రాజాం పండుగ - రాష్ట్ర పండుగ

 
వందో జాతర నేటి వందేళ్ల రాజాం యాత్ర కావడంతో దీనిని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నూరేళ్లుగా దైవాన్ని కొలుచుకొనే తరతరాల ఆద్యాత్మిక శోభకు ఈ రాష్ట్ర పండుగ ప్రకటన పట్టం కట్టేలా ఉందని, ప్రజలంతా ఎంతగానో సంతోషిస్తున్నారని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు. 
రాజాం శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ప్రస్తుతం 22,23,24 తేదీల్లో అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. మరో మూడు రోజుల పాటు భక్తులకు, యాత్రికులకు ఈ సంబరాలు అలరించనున్నాయి.   ఈ ఏడాది వందేళ్లకు చేరుకున్న సందర్భంగా స్థానికులు పరిసర ప్రాంత వాసులంతా మిక్కిలి ఆనందం వ్యక్తం చేస్తున్నారని తిరుమలరావు అన్నారు. ఈసందర్భంగా ఆ అమ్మవారు వెలసిన నేపథ్యాన్ని నాటి చరిత్రను తిరుమలరావు సేకరించి వివరించారు.
విజయనగరం జిల్లా,
రాజాం పట్టణం దగ్గరలో ఉన్న కొండంపేట గ్రామంలో లంకలపల్లి వంశీయులైన అప్పడు కుమారుడైన వెంకటప్పడు విజయనగరం జిల్లాలో ఉన్న పోలిపల్లి గ్రామంలో జరిగే అమ్మవారి జాతరకు వెళ్లెను. ఆయన సకుటుంబంగా ఎడ్లబండిపై వెళ్ళినారు. అచ్చట శ్రీ అమ్మవారిని భక్తితో కొలిచి మొక్కులు చెల్లించి జాతర నుంచి తిరుగు ప్రయాణమౌతున్నారు. వారు వచ్చుచుండగా ఒక చోటకు (ఇప్పుడు ఆలయం వెలిసిన చోటుకు) వచ్చేసరికి ఎవరో బండిమీద ఎక్కినట్లుగా బండి బరువెక్కి ఎడ్లు కష్టముతో లాగుచున్నట్లు తోచింది. ఎవరా ఏమిటా అని చూడగా ఎవరూ కనిపించలేదు. ఎడ్లను ఎంత అదిలించి చూచిననూ ఎవరూ కనిపించడం లేదు. నేను పైడితల్లిని, పోలిపల్లి నుండి నీ బండిపై వచ్చినాను, ఈ పనసచెట్టుపై కొలువైయుంటానని పలికినట్లు లీలగా వినిపించింది. అప్పుడు వెంకటప్పడు అమ్మవారిని భక్తితో నమస్కరించి ఇంటికేగి ఆ మరునాటి ఉదయం ఆ వార్తను తన బంధుమిత్రులకు చెప్పడం జరిగింది. అది మొదలు అమ్మవారు కొలువైయున్న ఆ చెట్టు వద్ద ఆ వంశస్థులే కాక ఆ గ్రామస్తులు కూడా పసుపు కుంకుమలిచ్చి పూజించుచుండేవారు. రాజాం గ్రామంలో గల వాకచర్ల మల్లయ్య కోర్టు వ్యవహారాల నిమిత్తం తరచూ పార్వతీపురం వెళ్ళుచుండెడివారు. వాజ్యములు తెగక చాలా వరకు నష్టపోయినారు. అట్టి పరిస్థితులలో అమ్మవారు అతనికి కలలో కనిపించి ఆ చెట్టు వద్ద తనకు గుడిని కట్టించమని, అట్లు చేసినచో కష్టాలు పోతాయని చెప్పి అంతర్ధానమయ్యెను. మరునాడు మల్లయ్య కోర్టు వ్యవహారములపై పార్వతీపురం వెళ్ళుచూ శ్రీ అమ్మవారిని దర్శించి, ఓ తల్లీ! సమస్యలతో చాలా కాలముగా నేను కోర్టు వ్యవహారాలతో భాధపడుతూయున్నాను. చాలా వరకు ఆర్ధికంగా నష్టపోయి ఉన్నాను. నాకు కోర్టు వ్యవహారాల్లో జయము కలిగి, కష్టాలన్నీ తీరినచో నీ ఆజ్ఞ ప్రకారమూ గుడి కట్టించెదనని ప్రార్ధించి పార్వతీపురం కోర్టుకు హాజరైనారు. అమ్మవారి అనుగ్రహం పొందుటచే కోర్టు వ్యవహారాల్లో అతనికి జయం కలిగింది. ఆ శుభవార్తతో పాటు, దొంగల పాలైన తన ధనము కూడా తిరిగి దక్కినట్లు తీర్పు లభించింది. ఆ సంతోషముతో శ్రీ అమ్మవారిని దర్శించుకుని ఆలయ నిర్మాణం ఏర్పాట్లు చకచకా చేయదలచినాడు. ఆలయాన్ని నిర్మిస్తున్న విషయాన్ని తన మిత్రులైన పీసపాటి సత్యనారాయణాచార్యులు, సలాది వెంకటప్పడు మరియు గుడివాడ పెంటయ్యలను సంప్రదించి చర్చించినారు. మల్లయ్య వాస్తు పండితుడైన మజ్జి రమణయ్యతో గల సాన్నిహిత్యం వలన మిత్రుల సలహాపై 1926వ సంవత్సరంలో ఆలయ నిర్మాణపనులు మొదలు పెట్టారు. ఐతే అప్పటి రహదారులు భవనములు శాఖ సూపర్ వైజర్ ఈ స్థలము రహదారి ప్రక్కనే ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు. పెద్దలు ఎంతగా నచ్చజెప్పిననూ వారి మాటలను అతను పెడచెవిన పెట్టీ, నిర్మాణమునకు అడ్డుపడి, వేసిన పునాదులను కప్పించి వేసారు. అనంతరం అతను అనారోగ్యం పాలయ్యారు. వైద్యులెంత ప్రయత్నించినా సరే తగ్గుముఖం పట్టలేదు. ఆయన అమ్మవారిపట్ల తను చేసిన అపరాధాన్ని గ్రహించి మన్నించమని మనసారా వేడుకోగా, తిరిగి వానికి స్వస్థత చేకూరింది. ఆలయ నిర్మాణమునకు కావలసిన అన్ని అనుమతులు తానే స్వయంగా ప్రయత్నించి సహకరించినారు. అటు పిమ్మట ఆ పనసచెట్టున్న ఆ ప్రదేశమునందే ఆలయాన్ని నిర్మించి పడగొట్టిన చెట్టుతోనే అమ్మవారి విగ్రహం చెక్కించి స్థాపించినారు. ఆలయ నిర్మాణం, ప్రతిష్టా కార్యక్రమం మజ్జి రమణయ్య ఆధ్వర్యంలో జరిగింది. మల్లయ్య ధనమును వెచ్చించిరి. తద్వారా ఆలయ నిర్మాణం 1927 నాటికి పూర్తిచేసినారు. ఆ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే ఆది, సోమ, మంగళవారాలలో శ్రీ అమ్మవారి యాత్ర అత్యంత వైభవంగా జరుగుతున్నది.
అప్పటినుంచి మల్లయ్య ఆలయ ధర్మకర్తగా వారి జీవితకాలమందు వ్యవహరించారు. తదుపరి వారి కుమారుడు లక్ష్మణరావు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరించేవారు. 
ఈ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి యాత్రలో తాను గత పద్నాలుగేళ్ళుగా పాల్గొనుట పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని కుదమ తిరుమలరావు సంతృప్తి వ్యక్తం చేసారు.

కామెంట్‌లు