మందు ఒక్కటే మానవత్వం..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
మాయమైపోతున్నాడమ్మా
మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు
మానవత్వమున్నవాడు అంటూ 
వాపోయాడు ఆశుకవి అందెశ్రీ గారు...

ఔను అరిషడ్వర్గాలనే
అంతర్గత దుర్గుణాలతో
మనిషి మలినమైపోతున్నాడు అవి 
అంతరంగంలోఎగిసే ఆరని అగ్నికణాలు...

నేడు ఎటువైపు చూసినా
స్వార్థం కులం బలం అహంకారం
ఆశ్రిత పక్షపాతాలే రాజ్యమేలుతున్నాయి 
కుట్రలతో కుతంత్రాలతో
పగాప్రతీకారాలతో అసూయాద్వేషాలతో
అక్రమాలకు పాల్పడుతూ మనిషి
అవినీతి ఊబిలో కూరుకుపోతున్నాడు...

ధనదాహంతో
పదవీ వ్యామోహంతో
మనిషి విర్రవీగుతున్నాడు
అశాంతితో మనిషి రగిలిపోతున్నాడు
దుష్ట తలంపులతో బ్రష్టుడైపోతున్నాడు...

కళ్ళు పొరలు కమ్మి కామంతో
మనిషి మృగంలా మారిపోతున్నాడు...

బుద్దభూమిని యుద్ధభూమిగా మారుస్తూ
రాజ్యకాంక్షతో రక్తపుటేరులు పారిస్తూ
మనిషి రాక్షసుడై పోతున్నాడు...

అందుకే అశాంతితో మనిషి లోలోపల
కుమిలి పోతున్నాడు కుళ్ళిపోతున్నాడు
దానికి "మందు ఒక్కటే మానవత్వం"...

అందుకే...
ఓ మానవత్వమా నీవెక్కడంటే.?
ఆకలికి అలమటించే
అభాగ్యులను అనాధలను
విధవలాండ్రను ఆదుకునే
అమృతమూర్తుల ఆలోచల్లో
ఆపన్న అభయ హస్తాలలో
దాతృత్వపు గుణంలో...దాగి
నేనక్కడంటోంది...మానవత్వం...

ఓ మానవత్వమా నీవెక్కడంటే..?
నీడలేని నిస్సహాయులకు
కొండంత అండగా ఉండే
నిరుపేదలకు మేమున్నామని
తోడుగా నీడగా  నిలిచే
నిస్వార్థపరులైన ధర్మమూర్తుల
సేవల్లో దైవత్వపు గుణంలో...దాగి
నేనక్కడంటోంది...మానవత్వం...

ఔను దానవత్వాన్ని దహనం చేస్తే
మానవత్వం చిగురించే వసంతమే...
అందుకే యుద్దవిమానాలతో
ఈ ధరణి దద్దరిల్లకుండా
ప్రతిచోటా ప్రశాంతత ప్రజ్వరిల్లేలా...

ప్రతి మనిషి మనసు నేలలో
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు...
సమానత్వం సౌభ్రాతృత్వాలకు...
పునాదులైన దయా జాలి కరుణలనే
మానవత్వపు విత్తనాలను నాటుదాం..
ప్రతిగుండెలో ప్రేమపూలను పూయిద్దాం...
విశ్వమంతా శాంతికపోతాల్ని ఎగురవేద్దాం.

జైహింద్... జై భారత్...
===============================


కామెంట్‌లు