అక్షరీకరణం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
చూచిన దృశ్యాలు —
కళ్ల అంచుల్లో ఆగక
మనసు గోడలపై చిత్రాలై నిలిచిపోతే,
వాటిని అక్షరాలుగా కట్టిపడేస్తాను.

తట్టిన ఆలోచనలు —
మెరుపుల్లా మెదిలి 
మాయమయ్యేలోపు
పదాల వలలో పట్టి కవితగా మలుస్తాను.

ఏర్పడిన భావాలు —
హృదయపు లోతుల్లో
నిశ్శబ్దంగా ఉప్పొంగి ఊపిరి కోరినప్పుడు 
వాగ్దేవి వాక్యాలుగా వెలువరిస్తాను.

ప్రకృతి అందాలు —
పూల పరిమళాలు, ఆకుల గుసగుసలు,
నదుల పారుదల, వాన చినుకుల చిరునవ్వులను —
అక్షరాల పూలమాలగా అర్థవంతంగా అలంకరిస్తాను.

విన్న విషయాలు —
ఆనంద జ్ఞాపకాలై 
మనసును తాకితే 
కవితా స్వరాలుగా మారుస్తాను.

మెరిసిన మెరుపులు —
ఆలోచనలకు వెలుగై, అక్షరాల్లో చమకించి,
మేఘాల గర్జనలు — వేదనల ఉగ్రస్వరమైతే
పుటలపైకి ఎక్కించి పలుకవనాలకి ప్రాణం పోస్తాను.

తేనె పలుకులు —
మాటల మాధుర్యమై, 
అక్షరాల నోట నిద్రపోతే,
కలంపట్టి కాగితాలపై గీసేస్తాను.

ప్రేమ బంధాలు — 
వలవేసి పట్టుకుంటే
శాశ్వత అర్థాలుగా మలచి
కవిత గుండెల్లో బిగిస్తాను.

వాగ్దేవి వాక్కులు —
నన్ను నడిపించే 
దివ్య దీపాలై 
అక్షరీకరణానికి ఆశీర్వాదమై నిలుస్తాయి.

ఇదే నా సాధన —
జీవితం తాకిన ప్రతి క్షణాన్ని అక్షరాలుగా మారుస్తూ, 
అనుభవాన్ని కవితలుగా చేసి
కాలానికి అర్పించటమే అక్షరీకరణం అని చాటుతాను. 


కామెంట్‌లు