శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 59
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
38.రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితా (షోడశాక్షరీ)
39.కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా (షోడశాక్షరీ)
ముప్పైతొమ్మిదవ నామ మంత్రము - 
  ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః
పరమేశ్వరుడు మాత్రమే సొంతం చేసుకోగలిగిన, మృదువైన ఊరువులు కలిగివున్న శ్రీమాత కు నమస్కారము.
ఈ చరాచర జగత్తులో ప్రకృతి గురించిన ప్రతీ విషయము పురుషునికే సొంతమై, పురుషునికి మాత్రమే తెలుస్తుంది. అలాగే, భార్య యొక్క సర్వాంగ సౌందర్యం ఆమె భర్తకే తెలుస్తుంది. ఈ విషయంలో, సర్వ జగత్తుకు ఆదర్శ జంటగా వున్న పార్వతీ పరమేశ్వరులు కూడా, మినహాయింపు కాదు. అమ్మవారి సర్వాంగములు వివిధ దేవతల అంశలవలన ఏర్పడ్డాయి అనే విషయం, మనం ఇతఃపూర్వం తెలుసుకున్నాము.
వరుణుని తేజస్సుతో పిక్కలు, తొడలు; భూదేవి అంశతో నితంబ భాగము (పిరుదులు) ఏర్పడ్డాయి. సర్వ జగత్తుకు సాక్షీభూతుడు పరమేశ్వరుడు. అన్ని శుభములనూ కలిగించేవాడు. సచ్చిదానంద స్వరూపుడు. కామేశ్వరుడు కూడా. పరమేశ్వరి, కామేశ్వరి. కామేశ్వర కామేశ్వరిలు, ఆదిదంపతులు. కనుక, కామేశ్వరుడు మాత్రమే తెలుసూకోగలిగిన ఊరువులు కలది, కామేశ్వరి. కామేశ్వరి, అత్యంత పతివ్రత కదా!
పరమేశ్వరి ఎడమ తొడ సౌభాగ్యానికి, కుడి తొడ మార్దవానికి సంకేతములుగా వున్నాయి. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, సూద్రులనే నాలుగు వర్ణాలకు ఎడమ తొడ సూచన అయితే, పంచభూతములు అయిన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారాలకు కుడి తొడ సంకేతము. కామేశ్వరి అనుగ్రహం తో, ఈ విషయాన్ని గ్రహించిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను, "కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా" అని కీర్తించగా, పులకాంకిత రోమాంచిత అయ్యింది, ముజ్జగాల తల్లి.
సకల దేవతల అంశలుగా ఎర్పడ్డ అమ్మ నుదుటి నుండి పలుకుల వరకు, ఉపమానాలతో అమ్మను కొలిచి, పిలిచిన వశిన్యాది వాగ్దేవతలు, అమ్మ ఊరువులు కామేశ్వరునికి మాత్రమే తెలియడం వలన, ఎటువంటి ఉపమానమును వాడలేదు.
ఏకపత్నీ వ్రత, పరమ సాధ్వి అయి, సమస్త సృష్టిని అనుగ్రహిస్తున్న లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు