ఓట్ల (నోట్ల) పండుగ... : - కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
మూడు మినీ కవితలు...

1. కరెన్సీ కట్టలే...?



ఈ కరెన్సీ కట్టలే కదా... 
నిత్యం నీ చిట్టిపొట్టను నింపేది... 
ఆపదలో నీ ప్రాణాలకు ఆక్సిజన్....

ఈ ధనంతోనే కదా... 
నీవు విర్రవీగేది...
విచ్చలవిడిగా తిరిగేది... 
విలాసాలకు మరిగేది...

ఈ ధనమే కదా... 
నిన్ను అప్పుల 
నిప్పుల్లో కాల్చేది...
నిన్ను గాడిదలమీద 
ఎర్ర గుర్రాల మీద 
ఏనుగుల మీద ఊరేగించేది...

ఈ ధనమే కదా... 
నిత్యం నీవెంట ఉండి 
నిన్ను మురిపించి... 
మైమరిపించి... 
నీ తలపై కిక్కి 
నిన్ను తైతక్కలాడించి...
నిన్ను కోటీశ్వరున్ని చేసి 
కొండలపై కూర్చోబెట్టి... 

"నాది నాది అని 
"నీవెంత భ్రమపడినా 
"ఏది నీది కాదనేది...
"నీవు కాటికెళ్ళినా 
"నీ వెంట రాననేది"...

ఈ ధనమే కదా... 
నీ సద్గుణాన్ని 
దుర్గుణంగా మార్చేది... 
నిన్ను ఒక భ్రష్టునిగా
ఒక దుష్టునిగా ముద్రవేసేది...

ఈ ధనంతోనే కదా... 
నీవు ఈ భూగోళం 
పట్టనంతగా ఆర్జించినా 
"నీ ఆరోగ్యాన్ని నీవు కొనలేనిది"...
"నీ కిష్టమైన బిడ్డను నీవు కనలేనిది"...

కానీ ఈ ధనంతోనే కదా...
"నీవు ఖండాంతర ఖ్యాతినార్జించేది"... 
"ఆరని ఒక ఆశాజ్యోతిగా నీవు వెలిగేది".

2. ఓట్ల పంటకు...కోట్ల పెట్టుబడి..?

రాజకీయ నాయకులు 
ఎన్నికల్లో గెలిచేందుకు 
ఓట్ల పంట కోసం
కోట్ల పెట్టుబడి పెట్టేది...
నోట్ల కట్టలు పోటీపడి పంచేది...

అమాయకపు 
ఓటర్లకు ఎర వేసేది 
బంగారు నగలిచ్చేది 
పట్టుచీరలు పంచేది...

ఈ ధనమే కదా...
మనిషి 
అధికారానికి... 
అహంకారానికి... 
అవినీతికి...మూలకారణం 

కానీ ఈ ధనమే కదా...
మనిషి 
నీతినిజాయితీకి...
దానధర్మాలకు...
దాతృత్వానికి...
దైవత్వానికి...
మంచితనానికి... 
మానవత్వానికి...
నిలువెత్తు నిదర్శనం...

3. ధనాన్ని దాచుకో దోచుకో..? 

ఈ ధనమే కదా... 
దుష్ట సంస్కృతికి 
దుఃఖానికి 
దుర్వెసనాలకు
మనిషి పతనానికి 
మూలకారణం...

ఈ ధనాన్నే కదా... 
దొంగలు దొరలు దోచుకునేది 
స్విస్ బ్యాంకుల్లో దాచుకునేది 

కానీ ఈ ధనమే గదా... 
మనిషిని మనీషిగా...
దానవున్ని మాధవునిగా మార్చేది...  
పాతాళానికికాక పరలోకానికో చేర్చేది..
 

కామెంట్‌లు