“వినరో భాగ్యము విష్ణు కథలు”:(38): - ఎం బిందుమాధవి

 “అమృతాం శూద్భవో భాను: శశబిందు: సురేశ్వర:
ఔషధం జగతశ్శేతు: సత్యధర్మ పరాక్రమ:
భూతభవ్య భవన్నాథ: పవన:పావనో ఽనల:”

“బామ్మా ఏం చేస్తున్నావ్” అంటూ బిలబిల్లాడుతూ పిల్లలంతా బామ్మ చుట్టూ చేరారు.
“పెరుగు చిలుకుతున్నాను. కాసేపు అలా కూర్చోండి..వెన్న తయారయ్యాక అందరికీ తల కాస్త పెడతాను. తిన్నాక..ఇప్పటివరకు నేర్చుకున్న శ్లోకాలు అందరు తలా ఒకటి అప్పచెప్పండి. అప్పుడు తరువాతి శ్లోకాలు చెప్పుకుందాము”అన్నది బామ్మ.
“బామ్మా..మా అమ్మ కూడా నీ లాగే పెరుగు చిలుకుతుంది. యశోదా దేవి పెరుగు చిలుకుతుంటే, చిన్ని కృష్ణుడు ఆవిడ వీపు మీద పడుకున్నట్టు ఉన్న క్యాలెండర్ మా ఇంట్లో ఉంది” అన్నాడు విష్ణు.
“మొన్న బామ్మ చెప్పిన కథలో.. రాక్షసులు, దేవతలు మంధర గిరిని కవ్వంగా పెట్టి క్షీర సాగరాన్ని చిలుకుతున్నప్పుడు, మునిగిపోకుండా తన వీపు మీద మోస్తున్న కూర్మావతార శ్రీమహావిష్ణువు క్యాలెండర్ మా ఇంట్లో ఉంది” అన్నది మానస.
“ఓహో నేను పెరుగు చిలుకుతూ ఉంటే, మీకు అవన్నీ గుర్తుకొచ్చాయా? బాగుంది..అయితే ఇప్పుడు దానికి సంబంధించిన శ్లోకాలు చెప్పుకుందాం. ‘అమృతాం శూద్భవో భాను: శశబిందు: సురేశ్వర:’ అంటే ..క్షీర సాగర మథనం జరుగుతూ ఉండగా, అందులో నించి ముందు విషం బయటికి వచ్చింది. దాన్ని పరమశివుడు తాగేశాడు. ఆ కథ తరువాత చెప్పుకుందాం. ఆ తరువాత ఉచ్ఛైస్రవం అనే గుర్రం, ఐరావతం అనే ఏనుగు, కామధేనువు అనే ఆవు, చంద్రుడు, లక్ష్మీ దేవి వచ్చారు. అవన్నీ వచ్చాక అప్పుడు అమృతం వచ్చింది. ‘అమృతం’ అంటే..మృతి, చావు లేకుండా చేసేది అన్నమాట.”
“మీకు తెలుసు..జీవులన్నీ పుట్టాక పెరిగి కొంతకాలం అయ్యాక చనిపోతాయి. అలా చావు లేకుండా ఉంచే ‘అమృతం’ కోసం పాల సముద్రాన్ని దేవతలు, రాక్షసులు చిలికారు. అలా వచ్చిన ఆ అమృతాన్ని మాకు కావాలంటే మాకు కావాలని వాళ్లు కొట్టుకోవటం మొదలు పెట్టారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ‘మోహిని’ అవతారంలో వచ్చి దేవతలని, రాక్షసులని విడి విడిగా చెరొక వైపు కూర్చోపెట్టి అమృతం పంచాడు. సరే..ఆ కథ అలా ఉంచితే..అలా పాల సముద్రంలో నించి పుట్టిన చంద్రుడు అందమైనవాడు, చల్లగా ఉండి ఆహ్లాదాన్ని కలిగించేవాడు అని అనుకుంటూ ఉంటాం కదా! చంద్రుడిలో ఒక మచ్చ కూడా ఉంటుంది మీరు చూశారా” అని అడిగింది బామ్మ.
“ఆ:( చూశాం. అది కుందేలు అని చెప్పింది అమ్మ” అన్నారు పిల్లలు.
“అలా బిందువు లాంటి మచ్చ కలిగిన ఆ చంద్రుడి వెలుగుని, ప్రకాశాన్ని ఏమంటాం” అని అడిగింది బామ్మ.
“వెన్నెల” అన్నారు అందరూ ముక్త కంఠంతో.
“వెన్నెల చల్లగా, హాయిగా ఉంటుంది కదా బామ్మా” అన్నారు.
“అలా దిష్టి చుక్కలాంటి మచ్చ కలిగిన చంద్రుడి లాగా అందంగా ఉంది, ఆయనలాగే చల్లగా ఉండే వెన్నెలని కురిపిస్తూ ఆహ్లాద పరిచే వాడు ఆ శ్రీమహావిష్ణువు అని అర్థం. అంతేకాదు..స్వయంగా ప్రకాశించే సూర్యుడి తాపం, వేడి కూడా కలిగిన వాడు ఆ శ్రీమహావిష్ణువు అని ఆ శ్లోకానికి అర్థం.”
“బామ్మా..పగలు సూర్యుడు తనవైన కిరణాలతో విశ్వం అంతటా స్వయంగా కాంతిని, ప్రకాశాన్ని వెదజల్లుతూ..పంటలకి అవసరమైన వర్షానికి కారణమవుతాడు. సూర్యుడి నించి కాంతిని పొందే చంద్రుడు..రాత్రి పూట తన కిరణాలతో మనకి చల్లదనాన్ని ఇస్తూ ఔషధాలనిచ్చే మొక్కలకి శక్తిని ఇస్తాడు. కొన్ని మొక్కలు పగలు సూర్యుడి శక్తితో పెరిగితే, కొన్ని మొక్కలు..ముఖ్యంగా ఔషధ మొక్కలు రాత్రి చంద్రుడి కిరణాల శక్తితో పెరుగుతాయి కదా” అన్నాడు వాసు.
“అవును. కాబట్టి అలాంటి శ్రీమహావిష్ణువు గురింఛీ యోగులు తపస్సు చేసి మాత్రమే తమ మనసులో ఆయన్ని నిలుపుకోగలరు. భౌతికమైన విషయాలతో నలిగిపోతూ..అందులోనించి బయటపడలేక బాధపడుతున్న వారిని ఉద్ధరించి, వారికి ఊరటకలిగించి మోక్షం పొందటానికి అవసరమైన ఒక వారధి వంటి వాడు శ్రీమహావిష్ణువు. సంసారంలో..అంటే మన రోజువారీ జీవితం అన్నమాట..సంతోషాలు, ఆనందాలతో పాటు ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి కాబట్టి దాన్ని ఒక వ్యాధిగా, రోగంగా భావిస్తారు. అలాంటి రోగానికి ఆయన గురించిన ధ్యానం, తపస్సు మందు (ఔషధం) లాంటివి. అలా తపస్సు చేసే దేవతలకి, యోగులకి ఆయన ఈశ్వరుడు.”
