1.
శ్రమ మానవ సౌందర్యం ,
జీవన ఐశ్వర్యం!
ఒకరికొకరు తోడు సుమా,
శ్రమ బతుకు చిరునామా!
నలుగురు కలిసి పొరుపులు, మరవాలి చేతులు కలపాలి!
బాటసారులై శ్రమ రహదారి,
వేగంగా గమ్యం చేరాలి!
దేహం దేశం కోసమే,
స్వేదం చిందిస్తూ బతకాలి!
2.
పల్లెలు ఉత్పత్తి మూలాలు, పట్టణాలు విక్రయ కేంద్రాలు!
పల్లె వస్తువులు పట్నం చేరాలి, కష్టానికి తగ్గ ఫలం దక్కాలి!
బాల్యం నుంచి శ్రమ విలువ, జీవితానికి ఇచ్చు చలువ!
ఆలు పెరుగని శ్రమ,
విజయానికి చేర్చే త్రోవ!
శ్రమ నిజ వారసత్వం జనజీవనసత్వం బలోపేతం!
3.
కష్టపడే అలవాటు ,
జీవితానికి జరుగుబాటు!
తిని కూర్చుని విశ్రాంతి,
అంటే, తప్పదు రోగాల వేటు!
పనిలో మార్పు విశ్రాంతి,
అదే మన ప్రగతి తూర్పు!
శ్రమ ఎక్కడైనా చెల్లే ధనం,
జీవన రధ గమన ఇంధనం!
పిల్లలకి సుఖం మప్పితే, సోమరిపోతులు అవుతారోయి!
కష్టం నేర్పి పందెం ఎడ్లు చేయి,
జీవితాన గెలుస్తారోయి!
4.
వట్టి మాటలు కట్టి పెట్టు ,
గట్టి మేల్ తల పెట్టు!
లక్ష్యం చేరే దాకా ,
అలసిపోనని ఒట్టు పెట్టు!
నీ బతుక్కి లోకం ,
తప్పక సరి విలువ కట్టు!
నిజం ,సమాజం,
సదా శ్రమకే పట్టం కట్టు!
శ్రమ లేని జీవితం ,
నలుగురి ముందు తీసి కట్టు!
5.
భరతమాత పుత్రులం!
శ్రమ జీవన పవిత్రులం!
జీవితాంతం ప్రాణమిత్రులం!
జీవనాన యశోపాత్రులం!
_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి