సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -149:- అక్క చెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క రాసినట్టు
*****
"గాడేం మడిషవ్వా? అమ్మ నాయినతో  ఎంత కయ్యం బెట్టుకుంటే మాత్తరం లోకంల గిట్ల ఎవడన్నా శేత్తడా?
"ఎవరు శెల్లే? గా శేషయ్యనేనా?"
ఆఁ గా పెద్దాయన సంగతి మనకేమెర్కవ్వా! మనింట్లె పెద్దోళ్ళు అంటుంటే యిని గట్లనా అన్కున్నం".
"ఇంతకి ఎవలు శెల్లె? గా పెద్దాయన జుట్లె నుంచి ఎల్లిండు సూడు గాయన కొడుకు భూషయ్య అవ్వా!" గాయనంత కంకుష్టోడు గీ లోకంల లేనే లేడు గావొచ్చు." గాయనంత పీనాసి మొహపోడు ఎవలుండరు అవ్వా!"
అవునా! గాయన సంగతి నాకు తెల్వదు గని,గీ నడ్మల్లనే శేషయ్య తాత తన పిల్లగాండ్లకు తనకున్న ఆత్తంత పంచిండంటగ.
"అవునవ్వా ! గా తాత తన కొడుకుతో పాటు బిడ్డలిద్దర్కి సుత పంచిండండంట"
శానా మంచిపని చేశిండు తాత. గీ నడ్మల పుట్టిన ఆడివిల్లలకి సుత ఆత్తిలో బాగాలుంటయని,అక్కులుంటయని సర్కార్ సట్టం సుత సేశింది గని గవి ఎవ్వలు పాటిత్త లేరైరి..పెండ్లిల్లని లచ్చల లచ్చల అప్పు తెచ్చి అడ్గినన్నిచ్చి లగ్గం జేత్తున్నరు. గందుకని శానామంది ఆత్తి పంపకాలల్ల సందు వెట్టట్లేదు."
"అవు మల్ల గా భూషయ్య గందుకనే గట్ల జేసిండా ఏంది? అసలే పైసకి పది ముళ్ళు ఏసే రకం.
 ఏం జేసిండు శెల్లె?
 "ఏం జేసుడా? గీ నడ్మల శేషయ్య తాత పెళ్ళాం ముత్తవ్వ సచ్చిపోయింది గద!
అవును శెల్లె! పాపం గా తాత ఒంటరోడయ్యిండు. ముసలి తనంల ఒకలికొకలే తోడు. ఇద్దరు కూకోని అచ్చట్లు ముచ్చెట్లు పెట్టుకునేటోళ్ళు."
అవునవ్వా! గా ముత్తవ్వ కర్మలకి,మాశికాలకి ఇద్దరు ఆడవిల్లలు మొగుళ్ళతో పిల్లలతో సహా వత్తా పోతా ఉండ్రు. 
 "ఓ దినం నాడు అక్కను,శెల్లెను పిలిశి వాల్ల నాయిన్ని సుత కూసబెట్టి  నాయినకు  అక్కోళ్ళు,శెల్లోళ్ళు ఎప్పుడెప్పుడు ఎంతెంత మంది వొచ్చి తిన్నది మొత్తం లెక్క రాశిందంత సూపిచ్చిండంట.
"ఓష్నీ లోకం పాడుగాను.తోడబుట్టిన తోడు, ఒక్క రక్తం పంచుకుని పుట్టినోళ్ళు,సొంత అక్క చెల్లెళ్లు గద గస్మంటి అక్క శెల్లెండ్లకు అన్నం బెట్టి లెక్క రాత్తడా? అన్యాలం పాడుగాను.శెల్లె!"
"గా మాటలిని,వొయ్యిలో లెక్కల రాతల్ని జూశి శేషయ్య తాత ఒక్కసారిగా బెహవూష్ అయ్యిండట.తేరుకున్నంక "గిదేం పద్దతి రా అయ్యా! పరాయోళ్ళ గురించి రాశినట్టు రాశినవు.' అని అడ్గితే నాతో పాటు గాళ్ళకు సుత ఆత్తిలో వాటాని రాశిచ్చినవు గద. గందుకే అట్ల రాశిన అన్నడడంఃట్పట్పట"
 గస్మంటోన్ని ఏం జెయ్యాలో,ఎట్ల మార్సాలో తెల్వక తల పట్టుకుండు శేషయ్య తాత.
గదండీ సంగతి! మానవ సంబంధాలు మనీ సంబందాలు అయితున్నయనడానికి గిదే నిదర్శనం.గీ"అక్క చెల్లెళ్ళకు అన్నం బెట్టి లెక్క రాసినట్టు" అనడానికి ఉదాహరణ గిదే మరి.

కామెంట్‌లు