“జీవులకు..ముఖ్యంగా మనుషులు తమ జీవితాలు సమర్ధవంతంగా, ఫలవంతంగా నడుపుకోవాలంటే ఎన్నో అవసరాలు ఉంటాయి. ఎంతమంది మీదో ఆధారపడాలి. మనకి ఆహారం పండించి ఇచ్చేవారు, వస్తువులు తయారు చేసేవారు, మందులు తయారు చేసేవారు, ఆ మందులు ఉపయోగించి మనకి వ్యాధి నివారణ చేసే డాక్టర్స్, మనకి విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు, మనకి ఇతరుల వల్ల అపాయం కలగకుండా యుద్ధం చేసి రక్షించేవారు ..ఇలా అనేకపనులు చేసేవారిని నాలుగు భాగాలుగా విభజించారు. వాటినే నాలుగు వర్ణాలు అన్నారు. వాటి పేర్లు ‘బ్రాహ్మణ’, ‘క్షత్రియ’, ‘వైశ్య’, ‘శూద్ర’. తమ విద్యతో, మేధస్సుతో ఆలోచన, మంత్రాంగంతో జ్ఞానాన్ని పంచేవారు..యజ్ఞ యాదాద్రి క్రతువులు చేస్తూ వైదిక ధర్మాన్ని నిలబెట్టేవారిని ‘బ్రాహ్మణులని’, ప్రజలని తన శక్తి సామర్థ్యాలతో, భుజ బలంతో పరిపాలించేవారిని ‘క్షత్రియులని’, తయారైన వస్తు సామగ్రిని వ్యాపారం చెయ్యటం ద్వారా ప్రజల దగ్గరకి చేర్చేవారిని ‘వైశ్యులని’, శారీరక శ్రమతో పంటలు పండించే వారిని, పరిశ్రమల ద్వారా వస్తువులని ఉత్పత్తి చేసేవారిని, పెద్దవారై వృద్ధులైన వారికి అవసరమైన సేవలు చేసేవారిని ‘శూద్రులని’ నిర్వచించారు.
“అలా వర్ణాశ్రమ ధర్మాలను నిర్ణయించి, ఆ క్రమాన్ని నియమంతప్పకుండా..ఒక దానితో ఒకటి సంఘర్షించుకోకుండా నిర్వహించి కాపాడుతాడు ఆ శ్రీమహావిష్ణువు. అలాగే మనిషి జీవితంలో నాలుగు దశలని సూచించే వర్ణ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. అవి కౌమారం, యవ్వనము, వార్ధక్యము, వాన ప్రస్థము. ఏ వయసులో చెయ్యవలసిన పని ఆ వయసులో.. ఏ అతిక్రమణ లేకుండా దర్మబద్ధంగా నిర్వహింప చేసే శక్తి ఆ శ్రీమహావిష్ణువే!
“ఆహారాన్ని, ఔషధాలని సమకూర్చి జగత్తుని కాపాడుతూ ఉంటాడు. సత్యానికి, ధర్మానికి రూపమే ఆయన. ఆయన స్వయం ప్రకాశకుడు, ప్రతాపవంతుడు. అందుకే ఆయన “సత్య ధర్మ ప్రతాపన:”.
“భూత కాలం అంటే..గడిచిపోయిన కాలం, భవ్య అంటే గడుస్తున్న కాలం, భవత్ అంటే రాబోయే కాలం..ఈ మూడు కాలాల్లో పుట్టే అన్ని జీవులకు ప్రాణ శక్తి ఆయనే. అంటే అన్ని కాలాల్లోనూ ఆ దేవదేవుడు ఉన్నాడు, ఉంటాడు. అందుకే ఆయన “భూత భవ్య భవన్నాథ:” అని కీర్తిస్తాము.
“ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఈ లోకాలని పోషించి, రక్షించే పంచ భూతాలైన వాయువు, అగ్ని, జలము వంటి పవిత్రమైన స్వరూపం ఆయనే అయి ఉంటాడు. వాయువుకు వీచే శక్తిని, ప్రేరణని కలిగిస్తాడు. అనల అంటే ప్రాణ శక్తి. మళ్లీ ప్రాణ శక్తి..ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన…’అని పది రకాలు అని, మన శరీరంలో వాటి పని పది రకాలుగా ఉంటుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అందుకే ఆయనని “పవన: పావనో ఽనిల:” అంటాము” అని ముగించింది బామ్మ.
కామెంట్‌లు