మీరు ఉన్న చోటే ఉండండి: - - యామిజాల జగదీశ్
 ఒక యువకుడు భగవాన్  రమణ మహర్షి వద్దకు వచ్చి, "స్వామీ! నేను తపస్సు చేయాలనుకుంటున్నాను. నేను దానికి తగిన స్థలాన్ని ఎంచు కోవాలనుకుంటున్నాను. మీరు చెప్పిన చోటుకి నేను వెళ్లి తపస్సు చేస్తాను.
కనుక నేను తపస్సు చేయడానికి ఎక్కడికి వెళ్లవచ్చో చెప్పగలరు?" అని అడిగాడు.
భగవాన్ ఓ నవ్వు నవ్వి "మీరు ఎక్కడికి వెళ్లి తపస్సు చేయాలో నేను మీకెలా చెప్పగలను? మీరు ఉన్న చోటే ఉండటం మంచిది" అని హాలు నుంచి లేచి వెళ్ళిపోయారు.
అయితే ఆ యువకుడికి ఏమీ అర్థం కాలేదు. "స్వామి ఇలా ఎందుకు అన్నారు? ఓ పవిత్ర స్థలానికి వెళ్లి తపస్సు చేయమంటారని కదా నేను అడిగాను. తీరా ఆయనేమో నేనేం చెప్పను అని అంటారే మినీ?" అని అనుకున్నాడు.
"ఇలాంటి సమాధానం పొందడానికి నేను ఈ వ్యక్తిని సలహా అడిగేనా?" అని తనలో అనుకున్నాడు.
హాలులో ఉన్న భక్తులలో ఒకరు ఆ యువకుడి దగ్గరకొచ్చి రమణులవారు ఏం చెప్పారో వివరించారు.
"రమణుల‌వారి మాటల్లో లోతైన భావం ఉంది. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అంటే నీ స్వంత ఆత్మలో, నీ స్వంత రూపంలో ఉండు. అంటే, నిన్ను నువ్వు తెలుసుకోవాలి.
ఇదే ఆయన బోధ. నీవు ఎవరో తెలుసుకున్న తర్వాత, నువ్వు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడ ఉన్నా, నీ స్వంత ఆత్మ రూపంలోనే ఉండాలి... అంతే..." అని ఆ భక్తుడొకరు చెప్పగానే యువకుడు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు.

కామెంట్‌లు