవాడు, విశ్వం అంతా వ్యాపించి ఉంటాడు అని చెప్పినట్లే..ఇప్పుడు ఇంకొక విధంగా కూడా చెప్పుకుందాం. ఆయనకి ఒక రూపం, ఒక పరిమాణం అని ఒక చట్రంలో, ఒక పరిధిలో చెప్పలేము. ఆయన నాలో నా వయసుతో, మీలో ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క వయసులో, ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క ఎత్తులో..లావుతో, ఒక్కొక్క రంగులో, ఒక్కొక్క ప్రతిభతో ఉంటాడు. సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రం, గానం, నాట్యం..ఇలా ఒక రూపం అని కాదు..ఒక ప్రతిభ అని కాదు..ఒక పరిధి అని కాకుండా అన్ని రూపాలు తానే అయి ఉంటాడు కాబట్టి ఆయనని “నైకరుపో..న+ఏక రూప” అని చెబుతాము. అలాగే గంభీరమైన, బ్రహ్మాండమైన, ఇతరులతో పోల్చలేని గొప్ప రూపం కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడిని “బృహద్రూప” అని చెబుతాము.”
“శిపి విష్ట: ప్రకాశన:” అంటే..ముందుగా ‘శిపి’ అంటే పశువు అని అర్థం. యజ్ఞంలో ఉపయోగించే పశువు ఆ శ్రీమన్నారాయణుడే. అలా అనేక యజ్ఞాలలో తానే పశువుల రూపంగా సమర్పించబడే హవిస్సుగా ఉండి..ఆ యజ్ఞానికి బలై, మళ్లీ తానే ఆ యజ్ఞ ఫలాన్ని మనకి ఇస్తాడు. అంటే యజ్ఞము ఆయనే, యజ్ఞం చేసే యజమాని ఆయనే, యజ్ఞంలో సమర్పించే హవిస్సు ఆయనే, ఆ హవిస్సుని భుజించేది ఆయనే అన్నమాట. అలా అన్ని రూపాలూ..ఆఖరికి యజ్ఞ పశువుల రూపమూ తానే అయి ప్రకాశించే మహోన్నత రూపం ఆయనే.”
“అంతేకాదు ఈ పదాలకి ఇంకొక అర్థం కూడా ఉన్నది.. ‘శిపి’ అంటే కిరణాలు. సూర్య కిరణాల రూపంలో నీటిని గ్రహించేవాడు. చంద్ర కిరణాల రూపంలో చల్ల దనాన్ని అందించేవాడు. మొత్తంగా చెప్పాలంటే కిరణాల రూపంలో సూర్య చంద్రులుగా ప్రకాశించి, నీటిని గ్రహించి చల్లదనాన్ని పంచేవాడు. కిరణాలతో ప్రకాశించి లోకానికి వెలుగుని పంచేవాడు.. కాబట్టి ఆయనని “శిపి విష్ట: ప్రకాశన:” అని విశేషమైన అర్థంతో చెబుతాము” అని ఆ రోజు శ్లోకాలు, వాటి అర్థం చెప్పటం ముగించింది బామ్మ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి