సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -138: -అపకారికి ఉపకారం  జేయాలె
****
"అవ్వా! మొత్తానికి గాని జుట్టు నాకు అందేకాడికొచ్చింది. ఇంగ జూస్కో గాని అంతు సూస్త. నా కశంత తీర్సుకుంట. నన్ను ఎన్నెన్ని మాటలన్నడని. తల్సుకుంటే రకతం సలసల మస్లుతున్నది తెల్సా అవ్వా?
 మొకమంత ఎట్లెట్లనో బెట్కొని మొగురం తేప తేపకూ తన్నుకుంట ఏదేదో తిడ్తున్నది అవ్వకి సమజవ్వ లేదు.
 ఏందిరా అయ్యా? ఎవలి మీద గంత గుస్సా అయితున్నవ్?
 "ఇంకెవలవ్వా! గా మారయ్యే.గాడే. గాని తానకి వో పనిమీద ఎల్తే.ఎంత అగుమానించిండని. నన్నో శాతగాని దద్దమ్మ కింద లెక్కగట్టి నోటికొచ్చినట్టు వాగిండు.అవుసరం మనదిగదాని నోటికి తాళమేసుకున్న. గప్పుడే అరికాలి మంట నెత్తికెక్కింది. నేనేంటో తెల్సి సుత గట్ల జేత్తడా?"
 "పిల్లగాండ్ల బడి వొయ్యిలు గొనుడు అప్పుడే  పొలానికి మందుకట్టలొచ్చి డబ్బులు గట్టి తెచ్చుకొనుడు గప్పుడే. పైసల కాడ కాత్త ఎటమటమై పదేలు సర్థురా! వోరం,పది రోజులకే తీరుత్తా  అంటే యిన్నడా? వొంద సద్విండు.శివరాకరాకరికి ఇచ్చిండా అంటే గది సుత లేదు.
నా పరేషాన్ చూసి నా దోత్తు లింగయ్య రెక్కాడితే గానీ డొక్కాడనోడు.నా పరిత్తితి జూసి రంది పడకుమని ఎంటనే పదేలు తెచ్చి శేతిల బెట్టిండు.
 గిప్పుడు పొలంల మోటరు కాలిపోయిందట.బాగు జెయ్యమని అడుగుతున్నడు. గాడన్న మాటలు ఎట్ల మరుత్తవ్వ  నువ్వే జెప్పు.
 గీ సుట్టుపక్కల మూడూల్లకి కరెంట్ మోటర్లు బాగు జేసేది నేనేనాయె.గది యాది మర్శిండు.గిప్పుడు సిగ్గు లేకుండా నాతాన కొచ్చి నీళ్లు లేకపోతే పొలం ఎండిపోద్ది.బాగుజెయ్యమని పొద్దు మాపు ఆసుబోశినట్టు తిర్గుతూ ఏడుకుంటున్నడు. గిప్పుడు గీ రెండు దినాలు ఆపితే సాలు.పొలమంత ఎండివోద్ది. గప్పుడుంటది ఆనికి బాద.గజ్జూసి నేను సంకలు గొట్టాలి."
 గా మాటలు ఇన్న అవ్వ కొద్ది సేపు మూగబొమ్మోలే మాట్లాడకుండ  మన్సుల ఇశారించబట్టింది.
 "ఒరే నాయినా!నీకో కత శెప్త గని శెవులు వారిచ్చి యిను.గీ వొయసుల కతలు కాకరకాయ లెందుకని శిరాకు పడకురా మాయ్యగని".
"అసలే శిరాగ్గా ఉన్నదంటేెె నడ్మల గీ కతొకటి.అవ్వ జెప్పినట్టు ఇనాల్సిందే.మొగురం వొదిలిపెట్టి అవ్వ తానకొచ్చి బల్లెపీట మీద కూసుని ఇగ జెప్పమని అన్నడు.
 మహా బార్త యుద్దం తెల్సుగద.గా యుద్దంల దోణుని కొడ్కొచ్చి ఓ రేత్రి దౌపతి ఐదుగురు కొడుకులను నిద్దట్లె ఉన్నప్పుడు గొంతులు కోసి సంపేత్తడు.  ఒక్క పాలే పసి కూనలైన ఐదుగురు కొడుకులు సచ్చిపోడంతో దౌపతి కంటికి పుట్టెడు ఏడుత్తుంటది.
 గా తర్వాత దినముల జేసిన యుద్ధంల పాండవులకు గా దోణుడి కొడ్కైన అశవత్తామ శేతికి శిక్కుతడు.గాన్ని బర్ర బర్ర దౌపతి కాడికి గుంజుకొచ్చి వీన్ని ముక్కలు ముక్కలు సేశి సంపుతం అంటరు.
ఇంకేంది! గప్పుడు దౌపతి సంపమనే శెప్పుంటది.గా పాపాత్ముడిని కుల్ల కుల్ల బొడిశి సంపాలె.
అన్న కొడుకుతో "అగ్గో! అయ్యా! గిక్కడ్నే తప్పుల కాలేశినవ్.గా సయిమంలో దౌపతి  ఓ గొప్ప మాటన్నది."నేను నా కన్నబిడ్డల్ని పోగొట్టుకొనే పుత్తర కడుపు శోకంతో ఏడుత్తున్న. ఈయన్ని సంపితే మాత్తరం నా పిల్లలు తిరిగొత్తరా ? రారు గద? మల్ల మనం సుత గస్మంటి పని సేశి గాయన తల్లికి కడుపు శోకం బెడ్తెట్ల? వొద్దు సంపకండని వదిలేయిత్తుంది.
గట్ల అపకారికి సుత ఉపకారం" శెయ్యాలె కొడుకా! గంతేగని కచ్చ బెట్టుకొని గది తీర్సుకుంటే ఏమొత్తది! ముత్తెమంత సేపు సంతోశం. గదే గాని మోటరు బావుజేసి ఇయ్యి. పచ్చని శేనుకు నీళ్ళు దొర్కుతయి ఎండిపోకుండైతది.గానిలో  సుత మార్పు వొత్తుంది సూడు! అంటుంది."
"గా మాటలు ఇనేతల్కి ఆలోచన్ల బడతడు కొడుకు ఆదిత్త. శిన్నప్పుడు సద్వుకున్న పద్దెం సుత"అపకారికి ఉపకారం శెయ్యాలె" పద్దెం యాది కొత్తుంది.
మన్సు నొప్పియ్యకుండ ఎంత బాగా శెప్పింది మా అవ్వ అన్కుంట " గానికి పోను జేసి గిప్పుడే వత్తనని శెప్తవ్వా " అన్నడు.
 తన మాటలకు  కొడుకులో వొచ్చిన మార్పుకు అవ్వ మస్తు సంబురపడ్డది.
మేలు జేశినోడికి మేలు చెయ్యడం గొప్ప గాదు. కీడు జేసినోడిని చమించి మేలు జేయడం గొప్ప గుణం రా అయ్యా!" అన్న అవ్వ మాటలు ఎంత ఇలువైనయో ఆనెక్క ఆనెక్క నెమ్మదిగా తెల్సొచ్చింది.
గదండీ సంగతి. "అపకారికి ఉపకారం శెయ్యాలె" అంటే గిదే మరి క్షమించడం కాత్త కట్టమే అనిపిత్తది గని. గట్ల మేలు చేత్తే మస్తు తుత్తిగ ఉంటుంది.
 
కామెంట్‌లు