ప్రేమలేఖలే...ప్రేమపావురాలు...: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ప్రియా ఓ ప్రియా...మంచుతో
మంటలను ఆర్పవచ్చు...
కానీ కఠినమైన మాయమాటలతో
ప్రేమ మంటలను ఆర్పలేము

అందుకే... 
ఈ ధరణిపై భానుడు
ప్రకాశించినంతకాలం
నా ప్రేమ ఎల్లప్పుడు
నీ హృదయాకాశంలో
వెలుగు కిరణమై 
ప్రకాశిస్తూనే ఉంటుంది
ఒక జీవనదిలా 
ప్రవహిస్తూనే ఉంటుంది
ఒక జలపాతంలా 
దూకుతూనే ఉంటుంది...

మన ఏడడుగులనడుగు
చెబుతాయి మన బంధం
కనువిందు చేసే
ఏడురంగుల ఇంద్రధనుస్సని...

మన మూడు
ముళ్ళనడుగు చెబుతాయి
నా కళ్ళలో నిత్యం నీ రూపమే
ఆరని దీపమై వెలుగుతుందని...

నిదుర రాక నీకై ఎదురుచూసే
నా కనురెప్పలనడుగు చెబుతాయి
నీ రాక నాకు ఒక నవవసంతమని...

నాతల దిండు నడుగు చెబుతుంది
కలలో కనిపించి కవ్వించే నీ రూపాన్ని 
ఎన్నిసార్లు గట్టిగా కౌగలించుకున్నానో...

గుప్పెడంత నా
గుండెనడుగు చెబుతుంది
అది ఏనాడో లబ్ డబ్ అనడం మానేసి
ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటోందని...

ఒక్కసారి నాచేతిలో
చెయ్యేసి చూడు ఒక్కసారి నన్ను
నీ బిగి కౌగిలిలో బంధించి చూడు...
ఒక్కసారి నా ఒడిలోకి వాలిచూడు..
ఒక్కసారి నా కళ్ళలోకి కళ్ళుపెట్టి చూడు...

ఆ స్వర్గమే దివి నుండి భువికి
దిగివస్తుంది నీకు సొంతమౌతుంది ఇక
మన మదినిండా వ్రాయని ప్రేమలేఖలే...
పడక గదినిండా ఎగిరేది ప్రేమపావురాళ్ళే...

ప్రియా ఓ ప్రియా...
పెళ్ళినాటి నా ప్రమాణం గుర్తుచేస్తున్నా
నీకెప్పుడూ నేను ఒక నిత్యసంతోషాన్నే
కానీ నీకెన్నడూ ఒక సమస్యను కానని.



కామెంట్‌లు