శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 61
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
40.మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా (షోడశాక్షరీ)
41.ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా (షోడశాక్షరీ)
నలభై ఒటవ నామ మంత్రము - 
  ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః
ఇంద్రగోప = ఆరుద్ర పురుగు; పరిక్షిప్త = చుట్టూ అమర్చబడి వున్న; స్మర తూణ = మన్మధుని బాణముల పొది; జంఘిక = కాలి పిక్క
ఆరుద్ర పురుగులు చుట్టూ అమర్చబడిన మన్మధుని అమ్ముల పొది వంటి పిక్కలు కలిగిన పరమేశ్వరికి నమస్కారము.
ఆరుద్ర పురుగులు, గురివింద గింజ రంగులో ఎర్రగా వుంటూ, మెత్తటి మొఖమల్ బట్టలాంటి పట్టు బట్టను కప్పుకున్నట్టుగా కనిపించే పురుగు, ఆరుద్ర కార్తె లో మాత్రమే కనాపిస్తాయి. ఈ ఆరుద్ర పురుగు పంటపొలాలను సారవంతం చేయడంలో రైతుకు సహాయంగా ఉంటుంది. ఈ ఆరుద్ర పురుగు కనిపించినప్పుడు రైతులు నాటు వేయడానికి సమయం వచ్చింది అని వారి పని మొదలెడతారు. ఈ పురుగులు, వర్షంలో తడిసి చనిపోకుండా, ఇంద్రుడు కాపాడటం వలన, వీటికి "ఇంద్రగోపములు" అనే పేరు వచ్చింది.
మన్మధుని తూణిరములో ఐదు బాణములు వుంటాయి. ఈ తూణిరము ఆరుద్ర పురుగులతో అందముగా చుట్టబడి ఉంటుంది. ఇటువంటి అందమైన అమ్ముల పొది లాగా పరమేశ్వరి కాలి పిక్కలు కనిపిస్తున్నాయి. సంపెంగ, పున్నాగ మొదలైన సువాసనలు వెదజల్లే పుష్పాలతో చేయబడిన బాణాలు ఐదు ఈ తూణీరము లో వుంటాయి. కానీ, అమ్మ వారిని అయ్యకు తోడుచేయడం లో ఇవి సరిపోవని, పదేసి బాణములు వుండి, తన తూణీరమును బోలిన అమ్మవారి పిక్కలను తోడు తెచ్చుకున్నాడు, మన్మధుడు. ఈతని చెరకు విల్లు మీద సమ్మోహన మరియు వశీకరణ బీక్షర మంత్రాలు రాయబడి ఉంటాయి.
ఇంద్రగోపము అంటే, మంత్రము లోని బీజాక్షరము అని కూడా గూడార్ధము ఉంది. తూణీరము అంటే, మంత్ర బీజాక్షరాల సముదాయము కలిగి వున్నది. కనుక, అమ్మ జంఘికలు (పిక్కలు) బీజాక్షరాలతో ఏర్పడ్డ మంత్ర సముదాయ స్వరూపాలు. ఇటువంటి పరమేశ్వరి జంఘికలను చూసి వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా" అని కీర్తించారు.
మన్మధుని తూణీరము వంటి పిక్కలు కలిగి, మనలను అనుగ్రహిస్తున్న లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు