పుష్పంలా వికసించే రెండు హృదయాల ఏకధ్వని ప్రేమ,
రెండు అక్షరాల పదం కాదు — జన్మజన్మల బంధం.
మమతతో నిర్మితమైన విశ్వాస సౌధం,
కుటుంబానికి భరోసా, జీవితానికి ఆధారం.
కాని ఈ కాలంలో ప్రేమ
ఆకర్షణకు మరొక పేరైంది.
రూపం మెరుపు, డబ్బు వెలుగు
మనసులను మాయలో ముంచుతున్నాయి.
ఈ రోజు ఒకరితో, రేపు మరొకరితో
పుస్తక పేజీలలా బంధాలు మారుతున్నాయి;
మాటలు తేలికవై,
వాగ్దానాలు కాలంతో కరిగిపోతున్నాయి.
ఒక క్షణిక మోహం కోసం
ఒక జీవిత బంధం విరిగిపోతోంది.
ఇప్పటికే ఉన్న కుటుంబం చీలిపోతోంది,
పిల్లల భవిష్యత్తు మౌనంగా మసకబారుతోంది.
ఇది ప్రేమ కాదు — స్వార్థం;
ఇది ధైర్యం కాదు — ద్రోహం.
ప్రేమ, పెళ్లి అనే పదాలే
భయాన్ని కలిగిస్తున్నాయి.
“కలకాలం నిలుస్తుందా?” అనే సందేహం
మంచి మనసులను వెనక్కు నెడుతోంది.
ఒంటరి జీవితాల నీడలో
నమ్మకం క్రమంగా కరుగుతోంది.
నిజమైన ప్రేమ
ఇతరుల గూడు కూల్చి నిలబడదు;
అది కాపాడుతుంది, నిర్మిస్తుంది.
అందమైన సంసారం కోరుకోవడం సరిపోదు,
దాన్ని నిలబెట్టడం బాధ్యత.
ప్రేమకై వచ్చిన హృదయాన్ని
ఆటగా కాదు — ఆత్మగా భావించు.
పెళ్లి ఒక వేడుక కాదు — ప్రతిజ్ఞ.
ఒక ప్రేమ, ఒక జీవిత భాగస్వామి
అనే విలువను మళ్లీ నిలబెట్టు.
ప్రేమ అంటే పవిత్రమైన మనసు అని
ఈ లోకానికి మళ్లీ చాటిచెప్పు;
నీ చిరునామా
చిరస్థాయిగా నిలిచేలా ఉంచు.
హామి: ఇది నా స్వీయ రచన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి