పాలఖండ్యాం బడిలో ఘనంగా ఆర్ధిక అక్షరాస్యత అవగాహన సదస్సు

 మీ సొమ్ముతో పారిపోయి, బోర్డు తిప్పేసిన బ్యాంక్ లుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలని వాండ్రంగి బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ కెల్ల సురేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాండ్రంగి బ్రాంచ్ ఆధ్వర్యంలో మేనేజర్ పెంట భరణి కుమార్ నిర్దేశాలతో పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వడ్డీ ఆశ చూపి మీతో పొదుపు చేయించుకుని ఆపై అసలుకే ఎసరు పెట్టే దోపిడీ వ్యవస్థకు గురికాకుండా ప్రభుత్వ రంగ సంస్థలలోనే మీ ఖాతా ఉంటే మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ఆర్ధిక అంశాలను అవగాహన పరుస్తూ ఆయన పలు అంశాలను వివరించారు. సభకు అధ్యక్షత వహించిన సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాటలను నమ్మి మోసపోవద్దని, ఎలాంటి సమాచారాలనూ తెలియజేయకూడదని, చరవాణిలో గేమ్స్ పేరిట ఆసక్తి కనబరచి, సొమ్మును కాజేసే ప్రమాదానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 
పార్వతీపురం రీజినల్ ఆఫీస్ నేతృత్వంలో కళా జాతర ద్వారా విద్యార్థులకు ఆకట్టుకునేలా సైబర్ నేరగాళ్ల పన్నాగాలను వివరించారు. కళాకారులు వి.సుబ్బారావు, వి.గౌరి, వి.గణేష్ లు ఆట పాట మాట కథలతో డప్పు వాయిద్యాలను మేళవించి ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలబాలికలకు ఆర్ధిక అక్షరాస్యత అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు పొదుపు బాట ఉజ్వల భవిత అనే అంశంపై వ్యాసరచన పోటీలు, సైబరాసులను తిప్పి కొడదాం అనే అంశంపై వక్తృత్వ పోటీలను బ్యాంక్ ఆఫీస్ ఎటెండర్ కె.సీతారామరాజు, వి.ఓ.ఏ. పలిశెట్టి భారతిల పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలకు అతిథుల, ఉపాధ్యాయుల చేతులమీదుగా బహుమతులను అందజేసారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉపాధ్యాయులు ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యెందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం.పెంటయ్యలు పాల్గొని ప్రసంగించారు.
కామెంట్‌లు