విరాట పర్వము తృతీయాశ్వాసము-* 181వ రోజు*
విరాటుడు పాండవులకు కృతజ్ఞత చెప్పుట
అన్నగారు ధర్మరాజుతోను నకుల సహదేవులతోను భీముడు విరాటుని దగ్గరకు వచ్చాడు. విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో వారిని అభినందనలతో ముంచెత్తాడు. విరాటుడు ధర్మరాజును చూసి " మీరు నా ధన, మాన, ప్రాణాలను కాపాడారు. అందుకు ప్రతిగా నేను ఏమిచ్చుకోగలను. నా రాజ్యాన్ని మీకు సమర్పించుకుంటాను. ఇది మీరు కాపాడిన శరీరం, ఈ రాజ్యం మీరు జయించింది. కనుక ఈ మత్స్యదేశాన్ని మీరే తీసుకోండి " అన్నాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా! ఇది మీకు మా మీద ఉన్న మర్యాద. మీరు విజయోత్సాహంతో మత్స్యదేశంలో విజయం చేయడం కంటే నాకు మరొక ఆనందం లేదు. నన్ను ఇంతగా పొగడ తగదు " అన్నాడు. విరాటరాజు ధర్మరాజుని చూసి " కంకా ! నాకు అర్ధం కానిది ఒకటి ఉంది. నువ్వు చేసింది నాకు ఉపకారమా లేక నావద్ద ఉన్నందుకు సేవాతత్పరతా ! నాపై కృతజ్ఞతా ! లేక నాపై కృపా ! లేక శతృ సంహార మొనర్చి నీవు కీర్తి పొందుదామనా? ఏ కారణంతో నీవు ఈ శత్రు సంహారం చేసావు. అయినా వంటల వాడేమిటి? అతని పరాక్రమం ఏమిటి? ఆ యుద్ధం చేయడమేమిటి? ఇతడే కదా నన్ను యుద్ధంలో గెలిచింది. ఈ అశ్వశిక్షకుడు, గోపాలకుడు వీరిద్దరే యుద్ధంలో గాయపడకుండా శత్రుసంహారం చేసింది. ఆపదలో ఉన్నప్పుడు సాయంచేసిన వాడే నిజమైన మిత్రుడు. కంకా ! నీ మైత్రిని నేను మరువలేను. మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి గజములా ! అశ్వములా ! కాంచనమా! రత్నములా ! వజ్ర వైఢూర్యములా ! దేవతా కాంతల పోలు అందగత్తెలా ! నానావిధ భోగభాగ్యములా ! మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి నేను మీకు సమర్పించుకుంటాను " అన్నాడు. అది విన్న పాండవులు " మహారాజా ! మీరు మమ్ము ఇలా గౌరవించడం మాకు ఎంతో ఎక్కువ. దీని కంటే మీరు ఇస్తానన్న కానుకలు ఎక్కు కాదు. మనం అందరం నగరానికి చేరుకున్న తరువాత మమ్ములను తగురీతిన సత్కరించండి " అన్నారు. ధర్మరాజు విరాటుని చూసి " మహారాజా ! నా దొక మనవి. మీరు కోరుకోమని చెప్పారు కనుక కోరుతున్నాను. ఈ సుశర్మను అతని బంధు మిత్రులతో ససైన్యంగా విడుదల చెయ్యండి. ఇదే నేను కోరుకొనేది. వెంటనే మన నగరంలో ఈ విజయ వార్తను ప్రకటించండి. విజయోత్సవాలు జరిపించండి " అని అన్నాడు. ధర్మరాజు కోరిన ప్రకారం విరాటుడు సుశర్మను అతని బంధుమిత్రులను ససైన్యంగా విడుదల చేసాడు. ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు విరాట నగరానికి ప్రయాణ మయ్యారు.
*విరాట పర్వము తృతీయాశ్వాసము సమాప్తం *
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి