సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -148: -అయ్యో వదినా! అంతకు ముందు వొచ్చిన అన్నబంతిన తిందువు.ఇంతకు ముందు వొత్తే ఏరాలి బంతిన తిందువు" గిప్పుడెట్ల? ఎలుక పొయ్యి ఎత్తుక పోయిందే! అన్నట్లు
****
 "ఇగ జూసినవా అవ్వా!కిట్టమ్మొదిన శానతనం.గాల్లింటికి బోతే  ముచ్చెట్లు బలే శెప్తది..మా ఇకమతుల పిట్ట.ఎంత లావటోళ్ళనైన ఎత్తుకునుడు దించుట్ల ( పొగడ్డం తెగడ్డంల)మా శాలుది ( నేర్పరి)"
ఎన్నల్లేంది కిట్టమ్మొదినను యాజ్జేత్తున్నవేంది శెల్లే! ఏమన్న కొత్త శిత్రం జరిగిందా ఏంది? గా వొదిన ఊసెత్తినవంటే ఏదో ఉందన్నట్టే లెక్క."
"అవునవ్వా ! గా ముచ్చెటే శెబ్దామని వొచ్చిన.మొన్నీమద్ధె గాల్ల మన్వరాలికి ఒల్లెకట్టిచ్చి దావత్ జేసింది గద".
 "అవును శెల్లె! గా దావతుకు వొచ్చిన గని ఇంట్లె పందీరలేదని జెల్ది వొచ్చిన. 'అయ్యో! తిని పో వొదినా!' అని శానా సేపే బతిలాడింది గని ఉండలే! గా పిల్ల శేతుల ఓ వొంద బెట్టి వొచ్చిన. మీ బావ ఇంకో వొందన్న పెట్టకవోతివి అన్నడు గని గయ్యే పట్కొని బోయిన.గయ్యే పెట్టొచ్చిన శెల్లే!"
 "అయితెవాయె తీ .ఏం రంది బడక్కర్లే.గా వొదిన ముచ్చెటింటే నువ్వు సుత నా లెక్కనే ముక్కునేలేసుకుంటవు."
 "గదేం ముచ్చటో జెల్ది చెప్పు శెల్లె మస్తు ఆత్రంగుంది"
 "ముందోళ్ళకి ముంతొంపు ఎనకోల్లకి తెడ్డొంపు" లెక్కన జేసింది. అయినగని అవ్వా! గంత మందిని పిల్శినప్పుడు వొంటలు కాత్త ఎక్వే జేయించాలె గద.
 "గంత మంది రారనుకుందేమోలే శెల్లె.ఉచ్చితార్తంగా ఎందుకు తప్పు బట్టాలె".
 " గిదింటే నువ్వు గిప్పుడే బొయ్యి నాల్గు దొబ్బులు బెట్టొత్తవు.'
 "గయ్యాల. వాళ్ళన్న శెల్లెకి శాన పన్లుంటయని సాయానికి ముందొచ్చిండంట.వొదిన సుత వొద్దామంటే ఇంట్లె సాత్తున్న మేకలల్ల ఓ మేక సూడిదంట.ఏ పొద్దున ఈన్తదో తెల్వదు.గందుకని  పంచన్ నాడు వొత్తనందంట.
 పొద్దుగాల బయలెల్దామంటే గా మేక పంచన్ నాడే రెండు పిల్లల్ని ఈనిందట.గస్మంటప్పుడు పనుంటది గద. గవన్నీ తీర్సుకొని బస్సు ,ఆటో దొరకబుచ్చుకుని వొచ్చేతల్కి ఆలీసమైందట. గిక్కడ పంచెన్ల సుత అందరు తిని ఎవలి దార్న గాళ్ళు పోయిండ్రు. నేను సుత ఇంటికొచ్చిన.
అయితే ఏం జర్గింది శెల్లే!  వొదినె ఆలీషంగ వొచ్చిందని మన్సుల పెట్టుకున్న కిట్టమ్మొదిన మొకం గంటు వెట్కుని ఏం జెప్పినా ఇంటల్లేదట.
"వొదిన శాన దూరం నించి వొచ్చింది. ఆకలైతుందో ఏమో గింత ముద్ద తినమనాలన్న సోయి లేకుండా అన్నానికి లేపలేదట.
 ఇంగ గాళ్ళ వొదినే నోరు దెర్శి "వొదినా అన్నం వుందా! ఆకలైతుంది" అంటే "అయ్యో వదినా! అంతకు ముందు వొచ్చినా అన్న బంతిన తిందువు.గిప్పుడెట్ల ఎలుక పొయ్యి ఎత్తుక పోయిందే" అందట.
 గంతేనా "అయ్యో వదినా అంతకు ముందు వొచ్చినా అన్న బంతిన తిందువు.ఇంతకు ముందువొత్తే ఏరాలి బంతిన తిందువు.గిప్పుడెట్ల మరి ఎల్క పొయ్యి ఎత్తుక పోయిందే"?.
 "బలే జెప్పినవవ్వా! గీ సంగతి. నీకు సుత తెల్సా? అవ్వా!"
 గా  కిట్టమ్మొదిన మాటతీరు తెల్వందెవరికి. వాడకట్టంత తెల్సు గద . గింతకి గా వొదిన తిని బోయిందా?
 "ఏదవ్వా! అతి కట్టం మీద ఓ అరిటి కాయ శేతుల బెట్టిందట.గా  గింత పండు ఏం ఆకల్ని తీరుత్తది. గోడ పక్కకొచ్చి కండ్ల నీళ్ళు బెట్టుకుంది. నేనే అన్నవొండి లోపల్కి బిల్శి పచ్చి పులుసు,తియ్య పప్పు జేసి పెట్టిన. "నీ కడ్పు సల్లగుండ" నువ్వు బెట్టక పోతే గియ్యాల సద్దును శెల్లె " అంది.
 "మరీ గింత శానతనమా! ఏం మడ్సులో ఏమో! గంత ఊర్శినట్టయిపోద్దా ఇచ్చింత్రం గనీ"
  గదండీ సంగతి! "అయ్యో వదినా! గంతకు ముందు వొచ్చిన అన్న బంతిన తిందువు. గింతకు ముందు వొచ్చిన ఏరాలి బంతిన తిందువు.గిప్పుడెట్లా? ఎలుక పొయ్యి ఎత్కపోయిందే" అంటే గిదే మరి. గిట్లుంటయి కొందరి మర్యాదలు.మాటలే బెల్లం. పెట్టుడుండదు.గస్మంటోళ్ళని జూసే గిస్మంటి సామెతలు బుట్టినయి.

కామెంట్‌లు